పార్టీ జనసేన.. పెత్తనం టీడీపీదేనా? | KSR Comments Chandrababu Political Strategy and Jana Sena Dilemma | Sakshi
Sakshi News home page

పార్టీ జనసేన.. పెత్తనం టీడీపీదేనా?

Oct 21 2026 12:02 PM | Updated on Oct 21 2026 12:06 PM

KSR Comments Chandrababu Political Strategy and Jana Sena Dilemma

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ చదరంగం  ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఆయన  విపక్షానికి చెందినవారిని ఆకర్షించే పని చేస్తుంటారు. అదే సమయంలో టీడీపీ వారిని కూడా ఇతర పార్టీలలోకి పంపుతుంటారు. సాధారణంగా ఎవరైనా పార్టీ మారితే ప్రత్యర్ధి పార్టీలో చేరుతారు. కానీ ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో తమాషా రాజకీయం ఏమిటంటే వీరిలో వీరే పార్టీలు మారుతుంటారు. టీడీపీ నేతలను జనసేనలోకి పంపించి అక్కడ టిక్కెట్లు ఇప్పిస్తుంటారు. అంటే పేరుకే వారు జనసేన అభ్యర్ధులు  అన్నమాట. మొత్తం కథ అంతా నడిపేది టీడీపీనే.

విజయవాడ మేయర్ అభ్యర్ధిగా జనసేన తరపున  పోటీచేస్తున్న వంగవీటి రాధాకృష్ణ కొద్ది రోజుల క్రితం వరకు టీడీపీలో ఉన్నారు. కాని సడన్‌గా ఆయన  జనసేనలో చేరారు. అలా చేస్తే టీడీపీ వారికి కోపం రావాలి. జనసేనపై విమర్శలు చేయాలి. కాని అలా చేయలేదు. ఒక్క మాట కూడా అనలేదు. పైగా జనసేన తరపున మేయర్‌గా రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు. ఆయనకు  మద్దతు ఇవ్వడానికి టీడీపీ ఓకే చేసిందన్నమాట. దీనిని ఏ తరహా రాజకీయం అనుకోవాలన్నది ఎవరికి వారే ఊహించుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్న గుమ్మనూరు  జయరాం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి కొందరిపై అప్పట్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ తీవ్ర ఆరోపణలు గుప్పించేవారు. జయరాం నియోజకవర్గమైన ఆలూరు వెళ్లి ఎంత తీవ్రమైన ఆరోపణలు చేశారో వింటేనే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ చిత్రంగా అసెంబ్లీ ఎన్నికల సమయానికి అవన్నీ మర్చిపోయినట్లుగా  వారిని టీడీపీలో చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చారు. అలా ఉంటుంది చంద్రబాబు స్టైల్.

ఆయా పార్టీలలో కూడా ఇలా చేరికలు ఉండవచ్చు. కాని మరీ తామే తీవ్రమైన ఆరోపణలను  చేసినవారిని చేర్చుకోవడమే చెప్పుకోదగిన అంశం. ప్రధాని నరేంద్ర మోదీని ఎంత దారుణంగా చంద్రబాబు విమర్శించింది, దానికి ప్రతిగా మోదీ ఎలాంటి ఆరోపణలు చేసింది అందరికి తెలుసు. కాని ఆ తర్వాత కాలంలో మళ్లీ వీరిద్దరూ కలిసిపోయిన ఘట్టం చూసిన నేపధ్యంలో ఈ  పార్టీ మార్పిడి రాజకీయాలు పెద్ద విషయం కాకపోవచ్చు. వంగవీటి రాధాకృష్ణ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. 2019లో ఆయనకు మచిలీపట్నం ఎంపీ సీటు ఇవ్వడానికి వైఎస్సార్‌సీపీ సుముఖత చూపితే అంగీకరించకుండా టీడీపీలో చేరారు. నిజానికి ఇది చాలా అప్రతిష్ట తెచ్చే విషయం. తన తండ్రి రంగాను 1988లో టీడీపీ వారే హత్య చేశారని పలుమార్లు ఈయన స్పీచ్‌లు ఇచ్చారు. ఆయా సమయాలలో చంద్రబాబుపై సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. అయినా ఏ మాత్రం ఫీల్ కాకుండా ఆయన ఆ టిడిపిలో చేరడంతో రంగా అభిమానులు హతాశులయ్యారు.

మరో సంగతి చెప్పాలి. గతంలో కాంగ్రెస్ పార్టీలో  ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఆ తర్వాత కాలంలో బీజేపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు కూడా అయ్యారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడారో తెలుసా!. రంగాతో పాటు తనను కూడా హత్య చేయించాలని టీడీపీ వారు ప్లాన్ చేశారని  ఆరోపించారు. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల నాటికి  కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. పదవవుల కోసం రాజకీయ నేతలు ఎలా మారిపోతారో చెప్పడానికి ఇవి ఉదాహరణలు అవుతాయి. వంగవీటి రాధా మొదటే జనసేనలో చేరి ఉంటే అదో తరహా టీడీపీలో చేరారు. టీడీపీ అయితే  ఎమ్మెల్సీ పదవో, లేక మరో పదవో వస్తుందని ఆశించారని చెబుతారు. కాని అవేమీ రాలేదు. ప్రస్తుతం జనసేన మేయర్ అభ్యర్ది అయ్యారు. నేరుగా టీడీపీ అభ్యర్ధి అయితే, రాధా గతంలో చంద్రబాబుపైన, టీడీపీపైన చేసిన విమర్శల వ్యాఖ్యల వీడియోలు అధికంగా  ప్రచారం అవుతాయని, అది డ్యామేజీ కావచ్చని భావించి ఉండవచ్చు. అందుకే వ్యూహాత్మకంగా జనసేనలోకి పంపించి టిక్కెట్ ఇచ్చారని  అనుకోవాలి. అయినా రాధా గతంలో చేసిన ఆరోపణల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తారంగానే వైరల్ అవుతున్నాయి.

విజయవాడలో రాధా ఎంపిక  పరిణామం వల్ల అటు జనసేనలోను,, ఇటు టీడీపీలోను కొంత అసంతృప్తికి దారి తీసింది. నిజానికి విజయవాడలో టీడీపీకి గట్టి పట్టు ఉందని ఆ పార్టీ క్యాడర్ చెబుతుంటారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గత మూడు  ఎన్నికలలో టీడీపీనే గెలిచింది. విజయవాడ సెంట్రల్‌లో బోండా ఉమా టీడీపీ పక్షాన రెండుసార్లు గెలిచారు. ఈ నేపధ్యంలో టీడీపీ తరపున బొండా ఉమ కుమారుడు మేయర్ పదవికి పోటీచేయవచ్చన్న ప్రచారం జరిగింది. ఆయన కూడా ఈ మేరకు ప్రయత్నాలు చేశారు. కానీ అసలు టీడీపీకే సీటు దక్కలేదు. ఇక జనసేనలో ఇప్పటికే కొందరు ఆశావహులు  ఉన్నారు. వారెవ్వరికీ కాకుండా, కొత్తగా టీడీపీ నుంచి తీసుకువచ్చి పోటీలో దించడం తమను అవమానించడమేనన్నది కొందరి బాధగా ఉంది. కాకపోతే ప్రస్తుతం ఎవరూ మాట్లాడకపోవచ్చు. గత అసెంబ్లీ  ఎన్నికలలో సైతం ఇదే తరహా రాజకీయాన్ని చంద్రబాబు చేశారు.

ఉదాహరణకు అవనిగడ్డ, భీమవరం, తదితర ఏడెనిమిది నియోజకవర్గాలలో కూడా టీడీపీ వారినే జనసేనకు పంపి పోటీ చేయించారు. చంద్రబాబుకు ఈ రాజకీయం కొత్తేమి కాదు. 2019లో టీడీపీ ఓటమిపాలు కాగానే ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలో విలీనం అయ్యారు. దీనిపై చంద్రబాబు కిమ్మనలేదు. ఆయనకు తెలిసే ఈ పరిణామం జరిగిందని అంటారు. బీజేపీతో సంధి చేసుకోవడానికి గాను ఆయన ఇలా చేశారని చెబుతారు. ఆ ఎంపీలో బీజేపీలో చేరినా, కొందరు ఆయన తరపునే పనిచేస్తుంటారన్నది బహిరంగ రహస్యమే. ఇలాంటి రాజకీయ వ్యూహాలు మంచివేనా అన్న  సందేహం రావచ్చు. కానీ అధికారం చేపట్టడానికి ఏ వ్యూహం అవసరమైతే దానిని అనుసరించడం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అలవాటుగా మార్చుకుంది. ఇక్కడ విలువలు, సిద్దాంతాలతో నిమిత్తం లేదు. ప్రస్తుతం అదే దారిలోకి  జనసేనను కూడా తీసుకువచ్చారన్న విశ్లేషణ వస్తుంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయ  ప్రయోజనాలకే పరిమితమై పార్టీ కేడర్‌ను పట్టించుకోరన్న అభిప్రాయం ఆయా వర్గాలలో ఉంది. దానికి తగినట్లే ఎవరూ తనను ప్రశ్నించరాదని  పార్టీ కార్యకర్తలను పవన్  హెచ్చరించడం  కూడా తెలిసిన  విషయమే.

పార్టీ ఆత్మగౌరవం నిలబడేలా, కార్యకర్తలకు న్యాయం జరిగేలా ఈసారి సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పినా అవన్ని బీరాలుగానే మారాయన్నది జనసేన కేడర్‌ ఆవేదనగా ఉంది. స్థానిక ఎన్నికలలో పోటీపై రకరకాల మాటలు చెప్పి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితరులు కార్యకర్తలను మభ్యపెట్టే  పనిచేశారు. వాటిని విన్నవారు ఈసారి కచ్చితంగా 33 శాతం పైనే తమకు సీట్లు వస్తాయని ఆశించారు. కాని తదుపరి కాలంలో అధినేతల స్వరం మారిపోయింది. కార్యకర్తలకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని చెప్పిన వీరు బలం ఉన్నచోటే పోటీచేస్తామని  తేల్చేశారు. తద్వారా తాము టీడీపీకి లొంగి ఉండాల్సిందేనన్న సంకేతం ఇచ్చారని జనసేనకు చెందిన పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తొలుత టీడీపీ వర్కింగ్ అధ్యక్షుడు, మంత్రి లోకేష్ జనసేనకు 15 శాతం, బీజేపీకి ఐదు శాతం సీట్ల కేటాయింపు జరుగుతుందని చెప్పినప్పుడు జనసేనలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా లోకేష్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దానిపై అసంతృప్తి చెందినట్లు పవన్ కళ్యాణ్ పైకి సంకేతాలుపంపించినా, లోపల మాత్రం కొంచెం అటూ, ఇటూగా ఆ శాతం సీట్లకే ఓకే చేశారన్న అభిప్రాయం పార్టీలో  ఏర్పడింది. కనీసం 35 నుంచి నలబైశాతం సీట్ల కేటాయింపు జరుగుతుందని ఆశించిన పార్టీ క్యాడర్‌కు ఇది నిరాశ కలిగించింది.

ఆయా సీట్లలో  17 శాతం నుంచి ఇరవైశాతం మాత్రమే  దక్కాయి. అయినా పవన్ కళ్యాణే సర్దుకుపోయినప్పుడు వారు మాత్రం చేయగలిగేది ఏమి ఉంటుంది!. మరో విశేషం ఏమిటంటే తాము బలంగా ఉన్న సీట్లను రిజర్వుడ్ గా మార్చారాన్నది జనసేనలో ఉన్న ఒక భావన. పవన్‌కు తెలియకుండా ఇవి ఖరారయ్యాయని, ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. కానీ తీరా చూస్తే ఎల్లో మీడియా ఇచ్చిన ఒక కథనం ప్రకారం పిఠాపురం సీటు రిజర్వు చేసిన విషయంలో ఆయన జోక్యం చేసుకోలేదట. అంటే రిజర్వేషన్లు ఆయనకు తెలిసే జరిగాయన్న విధంగా టీడీపీ మీడియా చెబుతోంది. జనసేన  సంతోషంగా సర్దుబాటు  చేసుకుందా? లేక లొంగిపోయిందా అన్న  ప్రశ్న వస్తే  అవమానమాన భారమైనా, మరొకటైనా ఆ పార్టీలో ఉండదలిస్తే కార్యకర్తలు దేనికైనా  సరిపెట్టుకోవడమే తప్ప చేయగలిగింది ఏమి ఉంటుంది!. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ ను, జనసేన కార్యకర్తలు  ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారన్నమాట! చంద్రబాబు రాజకీయ వ్యూహానికి తలొగ్గక తప్పదు కదా అన్న భావన జనసేనలో ఏర్పడింది. ఇక ఆత్మగౌరవం అన్న మాటకు తావెక్కడ ఉంటుంది?.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement