గుడి గంటల నాదం, తీరాన్ని తాకుతున్న అలల నాదంతో శ్రుతి కలిపిన వేళ, ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలు, పంచభూత క్షేత్రాలు, అమర్నాథ్, పశుపతినాథ్ ఆలయాల పండితుల శక్తివంతమైన, ధ్యానమయమైన వేద మంత్రోచ్ఛారణల నడుమ, శుక్రవారం సాయంత్రం రామేశ్వర క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడింది. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ సమక్షంలో సోమనాథ జ్యోతిర్లింగ మహా రుద్ర పూజతో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి.
తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా లక్షలాది భక్తులు అపార భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఈ కార్యక్రమం , రామేశ్వర తీరాన్ని ప్రార్థన, భక్తి, ఆధ్యాత్మిక జాగృతి కేంద్రంగా మార్చివేసింది.
రుద్రాభిషేకం అనేది ప్రాచీన వేద సంప్రదాయంలో భాగమైన పవిత్ర కర్మ. ఇందులో పరమశివుడు రుద్రుడి కరుణామయ స్వరూపంలో పూజింపబడతాడు. ఈ పూజ వలన భక్తులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయని, కోరికలు సాకారం అవుతాయని భక్తుల విశ్వాసం. పాలు, నెయ్యి, తేనె, నీరు తదితర పవిత్ర ద్రవ్యాలతో లింగాభిషేకం చేయడం, నిరంతర మంత్రోచ్ఛారణల ద్వారా మనస్సు, పరిసర వాతావరణం శుద్ధి అవుతాయని, అడ్డంకులు వ్యతిరేక భావనలు తొలగిపోతాయని భావిస్తారు.

గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలు, అమర్నాథ్, పశుపతినాథ్ ఆలయాల నుండి వచ్చిన ప్రముఖ పండితులు సామూహికంగా ఈ మహా పూజకు ప్రారంభించారు. ఈ పవిత్ర కర్మలో భాగంగా, ఆయా ఆలయాల నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన తీర్థ జలాలను సమర్పించడం భారతదేశ ఆధ్యాత్మిక ఏకత్వాన్ని ప్రతిబింబించింది.
ఈ సందర్భానికి మరింత విశిష్టత చేకూర్చుతూ, ప్రకృతిలోని పంచభూతాలను సూచించే పంచభూత క్షేత్రాల నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాలను కూడా ఈ రుద్రాభిషేకంలో సమర్పించారు. ఈ పవిత్ర జలాల సంగమం ప్రకృతి, భక్తి, వేద జ్ఞానాల సమన్వయాన్ని ప్రతిఫలించింది.
“గురుదేవ్ సృష్టించిన దైవిక వ్యవస్థ, ఇక్కడ ఏర్పడిన అపార ఆధ్యాత్మిక వైభవం కారణంగా ఈ మహా రుద్ర పూజను తరతరాలు గుర్తుంచుకుంటాయి,” అని వారణాసి కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిన పండిత్ రమానంద్ దుబే అన్నారు. “జ్యోతిర్లింగాలు అన్నీ ఇక్కడే కొలువై ఉన్నట్లుగా అనిపిస్తోంది.”
సాయంత్రం కార్యక్రమంలో, 7వ శతాబ్దానికి చెందిన ప్రముఖ శైవ నాయనార్ సంత్ తిరుజ్ఞానసంబందర్ రచించిన పవిత్ర కొలారు పతిగాన్ని ప్రపంచవ్యాప్తంగా 180కు పైగా దేశాలలోని దాదాపు రెండు కోట్ల మంది భక్తులు ఏకకాలంలో పారాయణ చేశారు. ఆలయాలు, ఇళ్లు, సామాజిక కేంద్రాల నుండి భక్తి స్వరాలు ఏకకాలంలో మార్మోగుతూ, భౌగోళిక సరిహద్దులను దాటి శాంతి సామరస్యాలకు చిహ్నంగా, శక్తివంతమైన విశ్వ ప్రార్థనగా మారాయి.
ఈ మహా రుద్ర పూజతో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45వ వార్షికోత్సవ వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గత నాలుగు దశాబ్దాలుగా, ఈ సంస్థ ధ్యానం, ఒత్తిడి నిర్వహణ కార్యక్రమాలు, మానవతా సహాయం, విద్య, పర్యావరణ పరిరక్షణ, శాంతి నిర్మాణ కార్యక్రమాల ద్వారా కోట్లాది మందికి చేరువైంది. రామేశ్వరంలో జరిగిన ఈ కార్యక్రమం సేవ, అంతర్గత పరివర్తన వైపు మానవాళి సాగించే నిరంతర ప్రయాణానికి స్ఫూర్తిగా నిలిచింది.


