న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీ వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయా? భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఇందిర ఎలా స్పందించారు? విడిపోవాలనే నిర్ణయం వరకు వెళ్లిన ఈ దంపతులు మళ్లీ ఎలా దగ్గరయ్యారు? కాంగ్రెస్ నేత సోనియా గాంధీ తన జ్ఞాపకాల పుస్తకం ‘Belonging: A Journey of Love’లో ఇలాంటి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
1942లో ఇందిర, ఫిరోజ్ వివాహం చేసుకున్నారు. 1947లో నెహ్రూ ప్రధానమంత్రి కావడంతో ఇందిర ఆయనకు అధికారిక కార్యక్రమాల్లో సహకరించాల్సి వచ్చింది. దీంతో భర్తకు దూరంగా ఎక్కువ సమయం గడపాల్సి వచ్చేది. అధికారిక విందుల్లో తండ్రి పక్కన ఇందిరా కూర్చుంటే.. ఫిరోజ్ మాత్రం దూరంగా కూర్చోవాల్సి వచ్చేది. ఈ పరిణామాలు ఆయనను బాధించేవని సోనియా తన పుస్తకంలో రాశారు.
1950ల మధ్యకాలంలో ఫిరోజ్ మరో నివాసానికి వెళ్లిపోయారు. స్నేహితులు, మహిళలతో ఎక్కువ సమయం గడిపేవారని సోనియా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా ఒకసారి ఫిరోజ్‌కు రాసిన లేఖలో.. ‘నువ్వు ఎవరితో బయటకు వెళ్లినా, ఏం చేసినా నాకు అభ్యంతరం లేదు. అది నీకు సంతోషాన్నివ్వాలి. అయితే ఇతరుల ద్వారా వినేలోపు నువ్వే నాకు చెప్పాలి’ అని పేర్కొన్నారు. అయితే ఫిరోజ్ మరో మహిళతో మరింత సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడం ఇందిరను తీవ్రంగా బాధించింది. దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగి అధికారికంగా విడిపోవాలనే ఆలోచన వరకు వెళ్లారు. ఈ విషయంపై ఫిరోజ్ నెహ్రూను సంప్రదించగా, ఆయన సర్దిచెప్పడంతో కొంతకాలానికి విడిపోయే ఆలోచనను విరమించుకున్నారు.
1958లో ఫిరోజ్‌కు గుండెపోటు రావడంతో ఇందిర ఆయనకు దగ్గరయ్యారు. ఆసుపత్రిలో ఆయనకు సేవలు అందించారు. 1959లో ఇందిరకు శస్త్రచికిత్స జరిగినప్పుడు ఫిరోజ్ కూడా ఆమెకు అండగా నిలిచారు. 1960లో కుటుంబమంతా కశ్మీర్ పర్యటనకు వెళ్లింది. అయితే మూడు నెలలకే ఫిరోజ్ మరోసారి గుండెపోటుతో మరణించారు. అప్పటికి ఆయన వయసు 48 ఏళ్లు.
తన అత్త ఇందిర, ఫిరోజ్ మధ్య ఎన్ని విభేదాలున్నా వారి ప్రేమబంధం మాత్రం కొనసాగిందని సోనియా తెలిపారు. ‘ఫిరోజ్‌ను దూరంపెట్టినందుకు నేను ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నాను. కోపంలో లేదా బాధలో ఉన్నప్పుడు విడిపోవాలనే నిర్ణయం తీసుకోవద్దు’ అని ఇందిర తనతో చెప్పినట్లు సోనియా వెల్లడించారు. ఫిరోజ్ మాత్రమే తాను ప్రేమించిన వ్యక్తి అని ఇందిర తనతో చెప్పిన విషయాన్ని కూడా సోనియా ఈ పుస్తకంలో ప్రస్తావించారు.
ఇదీ చదవండి: అర్ధరాత్రి వాంగ్‌చుక్‌ను ఎత్తుకెళ్లిన పోలీసులు!


