breaking news
Yuddham
-
శివాంజనేయ యుద్ధం
పట్టాభిషేకం తర్వాత కొన్నాళ్లకు రాముడు అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడు. యాగాశ్వానికి పరిరక్షకులుగా భరత శత్రుఘ్న సుగ్రవ ఆంజనేయులను నియమించాడు.యాగాశ్వాన్ని పట్టుకున్న చాలామంది రాజులతో యుద్ధాలు జరిగాయి. హనుమంతుడి ప్రతాపం వల్ల యుద్ధాలలో ఎక్కువ ప్రయాస లేకుండానే రాజులు ఓటమిని అంగీకరించారు. చేసేది లేక యాగాశ్వాన్ని భరత శత్రుఘ్న సుగ్రీవ ఆంజనేయులకు అప్పగించారు. యాగాశ్వంతో పాటు అలా ముందుకు సాగుతుండగా, చక్రాంక నగరంలో రాజసుబాహుడు అనే రాజు యాగాశ్వాన్ని బంధించాడు. అతడితో కూడా యుద్ధం జరిగింది. అతడు హనుమంతుడి ఎదుటకు వచ్చి, బాణాలు ప్రయోగించాడు. చిర్రెత్తిన ఆంజనేయుడు పైకెగసి, కాలితో అతడి ఛాతీ మీద కొట్టాడు. ఆ దెబ్బకు రాజసుబాహుడు మూర్ఛిల్లాడు. మూర్ఛావస్థలలో అతడికి శ్రీరాముడు దర్శనమిచ్చాడు. బ్రహ్మాది దేవతలందరూ పూజిస్తున్న శ్రీరాముని రూపం అతడి మనోనేత్రానికి కనిపించింది. కొద్దిసేపటికి అతడు మూర్ఛ నుంచి తేరుకుని స్పృహలోకి వచ్చాడు. ‘హనుమంతుడి పాదస్పర్శ మహిమతో భగవంతుడైన శ్రీరాముడిని దర్శించుకోగలిగాను. నా అపరాధానికి మన్నించండి’ అంటూ యాగాశ్వాన్ని అప్పగించి, భరత శత్రుఘ్న సుగ్రీవ ఆంజనేయులను వినయంగా సాగనంపాడు.యాగాశ్వాన్ని తీసుకుని వారు ముందుకు సాగారు. దారిలో దేవపురం వచ్చింది. దేవపురం రాజు వీరమణి శివభక్తుడు. శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు అతడి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమంటే, ‘స్వామీ! నా రాజ్యంపై ఎవరైనా దాడికి వచ్చినట్లయితే, నన్ను రక్షించు’ అని కోరుకున్నాడు. శివుడు ‘తథాస్తు’ అన్నాడు. అప్పటి నుంచి వీరమణి తనను తాను అపరాజితుడినని అనుకోసాగాడు. తన రాజధాని నగరంలోకి ప్రవేశించిన యాగాశ్వాన్ని వీరమణి పట్టుకున్నాడు. దానిని తన అశ్వశాలలో బంధించాడు.‘ఇది రాముడి యాగాశ్వం. మర్యాదగా విడిచిపెట్టు, మేం ముందుకు సాగాలి’ అని భరత శత్రుఘ్నులు హెచ్చరించారు. వీరమణి పట్టించుకోలేదు. ‘నువ్వు మొండికేస్తే, యుద్ధంలో బుద్ధి చెప్పక తప్పదు’ తుది హెచ్చరికగా పలికాడు సుగ్రీవుడు.‘యుద్ధానికి నేను సిద్ధమే! నేను పట్టుకున్న అశ్వాన్ని మీరెలా తీసుకుపోతారో చూస్తాను’ అంటూ వీరమణి సేనలను సమాయత్తం చేసి, యుద్ధానికి సిద్ధమయ్యాడు.యుద్ధం హోరాహోరీగా జరిగింది.ఒకవైపు భరత శత్రుఘ్నులు శరపరంపరను కురిపిస్తుంటే, మరోవైపు సుగ్రీవుడు, హనుమంతుడు సేనా సమూహంలోకి చొరబడి విజృంభించారు. వారి నలుగురి ధాటికి వేలాదిగా ఉన్న వీరమణి సైన్యం కకావికలమైంది. వీరమణి పరమశివుడిని తలచుకున్నాడు. అతడికి ఇచ్చిన వరం ప్రకారం శివుడు స్వయంగా త్రిశూలం ధరించి, రణరంగంలోకి వచ్చి వీరవిహారం ప్రారంభించాడు.పరమశివుడి ధాటికి భరత శత్రుఘ్నులు, సుగ్రీవుడు మూర్ఛితులయ్యారు.హనుమంతుడు శివుడిని ఎదిరించి, యుద్ధం చేయడం ప్రారంభించాడు.కొంతసేపు యుద్ధం తర్వాత ‘మహాశివా! నేను రామబంటును. సేవాధర్మంగా రామకార్యం కోసం యుద్ధం చేస్తున్నాను. నువ్వెందుకు రామకార్యాన్ని అడ్డుకుంటూ యుద్ధం చేస్తున్నావు?’ అడిగాడు హనుమంతుడు.‘హనుమా! నువ్వు నీ స్వామి కోసం యుద్ధం చేస్తున్నావు. నేను నా భక్తుడి కోసం యుద్ధం చేస్తున్నాను’ చెప్పాడు శివుడు.ఇద్దరికీ నడుమ మరికొంత పోరు సాగింది. హనుమంతుడు తన గదతో శివుడి రథాన్ని కూల్చేశాడు. శివుడు నేల మీద పడ్డాడు. ‘హనుమా! నువ్వు మహావీరుడివి. యుద్ధంలో నా దెబ్బలను తట్టుకుంటూనే నా రథాన్ని కూల్చేశావు. నీ పరాక్రమానికి మెచ్చాను. ఏం కావాలో కోరుకో!’ అని అడిగాడు.‘నేను ద్రోణపర్వతానికి వెళ్లి, సంజీవని మూలిక తీసుకొస్తాను. అంతవరకు యుద్ధంలో మూర్ఛిల్లిన భరత శత్రుఘ్న సుగ్రీవులకు, మిగిలిన సైనికులకు ఏ ఆపదా రాకుండా రక్షణగా ఉంటానని వరమివ్వు, అది చాలు’ అన్నాడు హనుమంతుడు.‘తథాస్తు’ అన్నాడు శివుడు.హనుమ రివ్వున ఎగిరి ఆకాశమార్గాన ద్రోణ పర్వతానికి వెళ్లాడు. పర్వతం మీద ఎంత వెదికినా సంజీవని మూలిక జాడ కనుక్కోలేకపోయాడు. చివరకు పర్వతాన్నే పెకలించుకుపోవాలని నిశ్చయించుకుని, పర్వతాన్ని పెకలించసాగాడు.ఆకాశమార్గాన బృహస్పతి సహా దేవతలతో సంచరిస్తున్న దేవేంద్రుడు ఈ దృశ్యాన్ని చూసి చకితుడయ్యాడు. హనుమంతుడి మీదకు వజ్రాయుధం ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు.అయితే, బృహస్పతి అతడిని వారించాడు. ‘హనుమంతుడు రామభక్తుడు. అతడితో ఖ్యంగానే సమస్యను పరిష్కరించుకుందాం’ అని చెప్పి, ద్రోణాచలానికి దారితీశాడు. ఇంద్రాది దేవతలు అతణ్ణి అనుసరించారు.‘పర్వతాన్ని ఎందుకు పెళ్లగిస్తున్నావు?’ అని హనుమను అడిగాడు బృహస్పతి.‘ఇందులో సంజీవని మూలిక ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయాను. అందుకే పర్వతం మొత్తాన్ని తీసుకుపోవాలని అనుకుంటున్నాను’ బదులిచ్చాడు హనుమ.‘నీకు కావలసినది మూలికే కదా, నేను గుర్తించగలను. వెదికి ఇస్తాను’ అంటూ బృహస్పతి అతడికి సంజీవని మూలికను తెచ్చి ఇచ్చాడు.హనుమంతుడు సంతోషంగా మూలిక తీసుకుని, దేవపురం చేరుకున్నాడు. మూర్ఛితులైన భరత శత్రుఘ్న సుగ్రీవులు సహా సైనికులను మూలిక సాయంతో స్పృహలోకి రప్పించాడు. జరిగినదంతా చూసి, వీరమణి యాగాశ్వాన్ని మర్యాదగా అప్పగించాడు.∙సాంఖ్యాయన -
యుద్ధానికి సిద్ధం!
‘విక్కీ డోనర్’లాంటి సినిమాతో బాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకున్న యామి గౌతమ్ తెలుగులో రవిబాబు దర్శకత్వంలో ‘నువ్విలా’ చేసింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమా ‘యుద్ధం’. ఇందులో శ్రీహరి, తరుణ్ హీరోలుగా చేశారు. భారతీ గణేష్ దర్శకత్వంలో నట్టికుమార్-నట్టి లక్ష్మి నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ఆలస్యమైనప్పటికీ అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని, శ్రీహరి, తరుణ్‌ల మధ్య సాగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని, ఈ నెల 26న పాటలను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘స్టూడెంట్ లీడర్‌గా తరుణ్, మాస్ లీడర్‌గా శ్రీహరి తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. పాటలతో పాటు పోరాట సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, సమర్పణ: నట్టి క్రాంతి.