అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన ప్రకటన చేశారు. సింగర్ జుబిన్ గర్గ్ ప్రమాదవశాత్తు మరణం కాదని.. అదొక హత్య అని మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఈ హత్యకు గల కారణం కచ్చితంగా రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని పేర్కొన్నారు.
అస్సామీస్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో పాటలు పాడిన జుబీన్ సెప్టెంబర్ 19వ తేదీన సింగపూర్‌లో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. తమ కల్చర్‌ను ఖండాంతరాలు దాటించిన గాయకుడి మరణాన్ని అస్సాం ప్రజలు ఏమాత్రం తట్టుకోలేకపోయారు. అయితే ఈ కేసులో కుటుంబ సభ్యుల అభ్యంతరాల నేపథ్యంలో దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయించింది హిమంత ప్రభుత్వం.
జుబిన్ గర్గ్ హత్య కేసు అంశంపై చర్చించాలని అసెంబ్లీలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఈ కేసు పురోగతిపై అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. జుబిన్ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మరణించలేదని.. ఆయనను కుట్రపూరితంగా హత్య చేశారన్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది వెల్లడైందని.. నేరం వెనక ఉన్న ఉద్దేశం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తుందని హిమంత తెలిపారు. నిందితులలో ఒకరు ఆయనను హత్య చేయగా.. మిగిలినవారు అతడికి సహకరించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ హత్యతో సంబంధమున్న ఐదుగురు వ్యక్తులపైనా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. డిసెంబర్‌లో హత్య కేసులో ఛార్జ్‌షీట్ సమర్పించిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడిస్తారన్నారు.
ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మొదటి మూడు రోజుల్లోనే హత్య కేసు నమోదు చేసింది. మరోవైపు జుబిన్ మరణంపై దర్యాప్తు చేస్తున్న ఏకసభ్య కమిషన్ వాంగ్మూలాలు నమోదు చేయడానికి, మరిన్ని సాక్ష్యాలను సమర్పించడానికి దర్యాప్తును డిసెంబర్ 12 వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ కేసుపై సింగపూర్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్కడి పోలీసులు మాత్రం మృతిలో ఎలాంటి అనుమానాలు లేవనే అంటున్నారు. ఈ నెల మొదట్లో జుబిన్‌కు సంబంధించిన పోస్ట్‌మార్టం, టాక్సాలజీ నివేదికలను అస్సాం పోలీసులకు పంపించారు కూడా.
సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ప్రమాదానికి గురైన జుబిన్‌ను సింగపూర్ ఆసుపత్రికి తరలించారని, అక్కడే ఆయన మృతి చెందినట్లు తర్వాత వార్తలు వచ్చాయి. మరోవైపు.. జుబిన్ బ్యాండ్‌మేట్ శేఖర్‌జ్యోతి గోస్వామి తన వాంగ్మూలంలో సంచలన ఆరోపణలు చేశారు. గాయకుడికి ఆయన మేనేజర్, ఫెస్టివల్ ఆర్గనైజేషనర్ విషమిచ్చి దాన్ని ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉండొచ్చని అనుమానాలు వయక్తం చేశారు. జుబిన్ నోరు, ముక్కు నుంచి నురగ గమనించానని.. అయినా కూడా మేనేజర్ ఏమాత్రం కంగారు పడలేదని.. తీరికగా వైద్యం అందించారని ఆరోపించారు. ఈ వాంగ్మూలంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


