నేను ఆరు నెలల గర్భవతిని. డాక్టర్ నాకు ఐరన్ డిఫిషెన్సీ అనీమియా ఉంది అని చెప్పారు. దీనివల్ల నాకు, నా బిడ్డకు ఏ సమస్యలు తలెత్తవచ్చు? – సుజాత, నెల్లూరు.
మీ సమస్య చాలా సాధారణం. గర్భంలో ఉన్న బిడ్డకు ఐరన్ చాలా అవసరం, అందువలన తల్లి శరీరంలోని ఐరన్ నిల్వలు తగ్గిపోతాయి. ఈ పరిస్థితిలో తల్లికి అలసట, శ్వాస తీసుకోవటంలో కష్టం, తలనొప్పి, పల్స్ వేగంగా రావడం, బలహీనత వంటి సమస్యలు రావచ్చు. బిడ్డకు కూడా తక్కువ బరువుతో పుట్టే అవకాశం, రక్తహీనత సమస్యలు రావచ్చు. ఇది రావడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ఆహారంలో తగినంత ఐరన్ లేకపోవడం, జీర్ణవ్యవస్థ ఐరన్ గ్రహించకపోవడం, గర్భధారణలో ఐరన్ అవసరం ఎక్కువగా ఉండటం, గర్భధారణకు ముందు అధిక రక్తస్రావం, లేదా సికిల్ సెల్ అనీమియా, థలసీమియా వంటి రక్త సమస్యలు దీనికి కారణమవుతాయి. ముందుగా మేము రక్తపరీక్షలు చేస్తాము. ఐరన్ మాత్రలు తీసుకున్నా రక్తహీనత తగ్గకపోతే, ఫెర్రిటిన్ పరీక్ష ద్వారా శరీరంలోని ఐరన్ నిల్వలను తెలుసుకుంటాము. ఒకవేళ మాత్రలు తగిన సమయంలో పని చేయకపోతే, రక్తంలోకి నేరుగా ఐరన్ ఇవ్వవలసి ఉంటుంది.
ఈ చికిత్సలో డైట్ కూడా ముఖ్యం. మాంసం, చేపలు, పప్పులు, తృణధాన్యాలు, పాలకూర, పచ్చికూరలు ఐరన్ సమృద్ధిగా అందిస్తాయి. విటమిన్ సీ ఉన్న ఆహారం ఐరన్ డెఫిషెన్సీని తగ్గించడానికి సహాయపడుతుంది. కానీ టీ, కాఫీలు శరీరంలో ఐరన్ వృద్ధిని తగ్గిస్తాయి. కాబట్టి, వాటికి దూరంగా ఉండండి. కొన్నిసార్లు ఐరన్ మాత్రల వలన పేగు సమస్యలు, ఉబ్బరం, మలబద్ధకం రావచ్చు. అప్పుడు మేము వేరే రకం ఐరన్ టాబ్లెట్స్ ఇస్తాము.
రెండు నుంచి నాలుగు వారాల తర్వాత హీమోగ్లోబిన్ సాధారణ స్థాయికి చేరిన తర్వాత, మూడు నెలల పాటు ఐరన్ మాత్రలు కొనసాగించడం శరీరంలో ఐరన్ నిల్వలను పెంచుతుంది. గర్భంలో వయసు ఎక్కువ, మునుపటి గర్భధారణలో రక్తహీనత లేదా ప్రసవ సమయంలో రక్తం కోల్పోవడం ఉంటే, బిడ్డకు జన్మనిచ్చిన తరువాత రక్తహీనత వచ్చే ప్రమాదం ఎక్కువ.
హీమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉన్నా, తీవ్రమైన లక్షణాలు ఉంటే రక్తమార్పిడి అవసరం. ప్రసవ సమయంలో తీవ్రమైన రక్తస్రావం జరిగితే, రక్తమార్పిడి మాత్రమే తక్షణ పరిష్కారం. మొత్తానికి, ఐరన్ సరైన విధంగా తీసుకోవడం, డైట్‌ను పాటించడం, వైద్యులు సూచించే పరీక్షలు, అవసరమైన చికిత్సలు తీసుకోవడం ద్వారా మీరు, మీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువ.
- డా‘‘ ప్రమత శిరీష ,గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్‌హైదరాబాద్
ఆల్వేస్ ఫ్రీ!
సాధారణ రోజులతో పోలిస్తే చాలామంది ఆడవారు – తమ పీరియడ్స్ రోజుల్లో డల్‌గా మారిపోతారు. అస్సలు యాక్టివ్‌గా ఉండలేరు. అలాంటి వారికి చక్కటి పరిష్కారం ఈ హీటింగ్ ప్యాడ్. ఆధునిక సాంకేతికత, మెడికల్–గ్రేడ్‌తో రూపొందిన ఈ ఎలక్ట్రిక్ టూల్ చాలా చక్కగా పని చేస్తుంది.
దీనిలోని స్మార్ట్ సెన్సర్‌తో కూడిన థర్మోసింక్ ఇంజిన్– అవసరమైన వేడిని అందిస్తుంది. దీనిలో 5 వేర్వేరు ఉష్ణోగ్రత స్థాయులను సెట్ చేసుకోవచ్చు. ఇది నొప్పి తీవ్రతను బట్టి హీట్ థెరపీని అందిస్తుంది.ఈ ప్యాడ్‌లో మొత్తం ఆరు లేయర్స్ ఉంటాయి.
టెంపరేచర్ అన్నివైపులా సమానంగా వ్యాపిస్తుంది. దాంతో దీన్ని సురక్షితంగా వినియోగించుకోవచ్చు. ఇది 120 నిమిషాల (2 గంటల) తర్వాత ఆటోమేటిక్‌గా స్విచ్ ఆఫ్ అయ్యే ఫీచర్‌ను కలిగి ఉంది. దీని వలన ప్యాడ్‌ను ఎక్కువ సమయం ఉపయోగించినా లేదా పొరపాటున ఆపడం మర్చిపోయినా ఎటువంటి ప్రమాదం ఉండదు.

ఈ ఎక్స్‌ఎల్ సైజ్ హీటింగ్ ప్యాడ్ ముఖ్యంగా పీరియడ్స్ నొప్పితో పాటు వెన్నునొప్పి, కండరాల నొప్పులు, పూర్తి బాడీ రిలాక్సింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. దాంతో దీన్ని ఇంట్లోనే సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు.


