- తర్వాత ఢిల్లీ, గాజియాబాద్
- సగం నగరాలు కాలుష్య కోరల్లోనే
- వాటి సంఖ్య యూపీలో అత్యధికం
- తర్వాత రాజస్తాన్, గుజరాత్, ఎంపీ
న్యూఢిల్లీ: కాలుష్యం విషయంలో మన దేశంలో నంబర్‌వన్ నగరం ఏదంటే అందరికీ గుర్తొచ్చేది దేశ రాజధానే. కానీ అసోంలోని బర్నీహాట్ పట్టణం ఢిల్లీని కూడా తలదన్నింది. ఈ ఏడాది దేశంలోనే అత్యంత కలుషిత పట్టణంగా నిలిచి రికార్డు సృష్టించింది. ఢిల్లీ, గాజియాబాద్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఏకంగా 190 నగరాలు, పట్టణాలు పీఎం10 కాలుష్య సూచీ వార్షిక సురక్షిత పరిమితిని దాటేయడం ఆందోళన కలిగించే అంశం.
ఇక పీఎం2.5 వార్షిక పరిమితిని మించిన నగరాల సంఖ్య అయితే ఏకంగా 1,747గా నమోదైంది! పీఎం10 వాయు నాణ్యత సూచీలో మాత్రం ఢిల్లీయే దేశంలో అత్యంత కలుషిత నగరంగా నిలిచింది! సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్‌ఈఏ) తాజా విశ్లేషణ ఈ మేరకు తేల్చింది. తర్వాతి స్థానంలో గాజియాబాద్, గ్రేటర్ నోయిడా ఉన్నట్టు పేర్కొంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఏకంగా 44 శాతం నగరాలు దీర్ఘకాలంగా వాయు కాలుష్యంతో సతమతం అవుతున్నట్టు అది వివరించింది. కొవిడ్‌తో సర్వం పడకేసిన 2020ని మినహాయిస్తే గత ఐదేళ్లుగా ఇదే ధోరణి కొనసాగుతూ వస్తున్నట్టు వెల్లడించింది.
ఎన్‌సీఏపీ ప్రభావం అంతంతే...
కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్‌సీఏపీ) కింద కవరైన నగరాలు దేశవ్యాప్తంగా కేవలం 4 శాతం మాత్రమే కావడం నెలకొన్న అవ్యవస్థకు అద్దం పడుతోందని సీఆర్‌ఈఏ వివరించింది. అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని కనీస స్థాయికి తగ్గించే లక్ష్యంతో 2019లో కేంద్రం ఎన్‌సీఏపీని తెరపైకి తెచ్చింది. దీనికి రూ.13,415 కోట్లు కేటాయించింది. అందులో మూడొంతులకు పైగా నిధులను వ్యయం చేసింది కూడా. అయినా ఇప్పటివరకైతే ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు.
పైగా, ప్రస్తుతం ఎన్‌సీఏపీ కింద కవరవుతున్న నగరాలు, పట్టణాల సంఖ్య కేవలం 130 మాత్రమే. వాటిలో కూడా 28 నగరాల్లో ఇప్పటికీ కనీసం సరైన సంఖ్యలో వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేదు. పీఎం10 స్థాయిలను కనీసం 40 శాతం తగ్గించాలన్న లక్ష్యాన్ని కేవలం 23 నగరాలే చేరుకున్నాయి. మరో 23 నగరాల్లోనైతే పీఎం10 స్థాయిలు 2019తో పోలిస్తే ఇప్పుడు బాగా పెరగడం గమనార్హం. ‘‘28 నగరాల్లో కాలుష్యం 21–40 శాతం తగ్గింది. 26 నగరాల్లో ఇది 20 శాతం కంటే తక్కువే’’అని నివేదిక వెల్లడించింది.
వామ్మో యూపీ!
దేశవ్యాప్తంగా 4,041 నగరాలు, పట్టణాల్లో పీఎం10, పీఎం2.5 స్థాయిలను ఉపగ్రహ డేటా ఆధారంగా సీఆర్‌ఈఏ మదింపు వేసింది. వాటిలో చాలా నగరాలు కాలుష్యాన్ని అభిలషణీయ స్థాయికి తగ్గించడంలో ఘోరంగా విఫలమైనట్టు గుర్తించింది. పీఎం2.5 సూచీపరంగా 416 కలుషిత నగరాలతో ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ అగ్ర స్థానంలో నిలిచింది. అవి కాలుష్యానికి చిరునామాగా మారినట్టు సీఆర్‌ఈఏ తేల్చింది. తర్వాతి స్థానాల్లో రాజస్తాన్ (158), గుజరాత్ (152), మధ్యప్రదేశ్ (143), పంజాబ్, బిహార్ (136), పశ్చిమబెంగాల్ (124) నిలిచాయి. ఇక పీఎం10 సూచీపరంగా చూస్తే 18 అత్యంత కలుషిత నగరాలతో రాజస్తాన్ తొలి స్థానంలో నిలిచింది. తర్వాత యూపీ (10), మధ్యప్రదేశ్ (5), బిహార్(4), ఒడిశా (4) ఉన్నాయి.
గతేడాది ప్రపంచంలోనే టాప్
బర్నీహాట్. అసోం, మేఘాలయ సరిహద్దుల్లో ఉండే ఓ పారిశ్రామిక పట్టణం. మితిమీరిన కాలుష్యంతో గతేడాది నుంచీ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. 2024లోనైతే ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత పట్టణంగా రికార్డుకెక్కింది. ఈ ఏడాది కూడా ఢిల్లీని తోసిరాజని దేశంలో అత్యంత కలుషిత పట్టణంగా నిలిచింది. ఇక్కడ వార్షిక సగటు పీఎం2.5 స్థాయి 100 ఎంజీగా తేలింది. గతేడాది ఇది 128.2 ఎంజీగా నమోదవడం విశేషం.
అడ్డూ అదుపూ లేని విచ్చలవిడి పారిశ్రామికీకరణే బర్నీహాట్ కాలుష్యానికి ప్రధాన కారణం. ఇక్కడ ఇనుము ఉక్కు, సిమెంట్ ఫ్యాక్టరీలు, డిస్టిలరీల వంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి. భారీ స్థాయిలో ఇవి విడుదల చేసే విష వాయువుల వల్ల బర్నీహాట్‌లో పీఎం10, పీఎం2.5 స్థాయిలు ఆకాశాన్నంటుతుంటాయి. పైగా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రధాన రవాణా కేంద్రం కూడా కావడంతో ఇక్కడ వాహన కాలుష్యమూ విపరీతంగా ఉంటుంది.


