సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు నిందితుడు శ్రవణ్‌కుమార్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్, మరో రూ.25 వేలకు రెండు పూచీకత్తులు సమరి్పంచాలని ఆదేశించింది. కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ హత్య కేసులో జిల్లా కోర్టు గతేడాది తీర్పు వెలువరించడం తెలిసిందే.
తనకు విధించిన జీవిత ఖైదును సవాల్ చేస్తూ శ్రవణ్‌కుమార్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. విచారణ ముగిసే వరకు బెయిల్ మంజూరు చేయాలంటూ మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) వేశారు. ఈ ఐఏపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. నిందితుడు గతంలో జైల్లో ఉన్న విషయాన్ని, అతని వయసును పరిగణనలోకి తీసుకుని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.


