ఏఐ...'ఆన్సర్‌' ప్లీజ్‌! | Using AI for even the simplest multiplications | Sakshi
Sakshi News home page

ఏఐ...'ఆన్సర్‌' ప్లీజ్‌!

Nov 12 2026 5:28 AM | Updated on Nov 12 2026 5:28 AM

Using AI for even the simplest multiplications

ప్రతి చిన్న గుణకారాలకూ ఏఐ వాడకం  

మూడేళ్ళలో 50 శాతం రెట్టింపు

అసైన్‌మెంట్ల వినియోగంలో కీలకం

క్రిటికల్‌ థింకింగ్‌ తగ్గుతోందంటున్న నిపుణులు

సరైన శిక్షణ అందడంలేదని అభిప్రాయం 

తప్పుడు సమాధానాలొస్తున్నాయి అని ఆందోళన 

కేంద్ర విద్యాశాఖ తాజా సర్వేలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థుల అభ్యాస విధానంలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కీలక పాత్ర పోషిస్తోంది. పాఠాలను అర్థం చేసుకోవడం నుంచి అసైన్‌మెంట్లు, పరిశోధన, ప్రెజెంటేషన్ల తయారీ వరకు ఏఐ సాధనాలను వినియోగిస్తున్నారు. అయితే ఈ సాంకేతికతను విద్యార్థులు ఎంతవరకు నేర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు? ఎంతమంది కేవలం సమాధానాలు పొందేందుకు ఆధారపడుతున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రం నిర్వహించిన ఓ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. 

విద్యార్థులు ప్రతీ చిన్న గుణకారాలకూ ఏఐనే వాడుతున్నారు. గడిచిన మూడేళ్ళతో పోలిస్తే కొద్ది పాటి లెక్కలకూ ఏఐని వినియోగించే వారి సంఖ్య 50 శాతం రెట్టింపు అయిందని తేలింది. భారతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల్లో 84 శాతం మంది చదువులకు జనరేటివ్‌ ఏఐని ఉపయోగించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సగటు 80 శాతంగా నమోదైంది. 2023లో ప్రపంచ విద్యార్థుల్లో ఏఐ వినియోగం 40 శాతం మాత్రమే ఉండగా.. రెండేళ్లలో రెట్టింపైంది. 2023లో భారత విద్యార్థుల్లో ఏఐ వినియోగం 44 శాతంగా ఉండగా.. 2025 నాటికి 84 శాతానికి చేరింది. అంటే రెండేళ్లలో 40 శాతం పాయింట్ల పెరుగుదల నమోదైంది. 

సమాధానాల కోసం..
విద్యార్థులు ఏఐని ప్రధానంగా మూడు విధాలుగా వినియోగిస్తున్నారు. పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోవడం, వ్యాసాలు లేదా పరిశోధన పత్రాలను సంక్షిప్తం చేయడం, అసైన్‌మెంట్లకు ఆలోచనలు పొందడం కోసం వాడుతున్నారు. 56 శాతం మంది విషయాలను అర్థం చేసుకోవడానికి లేదా సబ్జెక్టులపై అవగాహన పెంచుకోవడానికి ప్రధానంగా వాడుతున్నారు. 55 శాతం మంది వేగంగా నేర్చుకోవడానికి, 35 శాతం మంది వ్యక్తిగత అభ్యాసానికి ఉపయోగిస్తున్నారు.

అయితే మరోవైపు 29 శాతం మంది విద్యార్థులు ఏదైనా అంశం లేదా అసైన్‌మెంట్‌ విషయంలో సందేహం వచ్చినప్పుడు ముందుగా ఏఐనే ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. ఉచిత ఆన్‌లైన్‌ వనరులు, స్నేహితులు, పాఠ్యాంశాల కంటే ఏఐ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో విద్యార్థులకు ఏఐ ఒక అభ్యాస సాధనంగా మారుతోందా? స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యాన్ని తగ్గిస్తోందా? అనే ఆందోళన కేంద్ర పరిశోధన సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి.

తప్పుడు సమాచారం.. 
ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ.. దాని సమాధానాలపై విద్యార్థులకు పూర్తి విశ్వాసం లేదని పరిశోధనలో తేలింది. సర్వేలో ఏఐ ఇచ్చే సమాచారం తప్పుగా ఉండొచ్చని 53 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని ఉపయోగించని విద్యార్థుల్లో 38 శాతం మంది కూడా తప్పుడు సమాచారం వస్తుందనే భయంతో దూరంగా ఉన్నారు.50 శాతం మంది విద్యా అవసరాలకు ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ సాధనాలు కావాలని కోరుకున్నారు. 

49 శాతం మంది సమాధానాల్లో మానవ నిపుణుల భాగస్వామ్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. 38 శాతం మంది డేటా గోప్యతకు రక్షణ అవసరమని పేర్కొన్నారు. విద్యార్థుల ఏఐ వినియోగంపై తరగతి వారీగా అధ్యయనం, ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థులకు డిజిటల్‌ భద్రతపై అవగాహన, ఏఐ ఆధారిత అసెస్‌మెంట్‌ విధానాలు అభివృద్ధి చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.  

‘అండర్‌గ్రాడ్యుయేట్‌’ సర్వేలో...
బ్రిటన్‌లోని హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ (హెపి) 2025లో 1,041 మంది అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థులపై నిర్వహించిన సర్వేలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. 

1. 92 శాతం మంది విద్యార్థులు ఏదో ఒక రూపంలో ఏఐ ఉపయోగిస్తున్నారు. 
2. 88 శాతం మంది అసెస్‌మెంట్లు, అసైన్‌మెంట్ల కోసం జనరేటివ్‌ ఏఐ వినియోగించారు.
3. 2024లో అసైన్‌మెంట్ల కోసం ఏఐ వినియోగం 53 శాతంగా ఉండేది. 
4. 45 శాతం మంది పాఠశాల స్థాయిలోనే ఏఐ ఉపయోగించినట్లు తెలిపారు.
5.  67 శాతం మంది ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ నైపుణ్యాలు అవసరమని భావిస్తున్నారు.
6.  ఏఐ నైపుణ్యాలపై విద్యాసంస్థల నుంచి శిక్షణ పొందినవారు మాత్రం 36 శాతమే ఉన్నారు.
7. విద్యార్థులకు ఏఐపై ఆసక్తి, వినియోగం పెరుగుతున్నా.. దాన్ని సమర్థంగా ఉపయోగించేలా శిక్షణ అందడం లేదని సర్వే సూచిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement