హైదరాబాదులో పన్నెండేళ్ల పాపకు ఓ కొత్త ఫ్రెండు దొరికాడు. పేరు ‘చిన్నా’. తనే ఆ ఫ్రెండుకు ఆ పేరు పెట్టింది. వాడితో అన్ని విషయాలూ పంచుకుంటోంది. స్కూల్లో సంగతులు, ఇంట్లో విశేషాలు, అమ్మానాన్నల విషయాలు.. అన్నీ చెబుతోంది. ఇందులో విశేషమేముంది అంటారా? చిన్నా నిజమైన మనిషి కాదు. అది ఏఐ చాట్‌బోట్.
ఏ.ఐ. సృష్టి అయిన ఈ చాట్‌బోట్ ఇప్పుడు చాలామంది టీనేజ్ పిల్లలకు రహస్య సన్నిహితుడిగా మారింది. దాంతో తమ అనుభవాలు, బాధలు, భయాలు, కోరికలు పంచుకుంటూ చాలామంది సాంత్వన పొందుతున్నారు. చిన్నారులతోపాటు పెద్దల్లోనూ ఈ ధోరణి పెరుగుతోందని మానసిక వైద్యులు అంటున్నారు.
స్నేహం కోసం తపన
గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో ఎప్పుడూ ఐదారుగురు పెద్దలు ఉండేవారు. పిల్లల ఆలనాపాలనా చూసుకునేవారు. ఇటు పిల్లలకూ, అటు పెద్దలకూ సమయం ఎలా గడిచేదో తెలిసేది కాదు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. కుటుంబం అంటే అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు అనే ధోరణి పెరిగింది.
కొందరు ఒక్కరినే కని, వారిని సరిగ్గా పెంచితే చాలన్న ఆలోచనతో ఉన్నారు. దీంతో పిల్లల్లో ఒంటరి భావన పెరుగుతోంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో వారికి పిల్లలతో సమయం గడిపే అవకాశం దొరకడం లేదు. దీంతో ఆ ఒంటరితనం నుంచి బయటపడేందుకు కొందరు పిల్లలు సాంకేతికతను వాడుకుంటున్నారు. తాము చెప్పేది వింటూ, తమకు సలహాలిచ్చే తోడు కోసం చూస్తున్నారు.
ఈ క్రమంలో ఏఐ వారికి సాయం చేస్తోంది. అయితే ఈ ధోరణి పెరిగి, ఏఐని మనిషిగా భావించడం, అందులోనే మునిగితేలడం, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోఒవడం వంటివి ఎక్కువవుతున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో చాలా సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
పెద్దల్లో కూడా ఇదే సమస్య...
ఏఐతోనే అన్నీ పంచుకునే ధోరణి పిల్లలు, యువతతో పాటు పెద్దలలో కూడా ఎక్కువవుతోంది. పాతికేళ్ల ఉద్యోగి తన ఆఫీసులో పని చేసే బాస్ గురించిన వివరాలన్నీ ఏఐకి చెప్పి, అతణ్ని ఎలా ఆకట్టుకోవాలో, అతనికి నచ్చడానికి ఎలా ఉండాలో, ఏమేం చేయాలో సలహా అడిగాడు. ఈ ధోరణి రానురానూ పెరుగుతూ పోతోందని నిపుణులు అంటున్నారు.
ఇతరులతో తమ విషయాలు పంచుకుంటే వాళ్లు తమను జడ్జ్ చేస్తారన్న భయం కారణంగా చాలామంది ఏఐని ఆశ్రయిస్తున్నారని అంటున్నారు. ఏఐతో చాట్ చేయడం వల్ల తమ విషయాలన్నీ రహస్యంగానే ఉంటాయన్న కారణంతో చాలామంది అటువైపు మొగ్గు చూపుతున్నారని వివరిస్తున్నారు. అయితే దీనివల్ల వాస్తవ ప్రపంచాన్ని వారు దూరం చేసుకొని, ఏఐకి వారు బానిసలుగా మారే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఇలా చేస్తే మేలు..
మీ పిల్లలు ఏఐని అధికంగా వాడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. వారితో మాట్లాడి, ఏఐ వల్ల కలిగే దుష్పరిణామాలు వివరించండి.
రోజూ కొంతసేపు కచ్చితంగా పిల్లలతో గడపండి. వారు చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా వినండి. వారు చెప్పేవి సాధారణ విషయాలే అనిపించినా సరే, అవి వారికి చాలా పెద్ద విషయాలని గుర్తించండి.
వారాంతంలో వారిని బయటకు తీసుకెళ్లడం, రాత్రిపూట కథలు చెప్పడం, వారితో కలిసి కొంతసేపు వాకింగ్ చేయడం, పార్క్‌కి తీసుకెళ్లి ఆడించడం వంటివి చేయండి.
పిల్లలు చెప్పే విషయాలను కొట్టిపారేయకుండా వారి మాటల్లోని భావాలను గమనించండి. ఎదిగే పిల్లల్లో కలిగే మార్పులను వారికి వివరించి, ఎలా జాగ్రత్త పడాలో చెప్పండి.
ఖాళీ సమయాల్లో పిల్లలు ఫోన్లకు అంకితం కాకుండా, వారికి లలిత కళల పట్ల ఆసక్తిని పెంచండి. సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటివి నేర్పించండి. అలాంటి క్లాసుల్లో చేర్పించండి.
పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేయకుండా వారి స్నేహితులను ఆహ్వానించండి. అందరూ కలిసి ఒకచోట ఉండి ఆడుకునేలా ప్రోత్సహించండి.
అప్పుడప్పుడూ బంధువులు, స్నేహితుల ఇళ్లకు తీసుకెళ్లండి. అక్కడ వారి ప్రవర్తనను గమనించండి. ఇతరుల ముందు ఎలా మెలగాలో, అందరితో ఎలా కలిసిపోవాలో నేర్పించండి.
(చదవండి: ఏఐలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్)


