
మనలో చాలామంది ఇతర దేశాల పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడాలనుకుంటారు. అయితే ఇది మధ్యతరగతి వారికి కొంత కష్టం కావొచ్చుకానీ, ధనవంతులకు మాత్రం సులువే. అందుకు అనుగుణంగా ప్రస్తుతం చాలా దేశాలు వాటి సిటిజన్‌షిప్ నియమాల్లో మార్పులు తీసుకొస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత మొన్నామధ్య ఆ దేశ పౌరసత్వం పొందాలంటే గోల్డ్‌కార్డు వీసా తీసుకోవాలని దాన్ని ప్రదర్శించారు. డబ్బు కడితే చాలా దేశాల పౌరసత్వం కార్డు మీ జేబులో ఉంటుంది. ఈ లిస్ట్‌లో కేవలం యూఎస్‌తోపాటు చాలా దేశాలే ఉన్నాయి. ప్రధానంగా ఏయే దేశాలు తమ పౌరసత్వం కోసం ఎలాంటి నిబంధనలు పెట్టాయో తెలుసుకుందాం.
యూఎస్‌ఏ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఐదు మిలియన్ డాలర్ల(సుమారు రూ.44 కోట్లు) విలువైన కొత్త గోల్డ్ కార్డు వీసాలు ప్రారంభించింది. సంపన్న విదేశీయులకు గోల్డ్ కార్డులను అందించడానికి ట్రంప్ ఈ కొత్త ప్రణాళికను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టారు. ఇది వారికి యూఎస్ రెసిడెన్సీ, పౌరసత్వానికి అవకాశం కల్పిస్తుంది. దాంతోపాటు అమెరికా ఖజానాకు ట్రిలియన్ల ఆదాయాన్ని సృష్టించగలదని, ఇది దేశ రుణాన్ని తగ్గించడానికి దోహదం చేస్తుందని తెలిపారు. కొత్త గోల్డెన్ కార్డు కొంత వరకు గ్రీన్ కార్డు మాదిరి వెసులుబాటు అందిస్తున్నా ప్రధానంగా సంపన్నులపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.
అమెరికాలో పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన వీసా(ఈబీ-5 వీసా) పాలసీని ట్రంప్ మార్చాలని యోచించారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు ‘గోల్డ్ కార్డ్’ వీసాను మంజూరు చేశారు. ఈ వీసాను ఐదు మిలియన్ డాలర్ల(సుమారు రూ.44 కోట్లు)తో పొందాల్సి ఉంటుంది. యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెబ్‌సైట్ ప్రకారం, ఈబీ-5 వీసా విధానాన్ని ఉద్యోగ కల్పన-విదేశీ పెట్టుబడిదారుల మూలధన పెట్టుబడుల ద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి 1990లో కాంగ్రెస్ ఆమోదించింది. 2021 సెప్టెంబరు నుంచి 2022 సెప్టెంబరు 30వ తేదీ వరకు దాదాపు 8వేల మంది ఈ వీసాలను పొందారు.
జన్మతః పౌరసత్వాన్ని గుర్తించరు..
ఈబీ-5 ద్వారా పెట్టుబడిదారులు, వారి జీవిత భాగస్వాములు.. 21 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అవివాహిత పిల్లలు నాన్-టార్గెటెడ్ ఎంప్లాయిమెంట్ ఏరియా (టీఈఏ) ప్రాజెక్టులో 1.8 మిలియన్ డాలర్లు లేదా టీఈఏ ప్రాజెక్టులో కనీసం 8,00,000 డాలర్లు పెట్టుబడి పెడితే శాశ్వత నివాసానికి అర్హులు. అయితే, ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని అధికారులు గుర్తించారు. దాంతో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత జన్మతః పౌరసత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చి వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ జన్మతః పౌరసత్వ విధానం కొనసాగుతోంది.
సింగపూర్ గోల్డెన్ వీసా
వ్యాపార అవకాశాలు, అధిక జీవన నాణ్యతను కోరుకునే అధిక నికర విలువ కలిగిన వ్యక్తులకు సింగపూర్ గమ్యస్థానంగా తోస్తుంది. సింగపూర్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ (జీఐపీ) ద్వారా భారీ పెట్టుబడులు పెట్టేవారికి పౌరసత్వం కల్పిస్తున్నారు. దేశంలో శాశ్వత ఉనికిని చాటుకోవాలనుకునే అల్ట్రా-హైనెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్‌డబ్ల్యూఐ) కోసం ఈ వీసా ప్రోగ్రామ్ రూపొందించారు. ఈ వీసా ప్రాసెసింగ్ సమయం సాధారణంగా 9–12 నెలలుగా ఉంటుంది. జీఐపీలో పౌరసత్వం పొందాలంటే కనీసం 10 మిలియన్ సింగపూర్ డాలర్లు(రూ.67 కోట్లు) పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. జీఐపీకు అర్హత పొందాలంటే దరఖాస్తుదారులు బిజినెస్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌లో నిరూపితమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉండాలి. టెక్, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్ లేదా ఫైనాన్స్ వంటి ఆమోదించబడిన రంగాల్లో ఒకదానిలో బిజినెస్ చేస్తుండాలి.
పౌరసత్వం ఎప్పుడు వస్తుందంటే..
గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ కింద పర్మినెంట్ రెసిడెన్సీ (పీఆర్) హోదా పొందిన రెండేళ్ల తర్వాత, దరఖాస్తుదారులు ప్రత్యేకంగా సింగపూర్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియలో కీలకమైన షరతు ఉంది. సింగపూర్ ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు. అందువల్ల ఆ దేశ పౌరసత్వం పొందడానికి దరఖాస్తుదారులు తమ ప్రస్తుత పౌరసత్వాన్ని వదులుకోవాలి.
ప్రయోజనాలు
సింగపూర్ గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ పెట్టుబడిదారులకు అందించే వీసా ఉంటే 190కి పైగా దేశాలకు ప్రత్యేకంగా వీసా లేకుండా ప్రయాణించవచ్చు. సింగపూర్‌లో గరిష్టంగా 24% వరకు మాత్రమే వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచ స్థాయి వైద్యం, విద్య, ఉన్నత జీవన ప్రమాణాలకు సింగపూర్ కీలకంగా మారింది.
ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
యూకే
యూకేలో ఈ గోల్డ్‌కార్డ్ వీసాను అధికారికంగా ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాగా పిలుస్తారు. పెట్టుబడిదారులను, ప్రతిభావంతులైన ఆకర్షించడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి యూకే ప్రయత్నాల్లో భాగంగా 2020లో ఈ వీసాను ప్రవేశపెట్టింది. ఇది యూకేలో వ్యాపారం చేయాలనుకునే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. ఈ వీసా 3 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. తర్వాత శాశ్వత నివాసానికి ఇండెఫినెట్ లీవ్ టు రిమేన్(ఐఎల్ఆర్) కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఐఎల్ఆర్ ప్రక్రియలో దరఖాస్తుదారులు కనీసం 5 సంవత్సరాలు (ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాపై గడిపిన సమయంతో సహా) యూకేలో నివసించినట్లు రుజువు చేయాలి. ఇతర నివాస, ఆదాయ ప్రమాణాలను చేరుకోవాలి. వ్యాపారంలో కనీసం 50000 పౌండ్లు(రూ.58,29,000) పెట్టుబడి పెట్టాలి.
ఈ వీసాకు అర్హతలు..
ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాకు అర్హత సాధించడానికి దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఆమోదం పొందాలి. యూకే ప్రభుత్వం గుర్తించిన బిజినెస్ ఇంక్యుబేటర్, ఇన్వెస్టర్ ద్వారా ఆమోదం పొందాలి. మీ వ్యాపార ఆలోచన సృజనాత్మకమైనదని, ఆచరణీయమైనదని ఆ ఈ సంస్థ ధ్రువీకరించాలి. దరఖాస్తుదారులు బీ2 స్థాయి ఇంగ్లిష్ (సీఈఎఫ్ఆర్ స్కేల్) కలిగి ఉండాలి. ఇది అప్పర్ ఇంటర్మీడియట్ నైపుణ్యానికి సమానం. ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా దీన్ని నిరూపించవచ్చు.