
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. ఈ రంగంలో ప్రతిభ ఉన్నవారిని అవకాశాలు తప్పకుండా వెతుక్కుంటూ వస్తాయని ఎంతోమంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఆ మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. కృత్రిమ మేధలో ట్యాలెంట్ ఉన్న ఓ కంపెనీ ఉద్యోగులకు.. దిగ్గజ సంస్థలు వేలకోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చాయి. కానీ వారు మాత్రం తమ బాస్‌ను వదిలిపెట్టకుండా.. ఆఫర్లను తృణప్రాయంగా భావించారు.
మీరా మురాటీ 2025 ఫిబ్రవరిలో ఏఐ స్టార్టప్ 'థింకింగ్ మెషీన్స్ ల్యాబ్' ప్రారంభించారు. ఇందులో పనిచేస్తున్నవారందరూ కూడా గతంలో పెద్ద కంపెనీలలో పనిచేసి వచ్చినవారే. అయితే వీరిలో కొందరికి.. 'మార్క్ జుకర్‌బర్గ్'కు చెందిన మెటా.. దాని AI సూపర్ ఇంటెలిజెన్స్ బృందంలో చేరడానికి ఒక బిలియన్ డాలర్లను (రూ.8,755 కోట్లు) ఆఫర్ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
నిజానికి మీరా మురాటీ తన థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ ప్రారంభించి.. ఏడాది కూడా పూర్తి కాలేదు. అంతే కాకుండా ఈ కంపెనీ ఒక్క ఉత్పత్తిని కూడా మార్కెట్లోకి విడుదల చేయలేదు. కానీ అప్పుడే ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీ ఆఫర్స్ వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఏఐలో నైపుణ్యం ఉన్నవారికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?: రాబర్ట్ కియోసాకి
థింకింగ్ మెషీన్స్ ల్యాబ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం.. వారికి వచ్చిన ఆఫర్స్ వద్దనుకుని మీరా మురాటితో పాటు ఉండటానికే ఆసక్తి చూపించినట్లు సమాచారం. దీనికి కారణం మురాటీ నాయకత్వం.. భవిష్యత్ అంచనాలు కారణమై ఉంటాయని పలువురు భావిస్తున్నారు. కాగా ఈ కంపెనీ మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లు.
ఎవరీ మీరా మురాటీ?
ఇంజినీరింగ్ చేసిన మీరా మురాటీ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ‘టెస్లా’లో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ తరువాత వర్చువల్ రియాలిటీ స్టార్టప్ ‘లిప్ మోషన్’లో పనిచేసి.. 2016లో ‘ఓపెన్ ఏఐ’లో చేరి అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్స్, టూల్స్ డెవలప్‌మెంట్‌లో కీలక పాత్ర పోషిస్తూ.. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్(సీటీవో) స్థాయికి ఎదిగారు. సొంతంగా కంపెనీ స్థాపించాలనే తపనతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్‌ఏఐ’కి గుడ్‌బై చెప్పి.. థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ స్థాపించారు.
అల్బేనియాలో పుట్టిన మీరా మురాటీకి చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాలపై అమితమైన ఆసక్తి. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సాంకేతిక జ్ఞానం పరిష్కారం చూపుతుందనేది ఆమె నమ్మకం. అదే ఈ రోజు ఎన్నో గొప్ప కంపెనీలను సైతం ఆకర్శించేలా చేసింది.