
వ్యాపార రంగంలో ఎవరు ఎప్పుడు సక్సెస్ అవుతారో చెప్పలేం. ఒకప్పుడు దివాలా తీసి తర్వాత ఉన్నతస్థాయికి చేరనవారు చాలా మందే ఉన్నారు. దీపావళికి ముందు తన ఉద్యోగులకు 51 లగ్జరీ కార్లను బహుమతిగా (Gifts Luxury Cars on Diwali) ఇచ్చిన చండీగఢ్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత గురించి వినే ఉంటారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉద్యోగులకు 51 లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిన ఆయన ఎంఐటీఎస్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ఎం.కె. భాటియా. దీపావళి వేడుకల సందర్భంగా సరికొత్త స్కార్పియో ఎస్యూవీల తాళాలను తానే స్వయంగా ఉద్యోగులకు అందజేశారు. ఈయన కూడా ఒకప్పుడు దివాలా తీసి తర్వాత ఎదిగినవారే.
దైనిక్ భాస్కర్ కథనం ప్రకారం.. కంపెనీలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా చిహ్నంగా ఎస్యూవీలను బహుమతులుగా ఇచ్చారు. ఆసక్తికరంగా, భాటియా తన సిబ్బందికి లగ్జరీ కార్లు బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా దీపావళి సందర్భంగా వివిధ వాహనాలను బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం.
దివాలా తీయడం నుంచి దిగ్విజయం వరకు..
భాటియా విజయ ప్రస్థానం మరింత స్ఫూర్తివంతంగా ఉంటుంది. ఇప్పుడు ఎంఐటీఎస్ (MITS) గ్రూప్ వ్యవస్థాపకుడైన ఆయన ఒకప్పుడు 2002లో తన మెడికల్ స్టోర్ భారీ నష్టాలను చవిచూసినప్పుడు దివాలా తీశారు. కానీ ఆయన అక్కడితో ఆగిపోకుండా తన జీవితాన్ని, వ్యాపారాన్ని పునర్నిర్మించుకున్నారు. 2015 లో ఎంఐటీఎస్ను ప్రారంభించారు.
నేడు.. భాటియా ఎంఐటీఎస్ బ్యానర్ కింద 12 కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. భారత్తోపాటు విదేశాలలోనూ తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. హర్యానాలోని పంచకుల కేంద్రంగా ఉన్న ఆయన కంపెనీ ఇప్పటికే కెనడా, లండన్, దుబాయ్లలో లైసెన్సులను కలిగి ఉంది.మ
ఇదీ చదవండి: వారెన్ బఫెట్ చెప్పిన సక్సెస్ సీక్రెట్..