
సత్వర చర్యలు అవసరం
లేదంటే ఉపాధిపై ప్రభావం
నీతి ఆయోగ్ నివేదిక
న్యూఢిల్లీ: భారత్‌లోని 245 బిలియన్ డాలర్ల విలువైన టెక్నాలజీ, కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ (అనుభవం) రంగాల్లో ఉద్యోగాల స్వరూపాన్ని కృత్రిమ మేథ (ఏఐ) సమూలంగా మార్చనుందని.. సత్వర చర్యలు అవసరమని నీతి ఆయోగ్ పేర్కొంది. లేదంటే క్వాలిటీ అష్యూరెన్స్ (నాణ్యతకు హామీనిచ్చే) ఇంజనీర్లు, సపోర్ట్ ఏజెంట్ల ఉద్యోగాలు వేగంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుందని నీతి ఆయోగ్ హెచ్చరించింది. ‘ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పన’ పేరుతో నివేదికను విడుదల చేసింది. 2031 నాటికి టెక్నాలజీ సేవల రంగంలో ఉపాధి సమూల మార్పులకు నోచుకోనున్నట్టు పేర్కొంది. అదే సమయంలో వచ్చే ఐదేళ్ల కాలంలో 40 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు సైతం ఏఐ అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపింది.
నైపుణ్య కల్పన, ఆవిష్కరణలతో.. ఏఐ ఉద్యోగాలైన ఎథికల్ ఏఐ స్పెషలిస్టులు, ఏఐ ట్రెయినర్లు, అనలిస్టులు, ఏఐ డెవ్‌ఆప్స్ (డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషన్స్) ఇంజనీర్లకు భారత్ ప్రపంచ కేంద్రంగా అవతరించొచ్చని అభిప్రాయపడింది. ఏఐ కారణంగా ఏర్పడే అంతరాయాలను అవకాశాలుగా మలుచుకునేందుకు.. జాతీయ స్థాయిలో ఏఐ నైపుణ్య కార్యక్రమాన్ని ప్రారంభించాలని నీతి ఆయోగ్ సూచించింది. పాఠశాలలు, యూనివర్సిటీల్లో ఏఐ నైపుణ్యాలపై అవగాహన కల్పించడం, వొకేషనల్ కార్యక్రమాలు, జాతీయ స్థాయిలో నైపుణ్యాల కల్పన, పెంపునకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. విద్యా రంగం, ప్రభుత్వం, పరిశ్రమ మధ్య భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని మందుకు నడిపించాలని కోరింది.
విశ్వాసంతో కూడిన పన్ను వ్యవస్థ..
నిబంధనలను స్వచ్ఛందంగా పాటించడం, పారదర్శకత, విశ్వసనీయమైన పాలనతో ఆధునిక పన్ను నిర్మాణం ఉండాలని నీతి ఆయోగ్ సూచించింది. దీనిపై చర్చా పత్రాన్ని విడుదల చేసింది. ఆధునిక, ఊహించతగిన (సులభతర), పౌరుల కేంద్రంగా పన్ను వ్యవస్థ అన్నది ఎంతో అవసమరని, ఇది సులభతర వ్యాపార నిర్వహణను, జీవనానికి వీలు కల్పిస్తుందని పేర్కొంది. నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులను గౌరవించే విధంగా ఉండాలని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాకారానికి అనుగుణంగా ఉండాలని సూచించింది.