
5 లక్షల మందికి వీసా ఇచ్చేలా ప్రణాళికలు
ఇటలీ ప్రస్తుతం కార్మిక కొరత, జనాభా క్షీణత సమస్యలతో సతమతమవుతోంది. వాటిని పరిష్కరించడానికి ఆ దేశం కొన్ని సాహసోపేతమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇటలీ ప్రభుత్వం 2026-2028 మధ్య యురోపియన్ యూనియన్‌యేతర పౌరులకు దాదాపు 5,00,000 వర్క్ వీసాలను జారీ చేసే ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించింది. ఈ వ్యూహాత్మక నిర్ణయం దేశ జనాభాను స్థిరపరుస్తూ, ఆర్థిక భవిష్యత్తుకు ఊతం ఇచ్చేలా ఉంటుందని నమ్ముతుంది.
వర్క్ వీసా విస్తరణకు సంబంధించిన కీలక వివరాలు
వచ్చే మూడేళ్లలో ఈయూయేతర పౌరులకు మొత్తం 4,97,550 వర్క్ పర్మిట్లు జారీ చేయాలని ఇటలీ యోచిస్తోంది. ఇది దేశంలోకి వచ్చే వలసదారులను గణనీయంగా పెంచుతుంది. స్థానికంగా లేబర్ మార్కెట్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఇది హైలైట్ చేస్తుంది. ఈ విధానం ద్వారా సంవత్సరాల వారీగా కింద తెలిపినట్లు వర్క్ పర్మిట్లు జారీ చేయనున్నారు.
2026: 164,850 వర్క్ పర్మిట్లు
2027: 166,350 వర్క్ పర్మిట్లు
2028: 166,350 వర్క్ పర్మిట్లు
సిబ్బంది అవసరమయ్యే రంగాలు..
దేశవ్యాప్తంగా క్లిష్టమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న వివిధ రంగాలకు ఈ వీసాలను పంపిణీ చేయనున్నారు. అందులోని కొన్ని పరిశ్రమలు కింద ఇస్తున్నాం.
వ్యవసాయం
నిర్మాణ రంగం
ఆరోగ్య సంరక్షణ (ముఖ్యంగా వైద్యులు, నర్సులు)
టూరిజం
తయారీ రంగం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్‌తో సహా డిజిటల్ సేవల రంగం.
పైన తెలిపిన రంగాలు దేశీయ వీసా విధానం ద్వారా ఇటలీ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.
ఎందుకు ఇలా చేస్తోందంటే..
లేబర్ కొరత
ఇటలీ కంపెనీలు తమ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేయడానికి నానా తంటాలు పడుతున్నాయి. వాస్తవానికి 70% కంటే ఎక్కువ ఇటాలియన్ కంపెనీలు కార్మికులను నియమించడంలో తీవ్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ కొరత దేశీయంగా అనేక పరిశ్రమల్లో విస్తరించింది.
రెస్టారెంట్లు, హోటళ్లు వంటి సర్వీసుల్లో 2,58,000 ఖాళీలు
45,000 మంది వైద్యులు, 65,000 మంది నర్సులు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడిని ఎత్తి చూపుతోంది.
ఇంజినీరింగ్, గ్రీన్ ఎకానమీలో 2,80,000 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం. ఈ విభాగంలో ప్రతిభావంతులకు డిమాండ్ పెరుగుతోంది.
డిజిటల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్.
జనాభా సంక్షోభం
ఇటలీ జననాల రేటు తగ్గుతోంది. దాంతో జనాభా కుంటుపడుతోంది. 2024లో జనాభా 37,000 తగ్గింది. జననాల కంటే 2,81,000 ఎక్కువ మరణాలు సంభవించాయి. 2050 నాటికి ఇటలీలో 34% మంది 65 ఏళ్లు పైబడి వయసు ఉంటారని అంచనా. స్థిరమైన శ్రామిక శక్తి, ఆర్థిక వ్యవస్థను కొనసాగించడానికి ఇటలీ 2050 నాటికి సుమారు 10 మిలియన్ల(ఒక కోటి) వలసదారులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కొత్తగా ప్రకటించిన వర్క్ వీసా ప్రోగ్రామ్ ఈ లక్ష్యసాధనలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు.
భారత్ ఎలా అర్థం చేసుకోవాలంటే..
వేగంగా పెరుగుతున్న శ్రామిక జనాభా ఉన్న భారతదేశం ఇటలీ వర్క్ వీసాలతో గణనీయంగా ప్రయోజనం పొందనుంది. భారత్‌లో ఇటలీ రాయబారి ఆంటోనియో బార్టోలి ‘ఇరు దేశాల మధ్య సమన్వయం’గా ఈ వ్యవహారాన్ని అభివర్ణించారు. ముఖ్యంగా హెల్త్ కేర్, ఇంజినీరింగ్, హాస్పిటాలిటీ, ఐటీ వంటి రంగాల్లోని వారికి ఇటలీ లేబర్ మార్కెట్లో పుష్కలమైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
ఏయే రంగాల్లో ఎవరికి అవకాశం..
హెల్త్‌కేర్: డాక్టర్లు, నర్సులు, మెడికల్ ప్రొఫెషనల్స్‌కు మంచి డిమాండ్ ఉంది.
ఇంజినీరింగ్: ఇటలీ పారిశ్రామిక రంగాలకు, గ్రీన్ ఎకానమీకి నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు అవసరం.
హాస్పిటాలిటీ అండ్ టూరిజం: ఇటలీ గ్లోబల్ టూరిజం హబ్ కావడంతో ఆతిథ్య రంగంలోని కార్మికులకు గిరాకీ ఉంటుంది.
డిజిటల్, ఐటీ: ఐటీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్ భారతీయ టెక్ ప్రతిభావంతులకు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అవకాశాలను సృష్టిస్తుంది.
ఇటలీ ప్రభుత్వం చట్టపరమైన వలసదారుల హక్కులను సంరక్షించేదుకు కట్టుబడి ఉందని తెలిపింది. అదేసమయంలో అక్రమవలసలకు సహించబోమని తేల్చి చెప్పింది. సురక్షితమైన, నియంత్రిత వలసలను ప్రోత్సహించే మార్గాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. ఇటువంటి వలసలకు సహాయపడే దేశాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పింది.
👉 వర్క్ వీసా ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియాలంటే క్లిక్ చేయండి
వీసా అప్లికేషన్ కోసం కావాల్సిన ధ్రువపత్రాలు
జాబ్ ఆఫర్ లెటర్
ఆమోదం పొందిన నూలా ఓస్టా(వర్క్ పర్మిట్)
వీసా దరఖాస్తు ఫారం
పాస్‌పోర్ట్
ఇటలీలో వసతి రుజువు కోసం అద్దె ఒప్పందం లేదా మీరు చేరబోయే సంస్థ లేఖలో అక్కడ ఉండటానికి వసతి ఉందని ధ్రువీకరించుకోవాలి.
ఆర్థిక భరోసా: మీరు సంపాదించడం ప్రారంభించే వరకు ఇటలీలో మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి తగినంత ఆర్థిక వనరులు మీకు ఉన్నాయని ధ్రువపరిచేలా పత్రాలు ఉండాలి. ఇందులో బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా స్పాన్సర్ లెటర్ ఉండవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్: ఇటలీలో దరఖాస్తుదారుకు చెల్లుబాటు అయ్యే ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి.
ఇటలీలో డిమాండ్‌లో ఉన్న ఉద్యోగాలు
స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఉద్యోగాలు: భవన నిర్మాణ కార్మికులు (మేస్త్రీ, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వెల్డర్)
ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్లు
మెకానికల్ హెల్పర్లు
సేఫ్టీ ఆఫీసర్లు
హెల్త్ కేర్: నర్సులు, వృద్ధుల సంరక్షణ సహాయకులు, మెడికల్ టెక్నీషియన్లు
డిజిటల్, ఇంజినీరింగ్: సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు, డేటా సైంటిస్టులు, ఏఐ/ఎంఎల్ ఇంజినీర్లు, గ్రీన్ ఎనర్జీ టెక్నీషియన్లు.
టూరిజం: హోటల్ సిబ్బంది, రెస్టారెంట్ కార్మికులు, గృహనిర్వహణ సిబ్బంది, రిటైల్ సిబ్బంది.
ఇదీ చదవండి: టాటా మోటార్స్ నుంచి మినీ ట్రక్‌లు.. ధర ఎంతంటే..
వీసా దరఖాస్తుదారులకు కొన్ని టిప్స్..
బేసిక్ ఇటాలియన్ నేర్చుకోవాలి. అన్ని రంగాల్లో పని చేసేందుకు ఇటాలియన్ భాషలో ప్రావీణ్యం అవసరం లేనప్పటికీ, భాష ప్రాథమిక పరిజ్ఞానం అవకాశాలను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఆతిథ్యం, సంరక్షణ, నిర్మాణ రంగంలో పని చేస్తున్నవారికి ఎంతో తోడ్పడుతుంది.
త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. ఇటలీ వర్క్ వీసా ప్రోగ్రామ్ కోటా ఆధారిత వ్యవస్థ (డెక్రెటో ఫ్లూస్సీ) కింద పనిచేస్తుంది. అంటే ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలో అనుమతులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ముందే దరఖాస్తు చేసుకోవాలి.
రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు లేదా ఎంప్లాయర్ టైఅప్‌లను పరిశీలించాలి. లైసెన్స్ పొందిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు లేదా ఇటలీ సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న ఏజెన్సీల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.