ప్రసవం తర్వాత కొత్తగా తల్లిగా మారిన మహిళలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. తొమ్మిది నెలలపాటు కడుపులో బిడ్డను మోసిన అమ్మ మళ్లీ మునపటి దశకు వెళ్లేందుకు రంగం సిద్ధమవుతుంది. మళ్లీ ఎప్పట్లాగే అమ్మ శారీరక స్థితి... గర్భం దాల్చడానికి ముందున్న ఆ స్థితికి వెళ్లాలంటే కనీసం ఆరు వారాలు పడుతుంది. ప్రసవం అయ్యాక జరిగే ఆ ఆరువారాల వ్యవధిని ‘పోస్ట్ పార్టమ్’ అంటారు. అంటే పోస్ట్ పార్టమ్’(post partum )ను తెలుగులో చెప్పాలంటే ప్రసవానంతర స్థితి అనుకోవచ్చు. ఈ దశ చాలా కీలకమైనది. నిర్లక్ష్యం చేస్తే కొత్త తల్లి ఈ దశలో కొన్ని ఇన్ఫెక్షన్లకు గురికావచ్చు. ఫలితంగా చాలాకాలం పాటు శారీరకంగా, మానసికంగా ప్రభావం పడవచ్చు. ప్రసవానంతరం తల్లి, కుటుంబం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కోసమే ఈ కథనం.
ప్రసవానంతరం తల్లిలో శారీరకంగా ఎన్నో రకాల మార్పులు కనిపిస్తాయి. ఉదాహరణకు...
తల్లి కడుపులో మరో జీవి ఉన్నందున దానికీ కావాల్సిన రక్తప్రసరణ కోసం గుండె దాదాపుగా రెండింతలు పనిచేస్తుంది. అలా రెట్టింపు పనిచేసే ఆ గుండె క్రమంగా తన మామూలు పనికి వస్తుంది. ప్రసవం తర్వాత ఐదు నుంచి ఆరు వారాలకు క్రమంగా ఆ పరిస్థితి వస్తుంది. ప్రసవం సమయానికి ఉబ్బి ఉండే యోని గోడలు మళ్లీ ఐదు నుంచి ఆరు వారాలకు మామూలు స్థితికి వస్తాయి.
గర్భసంచి వెంటనే మొదటి స్థితికి వెళ్లలేదు కాబట్టి... ప్రసవం అయిన వెంటనే... 20 వారాలప్పుడు ఎంత పరిమాణంలో ఉంటాయో అంతటి పరిమాణంలో ఉంటాయి. ఆ సమయంలో కడుపుపై నుంచి కూడా డాక్టర్లు వాటి ఉనికిని గుర్తించగలరు. అయితే... ప్రసవమైన 45 వ రోజు నాటికి అవి... తమ ఉనికి కడుపు పైనుంచి పసిగట్టలేనంతగా కుంచించుకుపోతాయి. ప్రసవం తర్వాత మూడు నాలుగు వారాలపాటు సాధారణంగా అంతో ఇంతో రక్తస్రావం అవుతూనే ఉంటుంది. అయితే అదీ మరీ ఎక్కువగా ఉండదు. ఉండకూడదు.
ప్రసవం తర్వాత మళ్లీ మునపటి ఆరోగ్యం కోసం...
మాతృమూర్తికి వ్యాయామాలు : తల్లి అయిన మహిళ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనే అ΄ోహ చాలామందిలో ఉంటుంది. మరీ ముఖ్యంగా సిజేరియన్ అయిన మహిళలూ, పాలు పట్టే తల్లులు ఇలా విశ్రాంతి తీసుకోవాలని చాలామంది అనుకుంటారు. ఇది పూర్తిగా వాస్తవం కాదు. మరీ అలసిపోయేంత తీవ్రంగా కాకపోయినప్పటికీ... ప్రసవానంతరం తల్లి తన పనులు తాను చేసుకుంటూ ఉండటం... అంటే టాయెలెట్‌కు తనంతట తానే నడుస్తూ వెళ్లడం వంటివి చేస్తుంటే చాలా త్వరగా మామూలు మనిషి అవుతారు. ప్రసవం తర్వాత వారం రోజుల తర్వాత మామూలుగా నడక మొదలుపెట్టవచ్చు. నాలుగో వారం తర్వాత రోజువారీ పనులు చేసుకోవచ్చు. జిమ్‌కు వెళ్లేవారైతే... సిజేరియన్ అయితే 2 నెలల తర్వాత నుంచి, మామూలు ప్రసవం అయితే నెల తర్వాత నుంచి జిమ్‌కు వెళ్లి ఎక్సర్‌సైజ్ చేయవచ్చు.
బరువు తగ్గించుకోవడం : గర్భవతిగా ఉన్నప్పుడు ఆ తొమ్మిది నెలల వ్యవధిలో తాము పెరిగిన బరువును తగ్గించుకోవడం ఎంతైనా మేలు. అయితే ఈ బరువు అకస్మాత్తుగా త్వరత్వరగా కాకుండా... దాదాపు ఏడాది వ్యవధిలో క్రమంగా తగ్గించుకోవడం అన్నది ఆరోగ్యదాయకం. పాలు పట్టే సమయంలో ఆహారం : మన సంస్కృతీ, సంప్రదాయాల్లో ఉన్న నమ్మకాల ప్రకారం
కొందరు పెద్దలు పాలిచ్చే తల్లులు చాలా రకాల ఆహారాన్ని తినకుండా చేస్తారు. కానీ బిడ్డకు తగినట్లుగాపాలు బాగా ఊరడానికి తల్లికి పాలూ, ఓట్స్, ఆకుపచ్చని ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, ఎక్కువ మోతాదుల్లో ద్రవాహారం (మజ్జిగ, కొబ్బరినీళ్లవంటివి), తాజా పండ్లు ఎక్కువగా అవసరం. అయితే బలం పట్టడానికి అంటూ కొందరు పెద్దలు ఎక్కువగా వరి అన్నం, నెయ్యి ఇస్తుంటారు. దీని వల్ల పాలు పడకపోగా... తల్లులు మరింత బరువు పెరుగుతారు. అందుకే అన్నిపోషకాలు సమంగా అందేలా సమతులాహారం ఇవ్వడం మంచిది.
పాలుపట్టడం : కొత్తగా తల్లి అయిన మహిళకు మొదటి రెండు వారాల పాటు అనుభవజ్ఞులు అనేక విషయాల్లో సరైన సలహాలు ఇస్తూ, బిడ్డ పెంపకం విషయంలో ప్రోత్సాహం అందిస్తుండటం అవసరం. అయితే ఈ సలహాలు మంచివీ, శాస్త్రీయమైనవీ (సైంటిఫిక్‌గా ఉండేవి) ఇవ్వాలి తప్ప మూఢవిశ్వాస్వాలతో కూడినవి అయి ఉండకూడదదు.
పెరిగే రొమ్ముల పరిమాణం : రొమ్ములో పాలుపడుతూ ఉండటం వల్ల వాటి పరిమాణం పెరగడం కొందరిలో అది మరీ ఇబ్బందిగా పరిణమించవచ్చు. రొమ్ముతో పాలు పట్టడం ఎలా, సీసాతో పాలు పట్టడం ఎలా, సీసాతో పాలు పట్టాల్సివస్తే... సూక్ష్మజీవులన్నీ నశించిపోయేలా బాటిల్స్‌ను పూర్తిగా స్టెరిలైజ్ చేయడం ఎలా అన్న విషయాలపై మాతృమూర్తికి అవగాహన కల్పించాలి.
గర్భం రాకుండా చూసుకోవడం : పాలిచ్చే సమయంలో గర్భం రాదనే అభిప్రాయంతో చాలామంది తల్లులు మామూలుగానే సంసార జీవితంలో పాల్గొంటుంటారు. ఇది కొందరిలో కొంతవరకు వాస్తవమే అయినప్పటికీ... పాలు పడుతున్నప్పుడు సంసారజీవితంలో పాల్గొన్నవారిలో చాలామందికి త్వరగానే మళ్లీ గర్భధారణ జరిగిన ఉదంతాలు లేకపోలేదు. అందుకే బిడ్డకుపాలిచ్చే సమయంలో మళ్లీ వెంటనే గర్భధారణ జరగకుండా చూసుకోవడం మంచిది. ఈ విషయంలో డాక్టర్ సలహా మేరకు కాపర్–టీ, మరీనా వంటి సాధనాలు అమర్చుకోవడం లేదా ప్రతి మూడు నెలలకోమారు తీసుకోవాల్సిన ఇంజెక్షన్స్ వంటి వాటి గురించి తెలుసుకోవడం మంచిది.
ప్రసవానంతర బాధలిలా..
నొప్పి : ప్రసవమైన కొందరిలో సాధారణ ప్రసవం కోసం పెట్టే చిన్నపాటి గాటు మానడానికి వేసే కుట్ల వల్లగాని లేదా శస్త్రచికిత్స ద్వారా బిడ్డను బయటకు తీయడానికి చేసే సిజేరియన్ తర్వాత వేసే కుట్ల వల్ల కొద్దిపాటి నొప్పి ఉండవచ్చు. ఇది తగ్గడానికి అవసరమైన మోతాదుల్లో నొప్పి నివారణ మందులు ఇస్తారు. లేదా అక్కడ చన్నీళ్ల కాపడం పెడతారు. ఈ నొప్పి కనీసం దాదాపు వారంపాటు ఉంటుంది. ఒకవేళ వారం తర్వాత కూడా నొప్పి ఉన్నా, లేదా అది పెరుగుతున్నా, వాపు వచ్చినా లేదా ఎర్రగా మారి చీము వంటి స్రావాలు ఏవైనా స్రవిస్తున్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
మూత్రసంబంధమైన సమస్యలు : ప్రసవం తర్వాత కొందరిలో మూత్రసంబంధ సమస్యలు మామూలే. గర్భధారణ సమయంలో బాగా పెరిగిపోయి ఉన్న పొట్ట... మునపటిలా మామూలు స్థితికి రావాలనే ఉద్దేశంతో చాలామంది తల్లులు మళ్లీ పొట్ట ఉబ్బుతుందనే భయం వల్ల ప్రసవం తర్వాత నీళ్లు ఎక్కువగా తాగరు. దాంతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఒక్కోసారి యోని ప్రాంతంలో ఉన్న నొప్పి వల్ల కూడా మూత్రవిసర్జనకు వెళ్లడానికి జంకుతుంటారు.
మూత్రం చుక్కలుగా కారడం : కొందరిలో ప్రసవం తర్వాత అక్కడి కండరాలు ఇంకా బలహీనంగానే ఉన్నందున మూత్రాన్ని బిగుతుగా పట్టి ఉంచాల్సిన స్ఫింక్టర్ కండరాలు అలా ఉంచలేకపోవచ్చు. దాంతో కొందరిలో తమ ప్రమేయం లేకుండానే మూత్రం చుక్కలు చుక్కలుగా రాలవచ్చు. దీన్నే యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటారు. ఈ సమస్యను నివారించడానికి తల్లులకు ప్రసవం తర్వాత పెల్విస్ ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌ల గురించి వివరించడం మంచిది. ఇవి పొత్తికడుపు కింది (పెల్విస్) భాగంలోని కండరాలకు శక్తిని చేకూర్చి, మూత్రం చుక్కలుగా రాలే అనర్థాలను నివారిస్తాయి.
(Saudi Arabia Sky Stadium: మరో అద్భుతానికి శ్రీకారం, సౌదీలో తొలి స్కై స్టేడియం)
బ్లాడర్ కండరాలు బిగుతుగా మారడం : కొందరు తల్లులు బిడ్డకు రొమ్ముపాలు పడుతున్నప్పుడు బ్లాడర్ కండరాలు బిగుతుగా మారే అవకాశముంటుంది. దీంతో పాలు పట్టే సమయంలో తల్లులు నొప్పితో తల్లడిల్లుతుంటారు. ఇలాంటి వారికి కొన్ని నొప్పినివారణ మందులు, మజిల్ రిలాక్సెంట్స్ వాడాల్సి రావచ్చు.
మలవిసర్జనకు సంబంధించిన సమస్యలు : ప్రసవం తర్వాత చాలామంది తల్లుల్లో మలబద్దకం అన్నది చాలా సాధారణమైన సమస్య. పైగా మన వద్ద పాటించే కొన్ని సంప్రదాయాలు, మూఢనమ్మకాల కారణంగా తల్లులకు తాజా పండ్లు, కూరగాయలు ఇవ్వరు. దాంతో వాళ్లకు తగినన్ని పీచుపదార్థాలు అందక మలబద్ధకం రావచ్చు. ఫలితంగా కొందరిలో మొలల వంటి దుష్పరిణామాలకూ అవకాశముంది.
రొమ్ము సమస్యలు : ప్రసవం తర్వాత కొంతమంది తల్లుల్లో రొమ్ము నుంచి పాలు బయటికి రాక ఇబ్బంది కలగవచ్చు. ఇలాంటి సమస్యను చన్నీళ్ల కాపడంతో సరిదిద్దవచ్చు. అయితే కొందరిలో రొమ్ము భాగంలో స్టెఫలోకోకస్ ఆరెశ్యాండ్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లు రావచ్చు. సాధారణ యాంటీబయాటిక్స్‌తో ఆ సమస్యను నయం చేయవచ్చు. ఇక తరచూ కొందరిలో పాలిచ్చే భాగంలో చిన్నపాటి చీలికలు కనిపించ వచ్చు. ఇలాంటి సమస్య కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి.
(బిగ్‌బీ దివాలీ గిఫ్ట్ : నెట్టింట ట్రోలింగ్ మామూలుగా లేదుగా!)
వెన్నునొప్పి: గర్భవతిగా ఉన్నప్పుడు పెరుగుతున్న పొట్టబరువు వెన్నుపై పడుతుండటం వల్ల గర్భవతుల్లో వెన్ను నొప్పి రావడం చాలా సాధారణం. అయితే ప్రసవం తర్వాత పాలిచ్చే సమయంలో సరైన భంగిమ పాటించకపోవడం వల్ల అదే తరహా వెన్నునొప్పి కనిపించవచ్చు. కొన్ని సాధారణ ఫిజియో వ్యాయామాలతో ఈ నొప్పి తగ్గుతుంది. ఇలాంటి అనేక జాగ్రత్తలతో కొత్తగా తల్లి అయిన మహిళ చాలా సులభంగా ప్రసవానంతర (పోస్ట్ పార్టమ్) పరిణామాలనూ, సమస్యలనూ అధిగమించి పూర్తిగా ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపవచ్చు.
-డాక్టర్ విమీ బింద్రా, సీనియర్ గైనకాలజిస్ట్
నిర్వహణ: యాసీన్


