కేంద్ర బడ్జెట్ 2026-27లో టెలికాం రంగానికి ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యయం గణనీయంగా పెరిగిందని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. భారత్ నెట్, బీఎస్ఎన్ఎల్ మూలధన అవసరాలు, స్పెక్ట్రమ్ వ్యయం, నెట్‌వర్క్ రోలౌట్‌తో పాటు ఇతర అంతర్గత అవసరాలను తీర్చేందుకు ఈ కేటాయింపులు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం టెలికాం రంగానికి రూ.53,000 కోట్ల కేటాయింపు ఉండగా, తాజా బడ్జెట్‌లో దాన్ని రూ.73,000 కోట్లకు పెంచినట్లు తెలిపారు. ఇది దాదాపు 40 శాతం వృద్ధి అని సింధియా వెల్లడించారు. టెలికాం మంత్రిత్వ శాఖకు, ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్‌కు కేటాయింపులు పెరగడానికి గల కారణాలపై ప్రశ్నించగా, బీఎస్ఎన్ఎల్‌ను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
“బీఎస్ఎన్ఎల్ ఏఆర్‌పీయూ (సగటున ఒక్కో యూజర్ ద్వారా వచ్చే ఆదాయం) రూ.90 నుంచి రూ.99కు దాదాపు 9 శాతం పెరిగింది. త్వరలో మూడు అంకెల స్థాయిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా మూడు విభాగాల్లోనూ ఆదాయం పెరిగింది. అంతర్గత నగదు ప్రవాహాలతో పాటు క్యాపెక్స్ ఇంజెక్షన్ అవసరం ఉంది. తద్వారా బీఎస్ఎన్ఎల్‌ను పునరుజ్జీవన మార్గంలో ముందుకు తీసుకెళ్లగలుగుతాం,” అని మంత్రి తెలిపారు.
ప్రతిపాదిత అదనపు బడ్జెట్‌లో గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ ప్రాజెక్ట్ అయిన భారత్ నెట్‌కు నిధులు కేటాయించినట్లు ఆయన చెప్పారు. బీఎస్ఎన్ఎల్‌కు స్పెక్ట్రమ్ కోసం సుమారు రూ.1.39 లక్షల కోట్ల విలువైన కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. టవర్లు, మౌలిక వసతులు, బ్యాటరీలు వంటి అన్ని అంశాల్లో సమగ్ర అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అలాగే ఈశాన్య ప్రాంత అభివృద్ధికి కేటాయింపులు కూడా గణనీయంగా పెరిగాయని సింధియా తెలిపారు. గతంలో రూ.4,495 కోట్లుగా ఉన్న సవరించిన అంచనాలను రూ.6,800 కోట్లకు పెంచామని, ఇది దాదాపు 50 శాతం వృద్ధి అని వివరించారు. ఈ బడ్జెట్‌లో ఈశాన్య ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్న ఆయన, పట్టణీకరణ, ఆరు రాష్ట్రాల్లోని ఐదు బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధి, 4,000 ఈ-బస్సుల ప్రవేశపెట్టడం, అలాగే ఆరోగ్యం మరియు విద్యా రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.


