ఇన్‌ బ్రెయిన్‌ | Laina Emmanuel, Rimjhim Agrawal Making a Google Map of the brain | Sakshi
Sakshi News home page

ఇన్‌ బ్రెయిన్‌

Oct 12 2025 6:43 AM | Updated on Oct 12 2025 6:43 AM

Laina Emmanuel, Rimjhim Agrawal Making a Google Map of the brain

టెక్నో ఉమెన్‌

మెదడు పనితీరుపై విశ్లేషణ, కార్యాచరణ సమాచారాన్ని అందించే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి, మానసిక వైద్యులకు ఆధునాతన బ్రెయిన్‌ ఇమేజింగ్‌–బేస్డ్‌ ఇన్‌సైట్స్‌ను అందించే న్యూరో–ఇన్‌ఫార్మటిక్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘బ్రెయిన్‌ సైట్‌ ఏఐ’ నిర్మించారు రింఝిమ్‌ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్‌...

గత సంవత్సరం ఇండియా సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్ట్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడిఎస్‌సీవో) నుంచి ‘సాఫ్ట్‌వేర్‌–యాజ్‌–ఎ మెడికల్‌ డివైజ్‌’ సర్టిఫికెట్‌ పొందడం ద్వారా ‘బ్రెయిన్‌సైట్‌ ఏఐ’ వాణిజ్యపరంగా కీలకమైన మైలురాయిని చేరింది. ఈ సంస్థకు ఇమ్మాన్యుయేల్‌ సీయివో,  రింఝిమ్‌ అగర్వాల్‌ సీటీవో.

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ నుంచి రింజిమ్‌ అగర్వాల్‌ పీహెచ్‌డీ చేసింది. ఇమ్మాన్యుయల్‌ ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నుంచి ఎంబీఏ చేసింది. హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ అండ్‌ పాలసీలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించింది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ డిజైన్, పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ బిజినెస్‌లో ఆమెకు అపార అనుభవం ఉంది.

‘సీడిఎస్‌సీవో లైసెన్స్‌ మాకు వాణిజ్యపరంగా ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం మా ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాం. మా ప్రాడక్స్‌›్ట వంద ఆస్పత్రులకు చేరువ కావాలనేది మా లక్ష్యం’ అంటుంది ఇమ్మాన్యుయేల్‌.

‘ఆసుపత్రులలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వైద్యులలో న్యూరోసర్జన్లు ఒకరు. మా సాంకేతికత మెదడుకు సంబంధించిన నిర్మాణాత్మక అంశాలకు మాత్రమే కాకుండా లాంగ్వేజ్, కాగ్నిషన్‌లాంటి వివిధ విధులపై కూడా ఇన్‌సైట్స్‌ను అందించగలదు. మా బ్రెయిన్‌సైట్‌ ఏఐ సామర్థ్యం సర్జన్‌లలో ఆసక్తి రేకెత్తించింది’ అంటుంది అగర్వాల్‌.

‘బ్రెయిన్‌సైట్‌ ఏఐ’ అందించే సమాచారం సర్జరీల సమయంలో వైద్యులకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక కణితి... దేహంలో ఏదైనా కీలక విధులు నిర్వహించే ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటే, వైద్యులు దానిని చేరుకోవడానికి వేరే ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడానికి వీలవుతుంది.

బ్రెయిన్‌ ఏఐ ప్రాడక్ట్‌ ‘వోక్సెల్‌బాక్స్‌’ వేగంగా అభివృద్ధి చెందనుంది. మెదడుకు సంబంధించిన నాడీ కణాల కనెక్షన్‌లను మ్యాప్‌ చేయడానికి ‘ఫంక్షనల్‌ మాగ్నెటిక్‌ రెసోసెన్స్‌ ఇమేజింగ్‌’ (ఎఫ్‌ఎంఆర్‌ఐ) ఉపయోగ పడుతుంది. ఆ డేటాను ప్రాసెస్‌ చేసేందుకు ఉపయోగపడేదే ఏఐ–పవర్డ్‌ ప్రాడక్ట్‌ వోక్సెల్‌బాక్స్‌. రోగ నిర్ధారణ, శస్త్ర చికిత్సలను ప్లాన్‌ చేయడంలోనూ, చికిత్సను పర్యవేక్షించడంలో సహాయపడేందుకు వీలైన బ్రెయిన్‌ మ్యాప్స్‌ను తయారు చేయడంలో ‘వోక్సెల్‌ బాక్స్‌’ ఉపయోగపడుతుంది.

హెల్త్‌–టెక్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించిన రింఝిమ్‌ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్‌ ‘స్నోడ్రాప్‌’ అనే పేషెంట్‌ కేర్‌ యాప్‌ను కూడా అభివృద్ధి చేశారు. పేషెంట్ల ప్రొఫైల్స్‌ రూపొందించడంలో, వైద్యప్రకియను మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement