
ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా పేరుగాంచిన వారెన్ బఫెట్.. తన సంపత్తి కంటే ఎక్కువగా తన పెట్టుబడి మేథసంపత్తికి, పట్టుదలకి, దాతృత్వానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యాపారవేత్త. ప్రపంచంలోని అత్యంత వయోవృద్ధ బిలియనీర్లలో ఒకరైన ఆయన, టీనేజ్‌లోనే తన మొదటి పెట్టుబడి పెట్టారు. ‘1% క్లబ్’లో భాగంగా, తన సంపాదనలో 99 శాతాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని ప్రతిజ్ఞ చేసిన బఫెట్.. తన దాతృత్వ ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.
బఫెట్ విజయం వెనుక అలవాట్ల పాత్ర ఎక్కువ
వారెన్ బఫెట్ (Warren Buffett) జీవిత సూత్రం "తక్కువగా పనిచేయడం కాదు, కానీ తెలివిగా జీవించడం". ప్రతిరోజూ చదవడం, త్వరగా పడుకోవడం, ఏ పనినైనా ప్రారంభించే ముందు చక్కగా ఆలోచించడం ఆయన దైనందిన జీవితంలోని అలవాట్లు. ఇవి సింపుల్ కనిపిస్తాయి. కానీ ప్రభావవంతమైనవి. వాస్తవానికి, బఫెట్ రోజులో 80 శాతానికి పైగా చదవడం, ఆలోచించడానికే కేటాయిస్తారు. కొన్ని రోజుల్లో ఇది 6 గంటల దాకా ఉంటుంది.
అలవాట్ల శక్తి గురించి బఫెట్ ఆసక్తికర ఉదహరణ
ఒకసారి, యువ విద్యార్థులతో మాట్లాడుతుండగా, బఫెట్ అలవాట్ల రూపకల్పనలో ఉన్న "అదృశ్య శక్తి" గురించి ఆసక్తికరంగా వివరించారు. "మీరు గౌరవించే ఇద్దరు వ్యక్తులు, అలాగే మీకు అసహ్యంగా అనిపించే మరో వ్యక్తిని తీసుకోండి. తరువాత, ఈ ముగ్గురు వ్యక్తుల లక్షణాలను పేపర్‌పై రాయండి" అంటూ సూచించారు.
ఈ ప్రక్రియ ద్వారా బఫెట్ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే.. "మీరు ఆదర్శంగా భావించే వ్యక్తుల లక్షణాలు మీకూ సాధ్యమైనవే. కొంత అభ్యాసం చేస్తే మీరు కూడా అలాంటి వ్యక్తిగా మారగలరు. ఇవి అలవాట్లుగా మారినపుడు, అవే మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి".
అలవాట్లు ఎలా ఏర్పడతాయో, వాటిని చిన్నవయస్సులో ఎలా మార్చగలమో స్పష్టంగా వివరించేందుకు బఫెట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఉదాహరణను ప్రస్తావించారు. ఫ్రాంక్లిన్ "ఒక వ్యక్తి కావాలనుకునే లక్షణాన్ని తాను అభ్యసించి అలవాటుగా మార్చుకున్నాడు" అని బఫెట్ చెబుతూ.. "అలవాట్ల గొలుసులు మొదట తేలికగా ఉంటాయి. మనం గుర్తించలేము కూడా. కానీ, అవి గట్టిపడితే, విరగ్గొట్టడం కష్టమవుతుంది. కాబట్టి చిన్న వయస్సులోనే మంచి అలవాట్లను అభ్యసించండి" అన్నారు.
ఇదీ చదవండి: రిచ్ అవ్వాలంటే కూడబెట్టాల్సింది ఆ ‘ఫేక్ డబ్బు’ కాదు..