కొండల్‌రెడ్డి ఫోనూ ట్యాప్!
నేడు కార్యాలయానికి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని పిలుపు
మరికొందరినీ విచారణకు పిలిచిన దర్యాప్తు అధికారి
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంలో బాధితులతో పాటు రాజకీయ నాయకులు, వారి సంబం«దీకుల నుంచీ వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి కూడా బుధవారం నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11కి సిట్ కార్యాలయానికి వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోరింది. మరోపక్క బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్‌లతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు, ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి కొండల్‌రావు తదితరులనూ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ 16న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఆ రోజు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో సిట్ వేగం పెంచింది.
ప్రత్యేకంగా ఆర్‌ఆర్ మాడ్యూల్
ప్రభాకర్‌రావు 2023 ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు, సంబంధీకులు, అనుచరులపై నిఘా ఉంచారని, దీనికోసం ప్రత్యేకంగా ‘ఆర్‌ఆర్ మాడ్యూల్’పేరుతో ఓ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అప్పట్లో ఎస్‌ఐబీలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్‌కు (ఎస్వోటీ) నేతృత్వం వహించిన డీఎస్పీ డి.ప్రణీత్‌రావు దీన్నీ పర్యవేక్షించారు. ప్రభాకర్‌రావు హయాంలో ఎస్‌ఐబీ కేంద్రంగా అనేక మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని, వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు, బిల్డర్లు, రియల్టర్లు కూడా ఉన్నారని సిట్ చెబుతోంది. ఈ క్రమంలోనే వారికి వచ్చే ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్ తదితరాలను పర్యవేక్షించడానికి కొందరు ఎస్‌ఐబీ అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు.
ఇందులో భాగంగానే రేవంత్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి సహా మరికొందరు నంబర్లు కలిపి ఏర్పాటు చేసిన మాడ్యూల్‌కు ప్రభాకర్‌రావు ‘ఆర్‌ఆర్ మాడ్యుల్’అనే పేరు పెట్టినట్లు తెలుస్తోది. ఈ విధంగా ఏర్పాటు చేసిన మాడ్యూళ్లలో ఉన్న వారి ఫోన్లను సర్వకాల సర్వావస్థల్లోనూ పర్యవేక్షిస్తూ ఉండటానికి డీఎస్పీ ప్రణీత్‌రావు నేతృత్వంలో 20 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో కొందరు అత్యాధునిక ఉపకరణాలతో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి ఇళ్ల సమీపంలో తాత్కాలిక వార్‌రూమ్స్ ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కొండల్‌రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది.


