
కృత్రిమ మేధ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ హైడ్రోజన్, డిజిటల్ ఇండియా వంటి వాటి గురించి తరచూ మన రాజకీయ నాయకులూ, ప్రభుత్వ పెద్దలూ ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఆ యా టెక్నాలజీలను భారత్ ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో వెనుకబడే ఉందన్నది గమనించాలి.
అలా అని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అర్థం కాదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏఐ మిషన్ కోసం పదివేల కోట్లనూ, జాతీయ క్వాంటమ్ మిషన్ కోసం ఆరు వేల కోట్లనూ కేటాయించింది. మౌలిక సదుపాయాలకు, డేటా వేదికల రూపకల్పనకు, నైపుణ్య శిక్షణా తరగతుల నిర్వహణకు, ఇతర సాధనాలను అందుబాటులోకి తేవటానికి సన్నాహాలు చేస్తోంది. అయితే కేవలం అధు నాతన టెక్నాలజీలను సమాజానికి పరిచయం చేయటం, పైపై మెరుగుల కోసం, అవసరాల కోసం వీటిని వాడుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఆధునిక సాంకేతికతలను ఉప యోగించి సామాన్య మానవుని జీవనాన్ని సులభతరం చేయడంతో పాటు, అనేక రంగాల్లో సమూల మార్పులు చేసినప్పుడు మాత్రమే ఈ సాంకేతికతలను సరిగా ఉపయోగించుకున్నట్లు లెక్క. ఎన్నికల అవకతవకలపై ఎన్నో ఆరోపణలూ, విమర్శలూ వినిపిస్తున్నాయి. వీటికి తావు లేకుండా చేయాలంటే ప్రతి ఓటునూ ఆధార్ కార్డ్‌తో అనుసంధానం చెయ్యడమే కాక, ఫేక్ ఓటర్లను గుర్తు పట్టడానికి డీప్ టెక్‌ను వినియోగించుకోవాలి. అపుడు అత్యంత పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించవచ్చు.
అమెరికా, చైనా వంటి దేశాలు తమ వ్యవస్థలను కృత్రిమ మేధ వినియోగించి పునః రూపకల్పన చేస్తున్నాయి. విద్య, వైద్యం, వ్యవ సాయం, భద్రతా రంగాలను కృత్రిమ మేధతో అనుసంధానం చేస్తు న్నాయి. స్మార్ట్ నగరాల రూపకల్పన, డిజిటల్ పరిపాలన, వ్యవ సాయ ప్రణాళికలు, సామాజిక మౌలిక వసతులు వంటి రంగాలకు చైనా కృత్రిమ మేధను అనుసంధానం చేస్తోంది. కేవలం ఏఐ ఆధా రిత ఉపకరణాలను వినియోగించుకుంటూ వివిధ వ్యవస్థల పని తీరును సమూలంగా పునర్నిర్వచిస్తున్నాయి.
మనదేశంలో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్‌వంటి ఆధునిక అంశాలను పాఠ్యాంశాలుగా విద్యార్థుల నెత్తిమీద రుద్దుతున్నారు తప్ప, ప్రతి విద్యార్థికీ తాను కోరుకున్నట్టు చదువుకోవడానికి కావలసిన స్వీయ అభ్యాసనా వాతావరణాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చెయ్యడం లేదు. ఏఐ ఉపకరణాలు ఉపయోగించి ప్రతి విద్యార్థి పురోగతినీ అంచనా వేసి, వారి స్వీయ అభ్యసనా సామర్థ్యాలకు అనుగుణంగా బోధనా పద్ధతులను మార్పు చేయవచ్చు.
అదే విధంగా వ్యవసాయంలో రైతులకు, స్వర/వాక్ ఆధారిత ఏఐ ద్వారా, ఆ యా ప్రాంతాలకు అనుకూలమైన వ్యవసాయ పద్ధ తుల గురించి, పంటల గురించి సలహాలను అందించవచ్చు. గిట్టుబాటు ధరలు, మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ రుణాలు వంటి వాటి గురించి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ రైతులు నష్టపోకుండా చూడవచ్చు.
మన దగ్గర అనితర సాధ్యమైన మేధా సంపత్తి ఉంది. కానీ ఆ మేధను కృత్రిమ మేధ, డీప్‌టెక్ తదితర రంగాల వైపు మళ్ళించి దేశీయ వ్యవస్థలను పునః రూపకల్పన చెయ్యటానికి పటిష్ఠమైన ప్రణాళికలు రచించడం లేదు. ఈ పని జరిగినప్పుడే ఆధునిక టెక్నా లజీ దన్నుతో దేశం అభివృద్ధి పథంలోకి దూసుకుపోగలదు.
మన దగ్గర అనితర సాధ్యమైన మేధా సంపత్తి ఉంది. ఆ మేధను కృత్రిమ మేధవైపు మళ్లించి వ్యవస్థలను పునఃరూపకల్పన చెయ్యటానికి ప్రణాళికలను రచించినపుడు టెక్నాలజీ దన్నుతో దేశం అభివృద్ధి చెందుతుంది.
– శ్రీవిద్య శ్రీనివాస్, కృత్రిమ మేధ నిపుణులు