ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI) దిశగా ప్రపంచవ్యాప్తంగా పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ (Microsoft) కంపెనీ ఏఐ చీఫ్ స్తఫా సులేమాన్ (Mustafa Suleyman) కీలక హెచ్చరికలు చేశారు. ఏఐ అంచనా వేసిన దానికంటే వేగంగా పురోగమిస్తున్నప్పటికీ ఇది మానవ నియంత్రణలో ఉండటం అత్యవసరం అని నొక్కి చెప్పారు.
మైక్రోసాఫ్ట్ ప్రత్యేక MAI సూపర్ ఇంటెలిజెన్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే సులేమాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘సూపర్ ఇంటెలిజెన్స్‌ను నిర్మించే క్రమంలో మానవత్వాన్ని, మనం జీవించాలనుకునే భవిష్యత్తును కోల్పోతే ప్రమాదం. మానవులకు ఈ అంశాలపై నియంత్రణ లేకపోతే ప్రమాదం’ అని చెప్పారు.
హ్యూమనిస్ట్ సూపర్ ఇంటెలిజెన్స్
సులేమాన్ పైవ్యాఖ్యలు చేస్తూనే మైక్రోసాఫ్ట్ ఏఐ అభివృద్ధిలో కొత్త దశలోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. దీన్ని ‘ఏఐ సెల్ఫ్ సఫిషియన్సీ’ (ఏఐ స్వయం సమృద్ధి) అని అభివర్ణించారు. కంపెనీ ఓపెన్ ఏఐ (OpenAI)తో భాగస్వామ్యంలో ఉన్న పరిమితులను అధిగమించి భారీ స్థాయిలో ఏఐ వ్యవస్థలకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అయితే ఏఐ మోడళ్లకు విచ్చలవిడిగా శిక్షణనిచ్చే అనియంత్రిత శక్తిని లక్ష్యంగా చేసుకున్న పోటీదారుల మాదిరిగా కాకుండా మైక్రోసాఫ్ట్ ‘హ్యూమనిస్ట్ సూపర్ ఇంటెలిజెన్స్’ (మానవతా దృక్పథంతో కూడిన సూపర్ ఇంటెలిజెన్స్) ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందని సులేమాన్ వివరించారు.
ఈ విధానం వల్ల ఏఐను జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. సందర్భోచితంగా పరిమితులకు లోబడి వాడుకోవచ్చని తెలిపారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ రేసులో ప్రత్యర్థుల మాదిరి నియంత్రణ లేకుండా శిక్షణలు ఇవ్వడం లేదని చెప్పారు. మైక్రోసాఫ్ట్ మానవ అవసరాలను తీర్చే ఆచరణాత్మక వ్యవస్థలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. మానవాళికి సేవ చేయడానికి స్పష్టంగా రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్మిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: పేలుడు ఘటనల్లో సత్య శోధన


