భోపాల్: భారతీయ రైల్వే వ్యవస్థలో కలవరపరిచే మోసం బయటపడింది. పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు గౌరవ సూచకంగా ఇచ్చిన బంగారు పూత పూసిన ‘వెండి’ నాణేలు నకిలీవని తేలాయి. అధికారికంగా బంగారు పూత పూసిన వెండిగా పేర్కొన్న ఈ నాణేలు దాదాపు రాగితోనే తయారైనవని ప్రయోగశాల పరీక్షలు వెల్లడించాయి.
పశ్చిమ మధ్య రైల్వే నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత అందుకున్న నాణేన్ని మాజీ చీఫ్ లోకో ఇన్‌స్పెక్టర్ టీకే గౌతమ్ గర్వంగా ప్రదర్శించారు. జీవితకాల సేవకు గుర్తుగా భావించిన ఆ నాణేలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ‘ఇలాంటి నాణేలను గతంలో ప్రభుత్వ మింట్‌లో తయారు చేసేవారు. వాటికి ఒక విలువ ఉండేది. ఇప్పుడు ప్రతి రిటైర్డ్ ఉద్యోగి తనకు ఇచ్చిన గౌరవం కూడా నకిలీదేనా అని అనుమానపడుతున్నాడు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నాణేలు అసలు వెండివే కాదని పరీక్షలు తేల్చడంతో ఆ ఆందోళన షాక్‌గా మారింది. 36 సంవత్సరాల సేవ అనంతరం 2025 జనవరిలో భోపాల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి పదవీ విరమణ చేసిన హస్రత్ జహాన్ మాట్లాడుతూ.. ‘ఇది 99 శాతం వెండి అని మాకు చెప్పారు. నా డ్రాయింగ్ రూమ్‌లో ఎంతో జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఇప్పుడు రైల్వే స్వయంగా ఇది రాగి అని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం బాధాకరం. ఇది మా సేవకు ఇచ్చిన గౌరవ చిహ్నం’ అని అన్నారు.
కోట్ల రూపాయల కుంభకోణం
మొత్తం 3,640 నాణేల సరఫరా కోసం ఇండోర్‌కు చెందిన మెస్సర్స్ వయబుల్ డైమండ్స్ సంస్థకు 2023 జనవరి 23న కొనుగోలు ఆర్డర్ జారీ అయింది. భోపాల్‌లోని వెస్ట్ సెంట్రల్ రైల్వే జనరల్ స్టోర్స్ డిపో ఈ నాణేలను కొనుగోలు చేసింది. రైట్స్ (RITES) సంస్థ నుంచి 3,631 నాణేలకు తనిఖీ ధృవీకరణ పత్రం కూడా పొందారు. ఒక్కో నాణెం 20 గ్రాముల వెండితో తయారు చేసి బంగారు పూత వేయాల్సి ఉండగా, దాని ధర రూ.2,000 నుంచి రూ.2,200గా నిర్ణయించారు. ఈ లెక్కన ఒక్కో నాణేంలో సుమారు రూ.2,200 వరకు మోసం జరిగి ఉండవచ్చని అంచనా. మొత్తం మీద ఇది కొన్ని కోట్ల రూపాయల కుంభకోణంగా మారే అవకాశం ఉంది.
నాణ్యతపై అనుమానాలు తలెత్తడంతో రైల్వే విజిలెన్స్ విభాగం ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ప్రయోగశాలలు, ప్రభుత్వ ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహించించింది. అందులో ఈ నాణేలు దాదాపు పూర్తిగా రాగితో తయారైనట్లు తేలింది. ఈ విషయాన్ని ధృవీకరించిన పశ్చిమ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హర్షిత్ శ్రీవాస్తవ.. పరీక్షల్లో అవకతవకలు బయటపడ్డాయని, మిగిలిన నాణేలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సరఫరాదారుని బ్లాక్‌లిస్ట్ చేసి, భోపాల్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ఉమ్మడి దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.


