పారిశ్రామిక విప్లవానికి బడ్జెట్ బాటలు | Union Budget 2026–27 Manufacturing Strategic Frontier Sectors | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక విప్లవానికి బడ్జెట్ బాటలు

Feb 1 2026 5:02 PM | Updated on Feb 1 2026 7:01 PM

Union Budget 2026–27 Manufacturing Strategic Frontier Sectors

కేంద్ర బడ్జెట్ 2026-27లో భారత ప్రభుత్వం దేశీయ ఉత్పాదక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కొన్ని పథకాలను ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ‘వికసిత్ భారత్’ దిశగా పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే కొన్ని వ్యూహాత్మక రంగాలకు పెద్దపీట వేశారు.

ప్రపంచానికి తయారీ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ అడుగులు వేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పనే ప్రధాన ఎజెండాగా కేంద్రం పలు కొత్త పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. చిప్ తయారీ నుంచి చౌకైన క్రీడా సామాగ్రి వరకు.. ప్రతి రంగంలో స్వయం సమృద్ధి సాధించేలా కేటాయింపులు జరిపినట్లు పేర్కొన్నారు.

ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం) 2.0

సెమీకండక్టర్ రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడానికి ఐఎస్‌ఎం 2.0ను ప్రకటించారు. కేవలం చిప్ తయారీ మాత్రమే కాకుండా, సెమీకండక్టర్ పరికరాలు, మెటీరియల్స్ ఉత్పత్తి, భారతీయ మేధో సంపత్తిని అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. ఇందుకోసం పరిశ్రమల భాగస్వామ్యంతో పరిశోధన, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

బయోఫార్మా ‘శక్తి’

ఫార్మా రంగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి రూ.10,000 కోట్ల కేటాయింపుతో ‘బయోఫార్మా శక్తి’ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మూడు కొత్త నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER)లను ఏర్పాటు చేస్తారు. 1000కి పైగా గుర్తింపు పొందిన క్లినికల్ ట్రయల్ సైట్‌ల నెట్‌వర్క్‌ను రూపొందిస్తారు.

అరుదైన ఖనిజాల అభివృద్ధి పథకం

చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేస్తారు. అరుదైన ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్, శాశ్వత అయస్కాంతాల తయారీకి ఈ పథకం ఊతమిస్తుంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగానికి అత్యంత కీలకం.

డెడికేటెడ్ కెమికల్ పార్కులు

దేశీయ రసాయన ఉత్పత్తిని పెంచడానికి రూ.600 కోట్లతో మూడు ప్రత్యేక కెమికల్ పార్కులను ‘ఛాలెంజ్ రూట్’(సాధారణంగా ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టును ఒకే చోట కాకుండా ఏ రాష్ట్రం అయితే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందో అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తారు. ఇందుకోసం రాష్ట్రాల మధ్య నిర్వహించే పోటీనే ఛాలెంజ్ రూట్) ద్వారా రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నారు.

ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ (ఈసీఎంఎస్‌)

ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాల తయారీని ప్రోత్సహించేందుకు ఈ పథకం కేటాయింపులను ఏకంగా రూ.40,000 కోట్లకు పెంచారు. దీనివల్ల మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల విడిభాగాలు భారత్‌లోనే తయారవుతాయి.

టెక్స్‌టైల్స్ రంగం - ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్

వస్త్ర పరిశ్రమ బలోపేతానికి నేషనల్ ఫైబర్ స్కీమ్, టెక్స్‌టైల్ విసర్తణ, ఉపాధి పథకాలు ఉన్నాయి. పాత టెక్స్‌టైల్ క్లస్టర్లను ఆధునీకరించడం వీటి ప్రధాన ఉద్దేశం.

ఇతర కీలక మౌలిక సదుపాయాల పథకాలు

కంటైనర్ తయారీ: గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ వాటాను పెంచడానికి రూ.10,000 కోట్లతో కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్.

ఇండస్ట్రియల్ క్లస్టర్లు: దేశవ్యాప్తంగా ఉన్న 200 పాత పారిశ్రామిక వాడలను (Clusters) ఆధునిక సాంకేతికతతో పునరుద్ధరించనున్నారు.

హైటెక్ టూల్ రూమ్స్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యాధునిక టూల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈలకు సాంకేతిక సహాయం అందిస్తారు.

క్రీడా సామగ్రి: సరసమైన ధరల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడా సామగ్రిని తయారు చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

నిర్మాణ పరికరాలు: అధిక విలువ కలిగిన నిర్మాణ, మౌలిక సదుపాయాల యంత్రాల తయారీని దేశీయంగా బలోపేతం చేయనున్నారు.

ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌ 2026-27 లైవ్‌ అప్‌డేట్స్‌

Advertisement
 
Advertisement
Advertisement