పత్రికా స్వేచ్ఛ అణచివేత.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు | Senior Journalists Opinions On Democracy Freedom of the Press Round Table: TS | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛ అణచివేత.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

Jun 15 2025 6:08 AM | Updated on Jun 15 2025 6:08 AM

Senior Journalists Opinions On Democracy Freedom of the Press Round Table: TS

సమావేశంలో మాట్లాడుతున్న సీనియర్‌ సంపాదకులు కె.శ్రీనివాస్‌. చిత్రంలో సాక్షి దినపత్రిక ఎడిటర్‌ ఆర్‌. ధనంజయరెడ్డి, దిలీప్‌రెడ్డి, దేవులపల్లి అమర్, అల్లం నారాయణ, కె.రామచంద్రమూర్తి, విజయ్‌బాబు, శైలేష్‌రెడ్డి, టంకశాల అశోక్‌

ప్రభుత్వ చర్యలపై స్పందించకుంటే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలు

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సీనియర్‌ సంపాదకులు, జర్నలిస్టుల ఆందోళన

జర్నలిస్టు సమాజమంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వాలపై ఉద్యమించాలని పిలుపు

కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును ముక్త కంఠంతో ఖండించిన సంపాదకులు

‘సాక్షి’పై ఉద్దేశపూర్వక దాడులు నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ అధ్యక్షుడు రాస్‌ బిహారీ   

సాక్షి, హైదరాబాద్‌: పత్రికాస్వేచ్ఛను హరిస్తూ మీడియా ప్రతినిధులను అరెస్టు చేయడంపై సీనియర్‌ సంపాదకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టు సమాజమంతా ఐక్యంగా ఉండాలని, ప్రభుత్వాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మీడియాపై ప్రభుత్వాలు చేస్తున్న ఒత్తిడి, అణచివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలపై స్పందించకుంటే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలను మీడియా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యం– పత్రికాస్వేచ్ఛ’ అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.

సీనియర్‌ జర్నలిస్టు ఆర్‌.దిలీప్‌ రెడ్డి ఈ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ‘ప్రభుత్వాలు జర్నలిస్టులను భయపట్టేలా వ్యవహరిస్తున్నాయి. కొమ్మినేని శ్రీనివాస రావు కించపరిచే వ్యాఖ్యలు చేయకపోయినా ఆయనను అరెస్టు చేయడం అన్యాయం. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది’ అని సీనియర్‌ సంపాదకులు అన్నారు.

ఇటీవల ఏపీలో సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడాన్ని ముక్త కంఠంతో ఖండించారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇటీవల సంపాదకుడు రహమాన్‌పై కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌ నాయుడు, ఉపాధ్యక్షుడు కె.శ్రీకాంత్‌రావు, ట్రెజరర్‌ రాజేష్, సభ్యులు బాపూరావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ సంపాదకులు వ్యక్తపర్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే... - కె.రామచంద్రమూర్తి ,సీనియర్‌ సంపాదకులు

పత్రికా స్వేచ్ఛను కోరుకునేది ప్రజలే.. 
పత్రికా స్వేచ్ఛ అనేది ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. దీన్ని ప్రధానంగా కోరుకునేది ప్రజలే. పత్రికలు చురుకుగా ఉన్నప్పుడే ప్రతీ విషయం ప్రజలకు చేరుతుంది. కానీ ప్రస్తుతం ప్రతికాస్వేచ్ఛ ప్రమాదంలో పడింది. కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం చూస్తుంటే ఏపీ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో స్పష్టమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గత 40 ఏళ్లుగా ఏ వర్గాన్నీ గౌరవించిన మనిషి కాదు. ప్రతీ రంగంలో తన వ్యతిరేకులను అణచివేయడం ఏళ్లుగా చూస్తున్నాం. ప్రస్తుతం ప్రతికా స్వేచ్ఛనే కాదు... అన్ని స్వేచ్ఛలు హరించుకుపోతున్నాయి. నియంత పాలన మాదిరిగా ప్రభుత్వాలను నిర్వహిస్తున్నారు.   - టంకశాల అశోక్‌, సీనియర్‌ సంపాదకులు

మీడియాను భయపెట్టే ప్రయత్నమిది.. 
కొమ్మినేని అరెస్టుతో మీడియాను భయపెట్టే ప్రయత్నం జరుగుతోంది. కొమ్మినేని తప్పు లేకు న్నా.. ఒకరకమైన భయం కలిగించే వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. రాజకీయ నేతలు తమకు అనుకూలంగా ఉండే వార్తలే రాయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం మీడి యా స్వతంత్రంగా లేదు. రాజకీయ పారీ్టల మద్దతుతో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ పాత్రికేయులు తమ పరిమితులకు లోబడి వాస్తవాలను మాత్రమే రాయాలి. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వా మ్యం రెండూ వేర్వేరు కాదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కొమ్మినేని అరెస్ట్‌తో ఆగుతుందని అనుకోవడం లేదు. దీంతో భయపడి మిగతావారు వ్యతిరేక వార్తలు రా యకుండా ఉంటారని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మిగతా జర్నలిస్టులు రియాక్ట్‌ కాకుంటే ఎలా..? - దేవులపల్లి అమర్‌ ,సంపాదకులు మన తెలంగాణ

కక్ష సాధింపునకు పరాకాష్ట 
సాక్షి టీవీ డిబెట్‌లో కొమ్మినేని శ్రీనివాసరావు అనని మాటలకు ఆయన్ను అరెస్టు చేయడం సరికాదని సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పింది. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానాలి. కొమ్మినేని అరెస్టే సరి కాదని న్యాయస్థానం స్పష్టంచేస్తుంటే, సాక్షి కార్యాలయాలపై దాడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. టీడీపీ కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సరైన కారణం లేకుండా ఎవరినైనా అరెస్టు చేయొచ్చని, ఎవరి ఇంట్లోనైనా సోదాలు చేయొచ్చనే తప్పుడు సంప్రదాయానికి తెరతీసింది. ఇది రాబోయే రోజుల్లో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగించనుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి.  - ఆర్‌.ధనంజయ రెడ్డి, ఎడిటర్, సాక్షి

ఒక్కో మీడియా ఒక్కో వైఖరితో.. 
ప్రస్తుత రోజుల్లో ఒక్కో మీడియా ఒక్కో వైఖరితో ఉంది. ఈ పరిస్థితుల్లో ఐదు పేపర్లు, పది టీవీ చానళ్లు చూస్తే తప్ప వాస్తవాలేంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం మీడియా ప్రతినిధులను అరెస్టు చేస్తుంటే... ఇక్కడ రేవంత్‌ ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీలోనే గుడ్డలూడదీసి కొడతా­నంటోంది. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి అరెస్టులను వ్యతిరేకించాలి. అల్లం నారాయణ, సీనియర్‌ సంపాదకులు

పాత్రికేయుల భద్రత గురించి ఆలోచించాలి 
రాజకీయ కక్ష సాధింపులో మీడియా పావులుగా మారుతోంది. ఏపీ, తెలంగాణ అనే కాదు.. చాలా రాష్ట్రాల్లో మీడియా టార్గెట్‌ అవుతోంది. ఈ పరిస్థితుల్లో పాత్రికేయుల భద్రత గురించి ప్రధానంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమాచా రం అందించే ఏ వ్యవస్థ అయినా మీడియా కిందనే గుర్తించాలి. ఓ వార్త విషయంలో ప్రైవేటు వ్యక్తులు కేసు పెడితే నాపై కూడా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టి అరెస్టు చేశారు. ఇదివరకు సోషల్‌ మీడియా వాళ్లను అరెస్ట్‌ చేసినప్పుడు ప్రధాన స్రవంతి మీడియా పెద్దలు పట్టించుకోలేదు. ఇప్పుడది మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా వరకు వచ్చింది. కొమ్మినేని అరెస్టుతో ఎంతపెద్ద జర్నలిస్టునైనా అరెస్టు చేస్తామనే అభిప్రాయాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లింది.  - కె.శ్రీనివాస్‌, సీనియర్‌ సంపాదకులు

సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చినా కొన్ని మీడియా సంస్థలు వెక్కిరిస్తున్నాయి 
కొమ్మినేని అరెస్టు... సాక్షి ఎడిటర్‌ ధనంజయ్‌ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన తీరు ఏపీ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. కొన్ని మీడియా సంస్థలు జర్నలిజం విలువలను దిగజార్చుతున్నాయి. కొమ్మినేని అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కొమ్మినేని నవ్వితే అరెస్టు చేయడాన్ని కక్ష సాధింపుగా కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు సూచనలపై కొందరు వ్యంగ్యంగా చర్చి­స్తు­న్నారు. కొన్ని మీడియా సంస్థలు సెక్షన్లు తెలి­యకుండా చర్చలు పెట్టేస్తున్నారు. ఇది మీడియా ఉనికికే ప్రమాదకరం. - విజయ్‌ బాబు,సీనియర్‌ సంపాదకులు

పత్రికలకు స్వేచ్ఛ లేదు 
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పత్రికలకు స్వేచ్ఛ ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా.. వార్త రాసినా ఉపేక్షించే పరిస్థితిలో లేవు. అందుకు తాజా ఉదా హరణ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు వ్యవహారమే. వాస్తవానికి ఆయనను అరెస్టు చేయడం సమంజసం కాదు.  - దిలీప్‌ రెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌

..అయినా ప్రజా ప్రయోజన వార్తలు ఆగవు 
గద్వాల జిల్లాలో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తారనే స్థానికుల సమాచారంతో నేను వార్తలు రాశాను. ఇథనాల్‌ పరిశ్రమ అత్యంత ప్రమాదకరమైంది. దీంతో ప్రజలు ఆందోళనబాట పట్టారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నన్ను అరెస్టు చేసి­ంది. అయినా ప్రజలకు ప్రయోజనం కలిగించే వార్తలు రాయడం ఆపను. - రహమాన్‌, సంపాదకులు

కలిసి ఉంటేనే మనుగడ
వ్యవస్థలో అన్ని రంగాలు ప్రభుత్వ కనుసన్నల్లోనే ఉంటున్నాయి. దీంతో జర్నలిస్టులను అకారణంగా టెర్రరిస్టుల మాదిరిగా అరెస్టు చేసి వారికి బెయిల్‌ రాకుండా చూసే ప్రయత్నం జరుగుతోంది. జర్నలిస్టు సమాజమంతా కలిసికట్టుగా ఉంటేనే మీడియా మనుగడ ఉంటుంది. - శైలేష్‌ రెడ్డి, సీఈఓ, టీ న్యూస్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement