కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణం చోటు చేసుకుంది. వేరేకులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న దురహంకారంతో కన్నకూతుర్ని హతమార్చాడో తండ్రి. ఆరు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా కన్నబిడ్డను అత్యంత పాశవికంగా చేసిన హత్య ఆధునిక సమాజంలో కూడా వేళ్లూనుకొనిపోయిన కుల అహంకారానికి అద్దం పట్టింది.
హుబ్బళ్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల మాన్య పాటిల్ కులాంతర వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఈ ఏడాది మేలో ప్రేమికుడిని పెళ్లాడింది. చంపేస్తారేమోననే భయంతో స్వగ్రామానికి దూరంగా 100 కి.మీ దూరంలో ఉన్న హవేరి జిల్లాలో భర్తతోకలిసి నివసిస్తోంది. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. ఊర్లో ఉంటున్న అత్తమామల వద్దకు ఆదివారం నాడు వచ్చింది. ఇది పసిగట్టిన ఆ యువతి తండ్రి మరో ముగ్గురితో కలిసి ఆమెపై దాడికి దిగారు. ముందు ఆమె భర్త, మామ వ్యవసాయ పొలంలో ఉన్నప్పుడు వారిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. వారు తప్పించుకోవడంతో, సాయంత్రం 6 - 6:30 గంటల మధ్య, ఇనుప పైపులతో సాయుధులైన దుండగులతో కలిసి బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డాడు తండ్రి. ఆరు నెలల గర్భవతి మాన్యపై దారుణంగా ఎటాక్ చేశారు. దీంతో ఆమె ప్రాణాలొదిలింది. సంఘటనా స్థలంలోనే ఉన్న అత్తమామలు రేణుకమ్మ, సుభాష్ ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు.వారిపై కూడా దారుణంగా దాడి చేశాడు. వారు తీవ్ర గాయాలతో అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ సంఘటనలో పోలీసులుమాన్య తండ్రి ప్రకాష్ ఫక్కిర్‌గోడా, మరో ఇద్దరు దగ్గరి బంధువులను అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఈ వివాదంలోగతంలఘీ రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదర్చడానికి , ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారించడానికి గతంలో ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. ఇంత జరిగినా చివరికి కన్నబిడ్డనే హతమార్చిన ఘటన తీవ్ర ఆందోళన రేపింది.


