రైల్వేలో పెద్ద స్కామ్: వెండి పతకాలను అమ్ముదామని వెళ్తే.. షాక్! | Silver Medals Gifted To Retired Railway Staff They Were Made Of Copper Here is Details | Sakshi
Sakshi News home page

రైల్వేలో పెద్ద స్కామ్: వెండి పతకాలను అమ్ముదామని వెళ్తే.. షాక్!

Jan 16 2026 5:41 PM | Updated on Jan 16 2026 6:47 PM

Silver Medals Gifted To Retired Railway Staff They Were Made Of Copper Here is Details

భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మక సంస్థగా గుర్తింపు పొందిన 'ఇండియన్ రైల్వే'లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక భారీ స్కామ్ కలకలం రేపుతోంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు.. కృతజ్ఞతా సూచకంగా అందించాల్సిన వెండి నాణేలు/పతకాలు రాగితో తయారైనవిగా తేలడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఈ ఘటనతో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు మోసపోయినట్లు తెలుస్తోంది.

రైల్వే సేవల్లో దశాబ్దాలపాటు అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో వెండి పతకాలు అందించడం ఒక సంప్రదాయం. ఇది వారి సేవలకు గుర్తింపుగా భావించబడుతుంది. అయితే ఈ పతకాలు నిజంగా వెండివేనా అనే అనుమానం మొదలై, కొందరు టెస్ట్ చేయించగా.. ఇందులో కేవలం 0.23 శాతం మాత్రమే వెండి ఉందని, మిగిలినది రాగి అని తెలిసింది.

ఈ మోసం 2023 - 2025 మధ్య పదవీ విరమణ చేసిన వెస్ట్ సెంట్రల్ రైల్వేలోని భోపాల్ డివిజన్‌లోని వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. రైల్వేస్ 2023 జనవరి 23న ఇండోర్‌కు చెందిన ఒక కంపెనీకి 3,640 నాణేలకు ఆర్డర్ ఇచ్చింది. అందులో 3,631 నాణేలను భోపాల్‌లోని జనరల్ స్టోర్స్ డిపోకు సరఫరా చేశారు.

ఒక్కో నాణెం కోసం రూ. 2200 నుంచి రూ. 2500 ఖర్చు అయినట్లు అంచనా. అయితే వెండి స్థానంలో రాగి ఉపయోగించడం వల్ల మొత్తం కుంభకోణం రూ. 90 లక్షలకు పైగా ఉందని తెలుస్తోంది. రైల్వేలు ఆ కంపెనీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, సరఫరాదారుని బ్లాక్‌లిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించాయి.

ఇండియన్ రైల్వేస్ ఈ నాణేలను గతంలో ప్రభుత్వ టంకశాలలో ముద్రించేది. అప్పుడు వీటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉండేది. ఇప్పుడు వీటిని వేరే కంపెనీ తయారు చేయడం వల్ల.. ప్రతి రిటైర్డ్ ఉద్యోగి తమ గౌరవ సూచికంగా పొందే పతకం/నాణెం కూడా నకిలీదేనా అని ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement