‘సాక్షి’పై కొనసాగుతున్న కక్ష సాధింపు | Sakshi Editor Dhananjaya Reddy and Journalists appeared before Tadepalli police for investigation | Sakshi
Sakshi News home page

‘సాక్షి’పై కొనసాగుతున్న కక్ష సాధింపు

Sep 12 2025 6:02 AM | Updated on Sep 12 2025 6:02 AM

Sakshi Editor Dhananjaya Reddy and Journalists appeared before Tadepalli police for investigation

విచారణ అనంతరం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ నుంచి బయటకు వస్తున్న ‘సాక్షి’ ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి

తాడేపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరైన ఎడిటర్, పాత్రికేయులు 

పాత్రికేయ ప్రమాణాలకు విరుద్ధంగా పోలీసుల ప్రశ్నావళి 

బాధితుల వివరాలు వెల్లడించాలని పట్టుబట్టిన పోలీసులు

సంస్థ అంతర్గత వ్యవహారాలూ వెల్లడించాలన్న వైనం 

35 ప్రశ్నలకు లిఖిత పూర్వకంగా, మౌఖికంగా సమాధానం 

రాజ్యాంగ నిబంధనలు, పాత్రికేయ ప్రమాణాలు కచ్చితంగా 

పాటిస్తున్నామని స్పష్టం చేసిన సాక్షి ప్రతినిధులు

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న సాక్షి పత్రికపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. అక్రమ కేసులు, విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో పోలీసు అధికారు­లకు పదోన్నతులు కల్పించలేదని ప్రచురించిన కథనంపై నమోదు చేసిన అక్రమ కేసులో సాక్షి పత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, మరో ఇద్దరు పాత్రికేయులు తాడేపల్లి పోలీసుల ఎదుట గురువారం వి­చారణకు హాజరయ్యారు. పోలీసులు విచారణ పే­రు­తో మూడు గంటలపాటు వేచి ఉండేలా చేశా­రు.

పాత్రి­కేయ ప్రమాణాలు, విలువలకు విరుద్ధంగా ప్ర­శ్న­లు సంధించడం విస్మయ పరిచింది. బాధితుల వివరాలు వెల్లడించాలని, సంస్థ నిర్వహణకు సంబంధించిన అంతర్గత అంశాలు బహిర్గతం చేయా­లని పట్టుబట్టడం గమనార్హం. రాజ్యాంగ నిబ­ంధనలు, పాత్రికేయ ప్రమాణాలు, విలువలను కచ్చితంగా పాటిస్తున్నామని సాక్షి పత్రిక ఎడి­టర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, పాత్రికేయులు స్పష్టం చేశారు. విచారణకు పూర్తిగా సహ­కరిస్తామన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు 
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబమే పత్రికా స్వేచ్ఛ. సామాజిక మాధ్యమాల యుగంలో ప్రెస్‌మీట్‌ను వక్రీకరించకుండా యథాతథంగా ప్రచురించడం సంపాదకుడి బాధ్యత. సాక్షి ఎడిటర్‌గా తన విద్యుక్త ధర్మాన్ని పాటించిన ఆర్‌.ధనంజయరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం సరికాదు. ఫిర్యాదులోని అంశాల్లో ఆధారాలు పరిశీలించకుండా కేసులు నమోదు చేయడం భావ్యం కాదు. నేతలు తమ పార్టీ విధానాలను వెల్లడిస్తే, వాటి ఆధారంగా ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం సరికాదు.     – కేటీఆర్, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

ఎడిటర్‌పై కేసులు పెట్టే సంస్కృతి ఏమిటి?
విలేకరుల సమావేశంలో ఒక నాయకుడు మాట్లాడిన అంశాలను పత్రికలో ప్రచురిస్తే.. ఆ పత్రిక సంపాదకునిపై ఏకంగా కేసు నమోదు చేయడం ఏమిటి? ఇదెక్కడి న్యాయం? ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా, సాక్షిలో పనిచేసే వారిని, ఎడిటర్‌ ధనంజయరెడ్డిని వేధించేలా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిపై కేసు పెట్టొచ్చు కానీ.. అది ప్రచురించిన సంపాదకునిపై కేసు పెట్టడం అధికార దుర్వినియోగమే. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అవుతుంది. ఈ సంస్కృతికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలకాలి.   – టి.హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే 

కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నాం
పత్రికా స్వేచ్ఛ మన ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభం. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఒక మీడియా సమావేశాన్ని ప్రచురించినందుకు సాక్షి పత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేయడం సరికాదు. విమర్శ హేతుబద్ధం కానప్పుడు, విమర్శ చేసిన వారిపై చట్టబద్ధ చర్య తీసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఈ విషయంపై పత్రిక సంపాదకునిపై కేసు పెట్టడం కక్ష సాధింపు చర్యే. దీనిని ఖండిస్తూ ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులను ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. దీనిపై ఎడిటర్‌ గిల్డ్‌ స్పందించాలని కోరుతున్నా.  – విమలక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు

బెదిరింపు ధోరణి సరికాదు
పోలీసుల పదోన్నతుల్లో అక్రమాలను వెలుగులోకి తెచ్చినందుకు ప్రభుత్వం సాక్షిపై కక్షగట్టడం సరికాదు. లోపాలను ఎత్తి­చూపితే బెదిరింపు ధోరణికి దిగడం సమర్థనీయం కాదు. సాక్షి ఎడి­టర్, రిపోర్టర్లపై పోలీస్‌ కేసులు పెట్టి విచా­రణ పేరుతో వేధించడం సరి కాదు. పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించేలా పోలీసులు తీరు ఉంది. ఏదైనా అభ్యంతరకరమైన విధంగా వార్తా కథనం ప్రచురిస్తే.. పోలీసు అధికారులు రిజాండర్‌ ఇచ్చే అవకాశం ఉంది. పోలీసులు తమ వాదనను కూడా సంబంధిత పత్రికకు చెప్పొచ్చు. అంతేగాని అధికారం చేతిలో ఉందని కేసులు పెట్టి బెదిరింపు ధోరణికి దిగడం మానుకోవాలి.   – కె.రామకృష్ణ, సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి

ఇది కక్ష సాధింపు ధోరణే
తెలుగు రాష్ట్రాల్లో పాలక పక్షాలు.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతిపక్షాల గొ­ంతును వినిపిస్తున్న మీడియాపైనా కక్ష సాధింపు ధోరణి కనిపిస్తోంది. కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్కృతి పెరగడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ ఆలోచన విధానం నుంచి ప్రభుత్వాలు బయటకు రావాలి. ప్రతిపక్షాల పాత్ర­ను అణచి వేయడం, పత్రికల స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్ర­మాదం. ఏకపక్షంగా పత్రికల గొంతు నొక్కే యత్నం ప్రజా క్షేత్రంలో చెల్లుబాటు కాదు.  – సంధ్య, పీఓడబ్ల్యూ నేత

మీడియాపై కేసులు సరికాదు   
ఉద్దేశ పూర్వకంగా మీడియాపై కేసులు పెట్టడం సరికాదు. మీడియాలో కేవ­­లం పాలక పక్షం వార్త­లే కాదు. ప్రతిపక్షం వార్త­లు కూడా వస్తాయి. ప్రతి­పక్షాల వార్తలు రాసినందుకు మీడియా­పై కేసులు నమోదు చేయడమంటే జర్నలిజంపై దాడి చేయడమే.   – ఎస్‌ఎల్‌ పద్మ, ప్రజాపంథా నాయకురాలు

విచారణ సందర్భంగా పలు ప్రశ్నలు!
»  సాక్షి పత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. విజయవాడలోని సాక్షి కార్యాలయంలో అర్ధరాత్రి తనిఖీల పేరుతో వేధింపులకు తెగబడ్డారు. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కును కాలరాస్తూ నమోదు చేసిన అక్రమ కేసుపై సాక్షి పత్రిక ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కఠిన చర్యలు చేపట్టవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. విచారణకు సహకరించాలని సూచించింది.

»  న్యాయస్థానం ఆదేశాల మేరకు సాక్షి పత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, ఇద్దరు పాత్రికేయులు తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో సీఐ పి.వీరేంద్ర బాబు ఎదుట గురువారం విచారణకు హాజరయ్యారు.  విచారణ సందర్భంగా పోలీసులు దాదాపు 3గంటలపాటు నిరీక్షించేలా చేశారు. అసలు పత్రికా నిబంధనలను, నియమావళికి విరుద్ధంగా ప్రశ్నలు సంధించడం గమనార్హం.

»  బాధితుల వివరాలు చెప్పకూడదన్నది సహజ న్యాయ సూత్రం. కానీ పదోన్నతులు కల్పించక పోవడంతో తాము నష్టపోయామని సాక్షి పత్రిక దృష్టికి తీసుకువచ్చిన పోలీసు అధికారుల పేర్లు, వివరాలు చెప్పాలని పోలీసులు పదే పదే ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పదోన్న­తులు కోల్పోయిన డీఎస్పీలు బాధితులు అవుతారు. కానీ వారి పేర్లను చెప్పాలని తాడేపల్లి పోలీసులు పట్టుబట్టారు.  

» సాక్షి పత్రిక నిర్వహణ, రోజువారీ పనితీరు అన్నది ఆ సంస్థ అంతర్గత వ్యవహారం. ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని పత్రికకు సంబంధించిన అంతర్గత అంశాలను కూడా వెల్లడించాలని పోలీసులు ప్రశ్నించడం విస్తుగొలుపుతోంది. పోలీసులు సంధించిన 35 ప్రశ్నలకు సాక్షి ప్రతినిధులు లిఖిత పూర్వకంగా, మౌఖికంగా సమాధానాలు ఇచ్చారు.

»  రాజ్యాంగ నిబంధనలు, పాత్రికేయ ప్రమాణాలు, విలువలను సాక్షి పత్రిక కచ్చితంగా పాటిస్తోందని స్పష్టం చేశారు. పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బ తీయడం తమ అభిమతం ఏమాత్రం కాదని, ప్రజల ప్రయోజనాల పరిరక్షణే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. ఎటువంటి బాహ్య ఒత్తిడికి తలొగ్గకుండా పాత్రికేయ ప్రమాణాలు, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాలను తు.చ. తప్పక పాటిస్తున్నామని సాక్షి ప్రతినిధులు విస్పష్టంగా చెప్పారు. న్యాయవాదుల సమక్షంలో నిర్వహించిన విచారణ ప్రక్రియను పోలీసులు వీడియో తీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement