
విశ్లేషణ
కృత్రిమ మేధ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉద్యోగాల స్వభావంపై ప్రభావం చూపిస్తోంది. ఈ కృత్రిమ మేధ మానవ మనుగడకు ప్రమాదమని కొంతమంది వాదిస్తున్నప్పటికీ, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందిన భారత్‌కు, ఏఐ లాంటి నూతన సాంకేతికత విషయంలో ‘గ్లోబల్ లీడర్’గా స్థానం సంపాదించవలసిన అవసరం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా జెనరేటివ్ ఏఐ వినియోగించే సంస్థలు 2023లో 33 శాతం కాగా, 2024లో అవి 71 శాతానికి పెరిగాయి. పటిష్ఠమైన వృత్తి నైపుణ్యం కల్గిన శ్రామికులు, సాంకేతికతపై సంస్థల భారీ పెట్టుబడులు, డిజిటల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి కారణంగా భారత ఏఐ మార్కెట్ 2027 నాటికి 17 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ‘బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు’ నివేదిక వెల్లడించింది.
2030 నాటికి ఏఐ కారణంగా డేటా ఎన్నొటేషన్, ఏఐ ఇంజినీరింగ్, కస్టమర్ సేవలు, ఎథికల్ ఏఐలో 40 లక్షల మందికి నూతన ఉపాధి లభిస్తుందని ‘నీతి ఆయోగ్’ అభిప్రాయపడింది. ఏఐ విజయంలో స్టార్టప్‌లు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది.
ఇంటర్నెట్ లేకుండానే ఏఐ ఎలా?
ఏఐ సాంకేతికత కారణంగా భారత్‌లో ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ, ఐటీ సేవలు, విద్య, వ్యవసాయ రంగంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే, డేటా భద్రత–ప్రైవసీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కొరత, ఏఐ సొల్యూషన్స్ అమలుపరచడానికి తగిన పెట్టుబడి లేకపోవడం, డేటా నాణ్యత తక్కువగా ఉండటం, ఎథిక్స్ ఏఐ సొల్యూషన్ ప్రొవైడర్స్‌కు సవాలుగా పరిణమించడం లాంటివి ఏఐ సాంకేతిక వినియోగంలో ప్రధాన సమస్యలుగా నిలుస్తున్నాయి.
జాతీయ స్థాయిలో సీబీఎస్‌ఈ కృత్రిమ మేధను ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా 9, 10వ తరగతి విద్యార్థులకు 2019–20లో; సెకండరీ విద్య (6, 7 తరగతులు)లో 2022–23 నుండి ప్రవేశపెట్టింది. కానీ ఏఐని ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టిన పాఠశాలల్లో 2021–22 నాటికి 33.9% పాఠశాలలు మాత్రమే ఇంటర్నెట్ లభ్యతను కలిగి ఉన్నాయి; ఆ యా పాఠశాలల్లోని ఉపాధ్యాయుల్లో 50 శాతం కన్నా తక్కువమంది కంప్యూటర్ వినియోగం పట్ల అవగాహన కలిగి ఉన్నారు.
ఇది పాఠశాలల స్థాయిలో అవస్థాపనా సౌకర్యాల కొరతను ఎత్తిచూపుతోంది. కేంద్ర ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరంలో మూడో తరగతి నుండే పాఠశాల విద్యా ప్రణాళికలో ఏఐని ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. ఈ క్రమంలో సీబీఎస్‌ఈ అన్ని తరగతులలో ఏఐని అనుసంధానపరచడానికి ఒక చట్రాన్ని (ఫ్రేమ్ వర్క్) రూపొందిస్తున్నప్పటికి, కోటిమంది ఉపాధ్యాయులకు ఏఐ–సంబంధిత విద్యలో శిక్షణనివ్వడం క్లిష్టతరమయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రాల్లో మౌలిక ఇబ్బందులు
ఏఐ అడాప్షన్‌లో రాష్ట్రాల మధ్య అసమానతలు స్పష్టమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2023 జూలైలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు కరిక్యులమ్‌లో ఏఐని చేర్చాలనీ; ఏఐ, రోబోటిక్స్‌ను మెడికల్ విద్యలో ప్రవేశపెట్టాలనీ విద్యాశాఖ అధికారులు, వైస్ ఛాన్స్‌లర్లకు సూచించారు. విద్యార్థులను ‘ఏఐ క్రియేటర్స్’గా రూపొందించాలనే లక్ష్యాన్ని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. సుపరిపాలన, ఇతర రంగాలలో అభివృద్ధి నిమిత్తం జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏఐ వినియోగానికి ప్రాధాన్యమిస్తూ, బోధనా పద్ధతులలో మార్పు నిమిత్తం టెక్ దిగ్గజాలతో కలసి పనిచేసింది.
ఇక తెలంగాణ ప్రభుత్వం ఏఐని ప్రోత్సహించడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం లాంటి రంగాలలో సమర్థత, సర్వీస్ డెలివరీ పెంపునకు ఆ యా శాఖల్లో ఏఐని అనుసంధానపరచింది. 5 లక్షల మందికి ఏఐ నైపుణ్యంపై శిక్షణనివ్వడంతో పాటు, కోటి మంది ప్రజలకు 2027 నాటికి 300కు పైగా, పౌర సేవలను ఏఐ ద్వారా అందించాలనీ, ప్రపంచవ్యాప్తంగా మొదటి 25 ఏఐ ఇన్నోవేషన్ హబ్‌లలో హైదరాబాద్ స్థానం సాధించాలనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత లక్ష్యసాధనలో అవరోధంగా నిలిచే ప్రమాదం ఉంది.
మరోవైపు కర్ణాటక 28 కోట్ల వ్యయంతో 2029 నాటికి 3,50,000 మందికి ఏఐ ఉపాధి లక్ష్యంగా ‘ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను బెంగళూరులో ఏర్పాటు చేసింది. పశ్చిమ రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర కూడా యూనివర్సిటీల్లో ఏఐ కేంద్రాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఏఐలో ఉన్నత విద్య సర్టిఫికేషన్‌కి హరియాణా ప్రాధాన్యమిస్తోంది. బిహార్‌లో అవస్థాపనా సౌకర్యాల కొరత, పట్టణ – గ్రామీణ, ప్రభుత్వ –ప్రైవేటు రంగంలోని అసమానతల వల్ల కృత్రిమ మేధ ప్రగతి తక్కువగా ఉంది.
సమంగా పంపిణీ కాకపోతే...
కృత్రిమ మేధ ప్రయోజనాలు అన్ని వర్గాల ప్రజల మధ్య సమంగా పంపిణీ కావడం లేదు. ఏఐ సాంకేతికత... ఉపాధి పెంపు, ఆదాయ సమాన పంపిణీ, సంపద కల్పనకు దారి తీయనట్లయితే సమాజంలో అన్ని వర్గాల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. ఆదాయ స్థాయి, సామాజిక తరగతులు (సోషల్ క్లాస్) ఏఐ సాంకేతికత అందుబాటును నిర్ణయిస్తున్నాయి.
గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీ తక్కువగా ఉండటం వలన ఏఐ సాంకేతికత అందుబాటు అసమానతలకు కారణమవుతోంది. పైగా పరిమిత విద్యుచ్ఛక్తి లభ్యత ఏఐ సేవల వృద్ధిని ప్రభావితం చేస్తుంది. 2030–35 నాటికి ప్రపంచ విద్యుత్ వినియోగంలో డేటా సెంటర్ల వాటా 20 శాతంగా ఉండి పవర్ గ్రిడ్స్‌పై అధిక ఒత్తిడికి కలుగ జేస్తాయని అంచనా. భారీ పరిమాణంలో డేటాను ప్రాసెస్ చేయడానికీ, గణనకు అవసరమయిన గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్లు, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు పని చేయడానికీ, శిక్షణలో భాగంగా ప్రాసెసర్లు పని చేయడానికీ భారీ విద్యుత్ అవసరం. విద్యుత్ లభ్యత పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో తక్కువ.
తద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఏఐ అడాప్షన్‌లో తేడాలు ఎక్కువగా ఉంటాయి. పారిశ్రామికీకరణ, అధిక పట్టణీకరణ అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో విద్యుత్ వినియోగం అధికం కాగా; ఈశాన్య రాష్ట్రాలు, తక్కువ పారిశ్రామికీకరణ చెందిన బిహార్, జార్ఖండ్‌లో విద్యుత్ వినియోగం తక్కువ. డిజిటల్ లిటరసీ గ్రామీణ ప్రాంతాలలో 25 శాతం కాగా, పట్టణ ప్రాంతాలలో 61 శాతం. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్‌లను సొంతంగా కలిగి ఉండటం కూడా ఏఐ సాంకేతికత వినియోగానికి తప్పనిసరి.
కృత్రిమ మేధ వ్యాప్తి అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ అసమానతలను తొలగించి సమానత్వ సాధనకు దోహదపడగలదు. అందుకే డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ నైపుణ్యం కల్గిన శ్రామిక శక్తిపై పెట్టుబడులు పెంచాలి. ఏఐ సాంకేతికతను మానవ శ్రేయస్సు పెంపొందించుకొనే విధంగా రూపొందించుకోవాలి. దానికోసం సమాజంలో విస్మరణకు గురైన వర్గాల ప్రజలకు ‘రీ–ట్రైనింగ్’ అందించే సామాజిక భద్రతా పథకాలు అవసరం.
డా‘‘ తమ్మా కోటిరెడ్డి
వ్యాసకర్త వైస్ ఛాన్స్‌లర్ (ఇంచార్జ్), ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్