వాషింగ్టన్: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు దొరుకుతుందన్నారు. ఇరాన్‌పై తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిండానికి చాలా చేరువలో ఉన్నామన్నారు. మరోవైపు అంతర్జాతీయంగా చమురు సరఫరాకు సంబంధించి ఇరాన్‌ను హెచ్చరించారు. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అంతరాయం కలిగిస్తే ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించగా, ఆయన వారసుడిగా ఆయతుల్లా మోజ్తబా ఖమేనీ ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత రోజే చమురు ధరలు భారీగా పెరిగి, 2022 తర్వాత తొలిసారిగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పెట్టుబడిదారులు దీన్ని ఇరాన్‌లో యుద్ధం రోజులు తరబడి కొనసాగుతుందనే సంకేతంగా భావించారు.
అయితే అనూహ్యంగా చమురు ధరలు పడిపోయాయి. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగదనే అంచనాల నడుమ అమెరికన్ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా జోరందుకున్నాయి. ఈ క్రమంలో మియామి గోల్ఫ్ క్లబ్‌లో రిపబ్లికన్ చట్టసభ సభ్యులతో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొంత చెడును వదిలించడానికి మేం మధ్యప్రాచ్యంలో ఓ చిన్న విహారయాత్ర చేశాం. ఆ విహారయాత్ర స్వల్పకాలికంగా ఉంటుంది. ఆ విషయం మీకు త్వరలో తెలుస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీనితో, ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుందనే సంకేతం ఇచ్చినట్లు భావిస్తున్నారు.
ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. హర్మూజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించడంతో చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద చమురు రవాణా సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఫలితంగా అమెరికాలో ఆయిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరిగాయి.
దాడుల ప్రభావంతో పెట్టుబడిదారులు కూడా వెనక్కి తగ్గారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. గల్ఫ్ నాయకులు, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో జరిగిన సంభాషణల తర్వాత ‘వివాదానికి రాజకీయ, దౌత్య పరిష్కారం అవసరం’ అని పుతిన్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఆయన విదేశాంగ సలహాదారు యూరి ఉషాకోవ్ తెలిపారు.
ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్ పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ట్రంప్ వ్యూహమా, లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.


