
జీవితం ఒకేసారి నాలుగు బంగారు అవకాశాలను ఇచ్చి అందులో కొన్నింటినే ఎంచుకోవాలనే పరిస్థితి తలెత్తితే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఊహించండి. సరిగ్గా ఇలాంటి విచిత్రమైన పరిస్థితే 20 ఏళ్ల టెక్కీకి ఎదురైంది. ఉద్యోగ వేటలో ఉన్న తనకు ముందుగా రెండు ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి. ఆ రెండూ ఎంఎన్‌సీ సంస్థలు కావడంతో వాటికి అంగీకారం తెలిపి సంతకాలు చేశాడు. ఉన్నట్టుండి మరో రెండు కంపెనీల ఆఫర్లు వచ్చాయి. ఈసారి ఆఫర్ చేసినవి మునుపటి కంపెనీల కంటే టాప్ సంస్థలు. దాంతో ఇప్పటికే సంతకం చేసిన కంపెనీలకు ‘నో’ చెప్పడం ఎలాగో తెలియక తన పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదికాస్తా వైరల్‌గా మారింది.
ఈ టెక్కీ పోస్ట్ ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. తన పరిస్థితి గమనించిన నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఆచరణాత్మకంగా ఆలోచించమని చెబుతున్నారు. ‘ఉద్యోగుల తొలగింపుల సమయంలో కంపెనీలు పెద్దగా పట్టించుకోవు. కాబట్టి మీరు కంపెనీ ఆఫర్‌ను తిరస్కరించడం పెద్ద విషయం కాదు’ అని ఒకరు సూచించారు. మర్యాదపూర్వకంగా ఒక ఈమెయిల్ పంపాలని కొందరు సలహా ఇచ్చారు. చివరి నిమిషంలో కంపెనీలు ఆఫర్ లెటర్లు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నందున ఆ యువకుడు చేరాలనుకుంటున్న సంస్థ గురించి కచ్చితంగా తెలిసే వరకు ఏ నిర్ణయం తీసుకోరాదని కొందరు తెలిపారు.
ఇదీ చదవండి: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట.. H-1B వీసా ఫీజు రద్దు