అమెరికా కంపెనీలతో చేతులు కలిపిన టిక్‌టాక్ కంపెనీ
మగిసిన చర్చలు.. ఒప్పందాలపై సంతకాలు పూర్తి
ఇకపై నూతన జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలోనే కార్యకలాపాలు
వాషింగ్టన్: అమెరికాలో నిషేధం హెచ్చరికల నుంచి తప్పించుకోవడానికి టిక్‌టాక్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా సంస్థలతో చేతులు కలిపింది. ఈ మేరకు ఒప్పందాలపై తాజాగా సంతకాలు జరిగాయి. అమెరికాలో ఒరాకిల్, సిల్వర్ లేక్, ఎంజీఎక్స్ సంస్థలతో టిక్‌టాక్ కంపెనీ కలిసి పనిచేయనుంది. కొత్తగా టిక్‌టాక్ యూఎస్ జాయింట్ వెంచర్ ఏర్పాటు కానుంది. ఒరాకిల్, సిల్వర్ లేక్, ఎంజీఎక్స్‌కు 15 శాతం చొప్పున వాటా ఉంటుంది.
డెల్ టెక్నాలజీస్, బైట్‌డ్యాన్స్ సంస్థలు కూడా ఇందులో పెట్టుబడులు పెడుతున్నాయి. టిక్‌టాక్ ప్రసుతం చైనా కంపెనీ యాజమాన్యంలో ఉంది. అమెరికాలో 20 కోట్ల మందికిపైగా యూజర్లు ఉన్నారు. వీడియోలు సృష్టించి, షేర్ చేసుకుంటున్నారు. తమ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని టిక్‌టాక్ కంపెనీ చోరీచేసి, చైనాకు చేరవేస్తోందని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తున్నారు. చైనా యాజమాన్యం కింద కొనసాగితే తమ దేశంలో టిక్‌టాక్‌ను నిషేధిస్తామని ఆయన ఇప్పటికే హెచ్చరించారు.
దేశ భద్రత కోసమే నిషేధించక తప్పదని పేర్కొన్నారు. అమెరికా సంస్థల పరిధిలో పనిచేస్తే అభ్యంతరం లేదని ప్రకటించారు. 20 కోట్ల మంది యూజర్లను వదులుకోవడం ఇష్టంలేని టిక్‌టాక్ యాజమాన్యం అమెరికా కంపెనీలతో జతకట్టింది. ఏడాదికాలంగా జరుగుతున్న చర్చలు పూర్తయ్యాయి. అమెరికా సంస్థలతో ఎట్టకేలకు ఒప్పందానికి వచి్చంది. ఇకపై నూతన జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలోనే అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలు కొనసాగుతాయి.
ఇందులో ఏడుగురు సభ్యులు ఉంటారు. మెజార్టీ సభ్యులు అమెరికన్లే ఉంటారనడంలో సందేహం లేదు. సమగ్ర డేటా రక్షణలు, ఆధునిక కంటెంట్, సాఫ్ట్‌వేర్‌తో జాతీయ భద్రతకు కట్టుబడి ఉంటూ యూజర్లకు సేవలు అందించనున్నట్లు టిక్‌టాక్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం తప్పినట్లయ్యింది. సేవలు యథావిధిగా కొనసాగుతాయి.
ట్రంప్ ప్రశంసలు
అమెరికా కంపెనీలతో టిక్‌టాక్ కుదర్చుకున్న ఒప్పందాన్ని అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. చైనా అధినేత షీ జిన్‌పింగ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. జిన్‌పింగ్ తమతో కలిసి పనిచేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో టిక్‌టాక్ యూజర్లకు తాను గుర్తుండిపోతానని ఉద్ఘాటించారు.


