
వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ తాజాగా కార్గో రవాణా కోసం ఏస్ ప్రో పేరిట 4–వీల్ మినీ ట్రక్కులను ప్రవేశపెట్టింది. వీటి ధర రూ. 3.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు 750 కేజీల పేలోడ్ సామర్థ్యంతో, పెట్రోల్, బై–ఫ్యుయెల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో ఈ వాహనాలు లభిస్తాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ పినాకి హల్దార్ తెలిపారు. ఎలక్ట్రిక్ వెర్షన్ ఒకసారి చార్జ్ చేస్తే సుమారు 125 కి.మీ. నుంచి 155 కి.మీ. వరకు మైలేజి ఇస్తుందని పేర్కొన్నారు. మారుతున్న మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో తేలికపాటి వాణిజ్య వాహనాల పరిశ్రమ వృద్ధి ప్రస్తుతం ఒక మోస్తరుగానే ఉన్నప్పటికీ మధ్యకాలికం, దీర్ఘకాలికంగా మెరుగ్గా ఉంటుందని హల్దార్ చెప్పారు.
క్యూ1లో జేఎల్‌ఆర్ అమ్మకాలు డౌన్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో జాగ్వార్ ల్యాండ్‌రోవర్ (జేఎల్‌ఆర్) హోల్‌సేల్, రిటైల్ అమ్మకాలు తగ్గాయి. డీలర్లకు సరఫరా (టోకు విక్రయాలు) వార్షికంగా 11 శాతం క్షీణించి 87,286 యూనిట్లకు పరిమితమయ్యాయి. తొలి త్రైమాసికంలో ఉత్తర అమెరికా, యూరప్, బ్రిటన్‌లో హోల్‌సేల్ అమ్మకాలు వరుసగా 12 శాతం, 14 శాతం, 25 శాతం తగ్గినట్లు జేఎల్‌ఆర్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదీ చదవండి: రూ.100తో చోటాసిప్!
ఇక రిటైల్ అమ్మకాలు 15 శాతం క్షీణించి 94,420 యూనిట్లుగా నమోదైనట్లు వివరించింది. సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్న తరుణంలో అంచనాలకు అనుగుణంగానే అమ్మకాలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. వారసత్వంగా వస్తున్న మోడల్స్‌ను క్రమంగా నిలిపివేసి కొత్త జాగ్వార్ మోడల్‌సను ప్రవేశపెట్టనుండటం, అమెరికాలో దిగుమతి సుంకాల వ్యవహారం కారణగా ఏప్రిల్‌లో ఎగుమతులు తాత్కాలికంగా నిలిచిపోవడం తదితర అంశాలు విక్రయాలు తగ్గడానికి కారణమని వివరించింది.