
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ఖాతాను ఫ్రాడ్ అకౌంటుగా ఎస్‌బీఐ వర్గీకరించడమనేది తమ వ్యాపారాలపై ఎలాంటి ప్రభావమూ చూపదని అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్‌లో (అడాగ్) భాగమైన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ స్పష్టం చేశాయి. ఆర్‌కామ్‌తో తమకెలాంటి వ్యాపార, ఆర్థిక సంబంధాలు లేవని, తమ రెండు సంస్థలు వేర్వేరుగా లిస్టెడ్ కంపెనీలుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని స్టాక్ ఎక్స్ఛేంజీలకు విడివిడిగా తెలిపాయి.
ఈ నేపథ్యంలో ఆర్‌కామ్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా తమ గవర్నెన్స్, మేనేజ్‌మెంట్, కార్యకలాపాలు, ఉద్యోగులు, షేర్‌హోల్డర్లపై ఎలాంటి ప్రభావమూ ఉండదని వివరించాయి. రుణాల మళ్లింపు ఆరోపణలతో ఆర్‌కామ్ ఖాతాను ఫ్రాడ్ అకౌంటుగా వర్గీకరించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఎస్‌బీఐ స్టాక్ ఎక్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కి ఇచ్చిన రుణాల్లో నిబంధనల ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం వంటి అంశాలు కనిపించాయని పేర్కొంది. మొత్తం రూ.31,580 కోట్ల రుణాల్లో సుమారు రూ.13,667 కోట్లు ఇతర రుణాల చెల్లింపులకు, రూ.12,692 కోట్లు సంబంధిత సంస్థలకు మళ్లించారని తెలిపింది.