సాక్షి, హైదరాబాద్: సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడతూ.. నిజనిజాలు ప్రజలకు తెలియడానికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని తెలిపారు. ‘‘నా పీఏ అప్పన్నని అరెస్ట్ చేశారని దుష్ప్రచారం జరుగుతోంది. దుష్ప్రచారాలను ఆపాలని సిట్‌కు చెప్పాను’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
‘‘టీటీడీలో అవినీతి చేయాల్సిన అవసరం మాకు లేదు. 2018 తర్వాత చిన్న అప్పనన్న నా పీఏగా పనిచేయలేదు. శ్రీవారి కానుకలను కాపాడటానికే ఎన్నో చర్యలు తీసుకున్నాం. తిరుమల అభివృద్ధికి ఎంత కృషి చేశామో సిట్ చెప్పా. ఇప్పటివరకు జరిగిన విచారణలో ఎలాంటి క్లారిటీ రాలేదు.
..దేవుడి సేవలో ఎలాంటి తప్పు జరగకూడదు. విచారణ జరుగుతున్నప్పుడు అడిగిన వాటికే సమాధానం చెప్పాను. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది. విచారణ నిష్పక్షపాతంగా చేయాలని సిట్‌కు చెప్పాను’’ అని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.


