సాక్షి, హైదరాబాద్: మూసీకి శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రెండేళ్లలో గండిపేటకు గోదావరి నీళ్లను తీసుకొస్తామన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందని వ్యాఖ్యలు చేశారు. ప్రణాళికబద్దంగా మూసీ ప్రక్షాళన జరుగుతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండగలరా?’ అని ప్రశ్నించారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ..‘మూసీ ప్రక్షాళనపై సభ్యులు సూచనలు చేశారు. సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య వరద ముంపు పరిష్కారం చూపారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది. చాలా దేశాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి కొనసాగుతోంది. మూసీ నది అనంతగిరిలో మొదలై 240 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈసా, మూసా నదులు బాపూఘాట్ దగ్గర కలుస్తాయి. అందుకే అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేపట్టాం.
మూసీ ప్రక్షాళనపై నెలల తరబడి అధికారులతో సమీక్షలు చేశాం. ప్రణాళికబద్దంగా మూసీ ప్రక్షాళన జరుగుతుంది. ఈసా, మూసా నదులను గోదావరి నీళ్లతో నింపుతాం. రెండేళ్లలో గండిపేటకు గోదావరి నీళ్లను తీసుకొస్తాం. సంక్రాంతిలోగా ఫస్ట్ ఫేజ్‌పై క్లారిటీ వస్తుంది. ఫస్ట్‌ఫేజ్‌లో గండిపేట నుంచి గౌరెల్లి వరకు ప్రక్షాళన జరుగుతుంది. మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ది జరుగుతుంది. వచ్చే మూడు నెలల్లో అంచనాలు ఫైనల్ చేస్తాం. మూసీని కలుషితం చేయడంతో నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. మనుషులు నివాసం ఉండటానికి సాధ్యం కాని విధంగా నల్లగొండ జిల్లా మారిపోయింది. ఫ్లోరైడ్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ ప్రాంతంలో ఫ్లోరైడ్ కారణంగా బిడ్డలు అంగవైకల్యంతో పుడుతున్నారు. మూసీ నదిలో నీళ్లు పారాల్సిందేనని అధికారులకు ఆదేశిలిచ్చాం. శాశ్వతంగా సమస్యను పరిష్కరించాలని నిర్ణయించాం.

గండిపేటలో ఆగర్భశ్రీమంతులు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు. ఫామ్‌హౌసులు కట్టుకుని డ్రైనేజీ నీళ్లను గండిపేట చెరువులో కలిపారు. గండిపేట, మొయినాబాద్‌లో ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న వాళ్లు లక్షలు, కోట్లు ఖర్చు చేసి నాపై సోషల్ మీడియాలో బద్నాం చేయించారు. అయినా మేం భయపడలేదు. గుజరాత్‌లో సబర్మతి ప్రాజెక్ట్ చేపట్టి 60వేల కుటుంబాలను తరలించారు. యూపీలో కూడా గంగా నది ప్రక్షాళన కోసం ఇళ్లు కూల్చారు. ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేస్తామని చెప్పారు. నిజాం చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారు. మూసీ ప్రక్షాళనకు ఎంత అవుతుందో ఇప్పుడే చెప్పలేం. మూసీ పరివాహక ప్రాంతాల్లో శివాలయం, గురుద్వార్, మసీదు, చర్చి నిర్మిస్తాం. మూసీ ప్రక్షాళన జరగలా వద్దా?.. ప్రతిపక్ష నేతలు చెప్పాలి. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు నివాసాలు కల్పిస్తామంటే అడ్డుకుంటున్నారు. ప్రతిపక్ష నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండగలరా?’ అని ప్రశ్నించారు.


