హైదరాబాద్: సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్యపై గందరగోళం నెలకొంది. అయితే ఈ ప్రమాదంపై తెలంగాణ హజ్ కమిటీ స్పందించింది. ఘటనలో 45 మంది మరణించారని.. అంతా హైదరాబాద్‌కు చెందిన వాళ్లేనని స్పష్టత ఇచ్చింది. మరోవైపు మృతుల పూర్తి వివరాలను సమర్పిస్తామని పోలీసులు అంటున్నారు.
నాలుగు ఏజెన్సీల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్లారు. మక్కా యాత్ర తర్వాత మదీనాకు బయల్దేరారు. మదీనాకు 25కి.మీ. దూరంలో ముఫ్రిహాత్ వద్ద యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నారు. ప్రమాదంలో అంతా మరణించారు. మృతుల్లో 17 మంది పురుషులు, 28 మంది మహిళలు ఉన్నారు. అంతా హైదరాబాద్‌కు చెందిన వాళ్లే అని హజ్ కమిటీ పేర్కొంది. మృతుల్లో మల్లేపల్లి, బజార్‌ఘాట్, ఆసిఫ్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఈ ఘోర ప్రమాదంపై నగర పోలీసులు ప్రకటన చేశారు. మొత్తం 54 మంది బృందం నవంబరు 9న హైదరాబాద్ నుంచి జెడ్డాకు వెళ్లింది. నవంబరు 23 వరకు టూర్ ప్లాన్ చేశారు. వీరిలో నలుగురు వ్యక్తులు నిన్న కారులో మదీనాకు వెళ్లారు. మరో నలుగురు మక్కాలోనే ఉండిపోయారు. మిగతా 46 మంది మక్కా నుంచి మదీనాకు బస్సులో బయల్దేరారు.
మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ బస్సు చమురు ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో 45 మంది చనిపోయారు. అబ్దుల్ షోయబ్ అనే వ్యక్తి ఒక్కరే బయటపడ్డారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో ఉన్నాడు అని సజ్జనార్ తెలిపారు.
సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా గాఢ నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం నేపథ్యంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జెడ్డాలోని భారత ఎంబసీ వెల్లడించింది.

ప్రధాని సహా పలువురి దిగ్భ్రాంతి
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రియాద్‌లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ కావాల్సిన సహాయం అందిస్తున్నాయని ప్రధాని మోదీ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.


