
ఆటో విడిభాగాల దేశీ కంపెనీ టాటా ఆటోకాంప్ తాజాగా యూరోపియన్ దిగ్గజం స్కోడా గ్రూప్‌తో చేతులు కలిపింది. తద్వారా రైల్వే రంగ పరికరాల తయారీకి వీలుగా భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనున్నాయి. జేవీ దేశీయంగా రైల్వే ప్రొపల్షన్ సిస్టమ్స్, కంపోనెంట్స్ తయారు చేయనుంది. దీంతో భారత్‌కు మల్టీ మిలియన్ యూరో పెట్టుబడులు లభించనున్నాయి.
ఇదీ చదవండి: కుబేరులకు దేశాలు రెడ్‌కార్పెట్
తాజా భాగస్వామ్యం వృద్ధిలో ఉన్న దేశీ రైల్వే, మొబిలిటీ మార్కెట్లకు మద్దతివ్వనున్నట్లు టాటా ఆటోకాంప్ ఒక ప్రకటనలో పేర్కొంది. యూరోపియన్ దిగ్గజం స్కోడా గ్రూప్ ప్రధానంగా ప్రజా రవాణాకు వినియోగించే వాహన విడిభాగాల తయారీలో పేరొందింది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల సిస్టమ్స్, విడిభాగాల మార్కెట్లో టాటా ఆటోకాంప్ పటిష్ట వాటాను కలిగి ఉంది. జేవీ ప్రధానంగా మీడియం, హైస్పీడ్ ప్రాంతీయ రైళ్లు, మెట్రోలు, లైట్ రైల్ వాహనాల తయారీలో వినియోగించే కన్వెర్టర్లు, డ్రైవ్స్, ఆగ్జిలరీ కన్వెర్టర్లు తదితరాలను రూపొందించనుంది.