వేల్పుల– పులివెందుల మధ్య ఓ అవ్వను ఆప్యాయంగా పలకరిస్తున్న వైఎస్ జగన్
సాక్షి కడప: కనుచూపు మేర కటౌట్లు.. బాణా సంచా వెలుగు జిలుగులు.. అడుగడుగునా పూల వర్షం.. బైకులకు పార్టీ జెండాలు.. జై జగన్ నినాదాలు.. వెరసి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి, కోలుకున్న వైఎస్సార్‌సీపీ మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డి (రాము)ని పరామర్శించడానికి బుధవారం వైఎస్ జగన్ వేల్పుల వెళుతుండగా అభిమానులు, ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు.
కాన్వాయ్ వెంట భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్ వాహనం పైనుంచి.. నలువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తుండగా, వేల్పులలో అభిమానులు మిద్దెలపై నుంచి పూల వర్షం కురిపించారు. రోడ్డంతా పూలు పరిచి స్వాగతం పలికారు. మహిళలు కరచాలనం చేస్తూ వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసిన ఆనందంలో ...
అనంతరం రామలింగారెడ్డి ఇంట్లోకి వెళ్లిన వైఎస్ జగన్.. ఆయనతో చర్చించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల ముందు జరిగిన గొడవ గురించి మాట్లాడారు. రామలింగారెడ్డి తల్లి పార్వతమ్మ.. ఆయన సతీమణి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లింగాల ఉషారాణిలతో కూడా మాట్లాడారు. ఆ తర్వాత తిరిగి పులివెందులకు వచ్చే క్రమంలో కూడా అభిమానులు పెద్ద ఎత్తున రోడ్డుకు ఇరువైపులా చేరుకుని అభివాదం చేశారు.

విద్యార్థుల కోసం ఓ సెల్ఫీ
పలు చోట్ల అభిమానుల తాకిడికి కాన్వాయ్ ఆపి.. వారితో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో పది కిలోమీటర్ల దూరంలోని పులివెందులకు రావడానికి పది నిమిషాలకు బదులు ఒకటిన్నర గంటల సమయం పట్టింది. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ.. సెల్ఫీలు దిగుతూ మమేకమయ్యారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వైఎస్ జగన్‌ను కలిశారు.
చిన్నారికి సెల్ఫీ- పులివెందుల క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజలకు నమస్కరిస్తున్న వైఎస్ జగన్

వైఎస్ జగన్‌ను చూసి చిన్నారుల కేరింతలు

వేల్పులలో భారీ జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

వైఎస్ జగన్‌ను చూసిన ఆనందంలో విద్యార్థులు


