కంగనాకు జగ్గారెడ్డి కౌంటర్‌ | Congress Jagga Reddy Political Counter To MP Kangana | Sakshi
Sakshi News home page

సోనియాపై వ్యాఖ్యలు.. కంగనాకు జగ్గారెడ్డి కౌంటర్‌

Nov 12 2026 1:51 PM | Updated on Nov 12 2026 1:51 PM

Congress Jagga Reddy Political Counter To MP Kangana

సాక్షి, హైదరాబాద్‌: బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కంగనా ఒక నటి మాత్రమేనని, రాజకీయ నాయకురాలు కాదని వ్యాఖ్యానించారు. ఎవరో రాసిచ్చిన డైలాగులు చెప్పడం తప్ప ఆమెకు రాజకీయాలు, నాయకుల చరిత్ర గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. సోనియా గాంధీ చరిత్రను తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలని హితవు పలికారు. మరోవైపు సోనియా గాంధీ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు.

గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. కంగనా రనౌత్‌ వ్యాఖ్యలపై స్పందించారు. ఆమెకు చరిత్ర తెలియదని, అన్నీ తెలిసినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరో చెప్పిన విషయాలను మాట్లాడటమే తప్ప సొంతంగా రాజకీయ అవగాహనతో వ్యాఖ్యలు చేయడం లేదని అన్నారు. చరిత్రను వక్రీకరించవద్దని సూచించారు. ఇదే సమయంలో సోనియా గాంధీ జీవిత ప్రయాణాన్ని సినిమాగా తెరకెక్కించాలనే తన ఆలోచనను జగ్గారెడ్డి వెల్లడించారు. ఆమె జీవిత చరిత్ర పుస్తక రూపంలో రావడం తనకు ఆసక్తి కలిగించిందని, దాన్ని సినిమాగా తీస్తే బాగుంటుందని భావించినట్లు చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీలోని నాయకుల నుంచి నైతిక మద్దతు తీసుకుని, ఆర్థిక సహకారాన్ని స్థానికంగా ఉన్నవారి నుంచి సమీకరిస్తానని తెలిపారు.

డిసెంబర్‌ 9న సినిమా ప్రారంభం?
డిసెంబర్‌ 9న సినిమా ప్రారంభించి, తదుపరి సోనియా గాంధీ పుట్టినరోజు నాటికి పూర్తి చేయాలనే ఆలోచన ఉందని జగ్గారెడ్డి చెప్పారు. అయితే దీనిపై సీఎం, పీసీసీతో చర్చించిన తర్వాతే అధికారిక ప్రకటన చేస్తానని స్పష్టం చేశారు. అలాగే, సోనియా గాంధీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.  మూడుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు ప్రత్యేకమైనవని, ప్రజల కోసం పదవులను సైతం వదులుకున్న చరిత్ర ఉందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ దాని గురించి గొప్పలు చెప్పుకోకుండా ఉండటమే తమ నాయకత్వ విధానమని జగ్గారెడ్డి అన్నారు. ఈ రోజుల్లో చిన్న విషయాలకే ప్రచారం చేసుకుంటున్నారని, కానీ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ దాన్ని వ్యక్తిగత ఘనతగా ప్రచారం చేసుకోలేదని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: కొత్త ఇన్‌చార్జ్‌పై కాంగ్రెస్‌ కసరత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement