
ఒక నిశ్శబ్ద విప్లవం చాప కింద నీరులా వస్తోంది. అది యుద్ధ భేరీలు మోగించదు. విజయ పతాకాలు ఎగరేయదు. కంటికి కనిపించని, ఊహకు అందని ఉప్పెనలా ఖండాలను ముంచెత్తుతూ వస్తోంది. విధ్వంసం దానికి కొలమానం కాదు. అది సకల సాంకేతికతల మహా కలయిక! ఆలోచనా పరులు, కార్యశీలురు ఆ ‘వరల్డ్ 2.0’కి ఊపిరులూదుతున్నారు.
కొత్త ప్రపంచ సమతుల్యత
కోవిడ్ విలయంలో దెబ్బతిన్న ప్రపంచ వాణిజ్య వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రపంచ దేశాల మధ్య కొరవడిన వాణిజ్య సమతుల్యతను తిరిగి తెచ్చే ఈ ప్రయత్నా లకు పరస్పర అవసరాలే చోదక శక్తి. డాలరు బలహీన పడటం ప్రపంచం కోలుకుంటోందనడానికి గట్టి సంకేతం. అంతర్జాతీయ వాణిజ్యం మీద అతిగా ఆధారపడకుండా డాలరును బలహీన పరచడం మంచిదే. ఈ పరిణామం వల్ల సరుకుల వాణిజ్యంలో స్థిరత్వం, అంతర్జాతీయ వడ్డీరేట్లలో సారూప్యత నెలకొంటాయి.
సాంకేతికతల మీద మార్కెట్ల విశ్వాసం ఆ యా కంపెనీల విలువల్లో ప్రతిబింబిస్తోంది. ఎన్‌విడియా మార్కెట్ విలువ 4 లక్షల కోట్ల డాలర్లకు చేరువైంది. దీన్ని ఆ కంపెనీ వ్యక్తిగత విజయంగా చూడకూడదు. ఏఐ ఆధారిత నూతన వ్యవస్థ వేరూనుకుంటోందనడానికి నిదర్శనం. అమెజాన్, యాపిల్, ఇంకా ఇతర కంపెనీల వృద్ధి వాటికి మాత్రమే పరిమితం కాదు. ఒక బృహత్ పరిణామంలో భాగంగా ఈ మార్పును గుర్తించాలి.
సాంకేతికతల మహా కలయిక
టెక్నాలజీల ముందడుగు కీలక ఘట్టానికి చేరింది. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయో టెక్నాలజీ, అటానమస్ సిస్టమ్స్... ఇవేవీ ఇకమీదట వేటికవి కావు. అన్నీ కలసిపోయి ఒకే ఒక్కటిగా ఆవిర్భ విస్తున్నాయి. ఈ మహా కలయిక మానవ పురోభివృద్ధికి స్వయంచోదిత ఇంజిన్ కాబోతుంది. ఇది నూతన ఆవిష్కరణలను వేగవంతం చేస్తుంది. వ్యయాలను తగ్గిస్తుంది. అందుబాటులో ఉంటుంది.
ఆరోగ్య విప్లవం మరింత ప్రముఖంగా ఉంటుంది. నూతన ఔషధాలను విజయవంతంగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడానికి ఇప్పుడు దశాబ్దాలు పడుతుండగా, ఇకపై నెలల్లోనే డ్రగ్ డిస్కవరీ జరుగుతుంది. డయాగ్నస్టిక్స్ లో ఏఐ ప్రవేశించి వ్యాధులను తొట్ట తొలి దశలోనో ఇంకా ముందుగానో నిర్ధారించడం సాధ్యపడుతుంది. 24 గంటలూ దేహాన్ని అంటిపెట్టుకుని ఉంటూ మన ఆరోగ్య మార్పుల్ని నిరంతరం పర్యవేక్షించే పరికరాలు వస్తున్నాయి. వ్యాధి నిర్మూలన నుంచి వ్యాధి నివారణ యుగంలోకి అడుగు పెడు తున్నాము. దీర్ఘాయుష్షు ఇంకెంతో కాలం కొంతమందికే సొంతం కాదు. అది అందరికీ అందించాల్సిన ప్రభుత్వ లక్ష్యం అవుతుంది.
రూపురేఖలు మారుతున్న విద్యా రంగం
చదువును డిగ్రీలతో కొలిచే రోజులు పోతున్నాయి. పట్టాలకంటే ప్రాసంగికతే ప్రధానం అవుతుంది. వ్యక్తిగత ప్రధానమైన, నైపుణ్యాల ఆధారితమైన విధానం దాన్ని ఆక్రమిస్తుంది. ఏఐ ట్యూటర్లు, వర్చువల్ క్లాస్ రూములు, డిజిటల్ ల్యాబ్‌లు వచ్చాయి. చదువుకు పట్టే సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ విద్యా విప్లవం ‘వరల్డ్ 2.0’కు పునాది అవుతుంది.
వ్యర్థాల సద్వినియోగం
ఇప్పుడు వ్యర్థాలను ముడిసరుకుగా వాడుతున్నారు. కర్బన కాలుష్య వాయువులను పీల్చుకుని నిల్వ చేసే ఇటుకల తయారీ, నాచు ఆధారిత ప్యాకేజింగ్ మెటీరియల్ ఉత్పత్తి, మునిసిపల్ మురుగును, పంటల వ్యర్థాలను హైడ్రోజన్‌గా మార్చి దాంతో విమాన ఇంధనం తయారీ... ఇలా ఎన్నో టెక్నాలజీలు అభివృద్ధి అయ్యాయి. చెత్త కూడా సంపదగా మారింది. ఈ మార్పులోప్రపంచ శాంతి బీజాలు ఉన్నాయి.
సంపదతోనే ప్రపంచ భద్రత
సంపదతోనే శాంతి అనేది కొత్త మంత్రం కాబోతోంది. డేటా, ఇంధనం, స్వచ్ఛమైన గాలి, వైద్యం, అవకాశాలు... ఇవి అన్ని దేశా లకూ అందుబాటులో ఉండేట్లయితే ఇక దేనికోసం పోరాడాలి? భౌతిక ఆధిపత్యం స్థానే డిజిటల్ సార్వభౌమత్వం రాజ్యమేలే రోజుల్లో, ప్రాదేశిక ఆక్రమణ ఆర్థిక పరంగా అవివేకం అవుతుంది.ఆధార్, యూపీఐ, డిజీ లాకర్, ఓఎన్‌డీసీ లాంటివాటితో కూడిన ఇండియా డీపీఐ (డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) నమూనా సమ్మిళిత విధానాలు భద్రతకు ఎలా బాటలు వేయగలవో రుజువు చేస్తున్నాయి. ప్రపంచం ఈ నిశ్శబ్ద పరివర్తనను గమనిస్తోంది.
వరల్డ్ 2.0 తాత్విక చింతన
సమృద్ధి పెరిగే కొద్దీ హింస క్షీణిస్తుంది. పరమార్థం తెలుసు కోవడం మీద ప్రజలు తిరిగి దృష్టి పెడతారు. పనిలో ప్రయోజనం, రాజకీయాల్లో నిజాయతీ, ఆవిష్కరణల్లో నైతికత, సంస్థల్లో పారదర్శ కత ఉండాలని డిమాండ్ చేస్తారు. వారి దృక్పథం మరింతగా అంత ర్జాతీయతను సంతరించుకుంటుంది. వారి కార్యకలాపాలు సరిహ ద్దులను అధిగమిస్తాయి. అమెజాన్ రెయిన్ ఫారెస్టుల నుంచి ఆర్కి టిక్ మంచు నదుల వరకు అన్ని ప్రాంతాల గురించీ ఆలోచిస్తారు. సైన్సును స్పిరిట్‌తో, టెక్నాలజీని హ్యుమానిటీతో అనుసంధానిస్తారు.
శాంతి సాధన కోసం ఆపరేటింగ్ సిస్టం
వరల్డ్ 2.0 ఆవిర్భవిస్తున్న తరుణంలో దాన్ని దాని మానానికి వదిలేయకూడదు. సుస్థిర శాంతి కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ను డిజైన్ చేసుకోవాలి. పర్యావరణ సాంకేతికత, వ్యవసాయ సాంకేతి కత, విద్యా సాంకేతికత, వైద్య సాంకేతికతలు అన్నీ పరస్పరం సహ కరించుకునేలా టెక్నాలజీ కన్వర్జ¯Œ ్స ప్లాట్‌ఫారాలు రూపొందించు కోవాలి. ఏఐ నైతిక విలువలకు, అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఉండే డిజిటల్ పబ్లిక్ గూడ్స్ తయారు చేసుకోవాలి.
అయితే ఈ వరల్డ్ 2.0 ఎలాంటి ఒప్పందం కోసం నిరీక్షించడం లేదు. లక్షల కోట్ల ఎంపికలు, వందల కోట్ల చర్యలు, లక్షల ఆవిష్కర ణల ద్వారా అది ఆవిర్భవిస్తోంది. ఓ కొత్త యుగం కళ్లు తెరుస్తోంది. అక్కడ శాంతి అంటే ఏమిటి? శ్రేయస్సు, సమ్మిళితం, అవకాశం, ఉమ్మడి సారథ్యం ఇవన్నీ నెలకొని ఉండటమే! అంతే కానీ, యుద్ధం లేకపోవడం మాత్రమే శాంతి కాదు. వరల్డ్ 2.0 ఇప్పుడు మనముందుంది. దాన్ని స్వాగతిద్దాం.
-వ్యాసకర్త కార్పొరేట్ నిపుణుడు, రచయిత(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)
- శైలేష్ హరిభక్తి