
కశ్మీర్‌లో మళ్ళీ హింసాయుత సంఘట నలు పెచ్చుమీరడం చూశాక, రణ తంత్రంలో టెక్నాలజీ, ముఖ్యంగా జనరే టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (జెన్ ఏఐ) పాత్ర గురించిన ప్రశ్నలు నా మెదడును తొలవడం ప్రారంభించాయి. మీరు బత కండి, ఇతరులను బతకనివ్వండి అనే తాత్త్వికత భారతదేశానికి పునాది. అంత మాత్రాన దురాక్రమణను చూస్తూ ఊరు కుంటామని కాదు.
ఫినాన్షియల్ సర్వీసులు, ఏరోస్పేస్, సెమీకండక్టర్లు, వస్తూత్పత్తి వంటి కీలకమైన పరిశ్రమల్లో ఏఐని బాధ్యతాయుతంగా వర్తింపజేసే పనిలో ఉన్న వ్యక్తిగా, మేం అభివృద్ధి చేసే సాధనాలకున్న కలవర పరచే ద్వంద్వ వినియోగ సామర్థ్యం గురించి నాకు బాగా తెలుసు. సామర్థ్యానికి, నవీకరణకు చోదక శక్తిగా పనిచేసే అదే టెక్నాలజీ హానికరమైన ఆయుధంగానూ పరిణమించవచ్చు. మనం కీలకమైన ఘట్టంలో ఉన్నాం. జెన్ ఏఐ సాంకేతిక పురోగతిగా చెప్పుకొనే స్థాయి నుంచి చాలా వేగంగా ప్రగాఢమైన భౌగోళిక రాజకీయ సాధనంగా మారుతోంది.
ఏ గూటి ఏఐ...
అధునాతన జెన్ ఏఐ సామర్థ్యాలను సంతరించుకున్న దేశా లకూ, విదేశాలలో అభివృద్ధి చెందిన సిస్టంలపై ఆధారపడిన దేశా లకూ మధ్యన కొట్టొచ్చినట్లు కనిపించే చీలిక వ్యూహపరంగా తీవ్ర మైన రిస్కులను రేకెత్తిస్తోంది. ఏఐని అభివృద్ధి చేస్తున్న ప్రధాన దేశాలు, ముఖ్యంగా అమెరికా, చైనాల ప్రయోజనాలు, పక్షపాతా లతో రూపుదిద్దుకున్న మోడళ్ళు అనివార్యంగా వాటిని సృష్టించిన వారి కథనాలనే వ్యాప్తి చేస్తాయి. అవి తరచూ ప్రపంచ నిష్పాక్షికతను నీరుగారుస్తాయి.
ఓపెన్ ఏఐకి చెందిన జీపీటీ సిరీస్ లేదా చైనాకు చెందిన డీప్ సీక్ వంటి ఏఐ మోడళ్ళలో అంతర్లీనంగా నిక్షిప్తమైన పక్షపాతాలనే పరిశీలించండి. అవి చాలా శక్తిమంతంగా భౌగోళిక రాజకీయ అభి ప్రాయాలను ప్రతిబింబిస్తాయి. ఈ మోడళ్ళు వాటి మాతృదేశాలపై వచ్చే విమర్శలను తగ్గిస్తాయి. దానితో ఆగక పక్షపాతాల వల్ల అంత ర్జాతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతాయి.
ఉదాహరణకు, చైనా ఏఐ దృక్పథం దాని జాతీయ విధాన వైఖరులను బలంగా చాటు తుంది. సరిహద్దు వివాదాలలో చైనా వైపునే న్యాయం ఉన్నట్లు చెప్పే స్తుంది. సార్వభౌమాధికారం ఉన్న సంస్థలను కూడా చట్ట బద్ధమైనవి కావని తోసిపారేస్తుంది. ఫలితంగా, అస్తుబిస్తుగా ఉన్న దౌత్యసంబంధాలు మరింత జటిలంగా మారతాయి. కశ్మీర్ వంటి సున్నిత మైన ప్రాంతాల్లో ఇది ఇంకా ఎక్కువ ప్రస్ఫుటమవుతుంది.
సుస్థిరత కోసం డిజిటల్ పోటీ
గతంలో పరస్పరం విధ్వంసాన్ని చవిచూడటం ఆ యా దేశాల వద్దనున్న అణ్వాయుధాలపై ఆధారపడి ఉండేది. నేటి ఆయుధాల పోటీలో ‘డిజిటల్’ ఆ స్థానాన్ని ఆక్రమించింది. అంతర్జాతీయ సుస్థిర తకు కొత్త రూపునిచ్చే సామర్థ్యంలో ఏఐ అణ్వాయుధాలతో సమా నంగా ప్రాధాన్యం ఉన్నదే. కాలం చెల్లిన ఈ చట్రాన్ని మనం అత్య వసరంగా పునః పరిశీలించవలసి ఉంది. డిజిటైజేషన్ ద్వారా పర స్పరం పురోగతి సాధించే కొత్త విధానానికి మళ్ళాలని నేను చెప్ప దలచుకున్నాను. ఈ నమూనా విధ్వంసకర పోటీ నుంచి నలుగురితో కలసి అభివృద్ధిని, సాంకేతిక స్వావలంబనను సాధించేందుకు ప్రాధాన్యం ఇచ్చేట్లు చేస్తుంది.
ఈ కొత్త నమూనాను అనుసరించేందుకు దేశాలు, ముఖ్యంగా టెక్నాలజీపరంగా దుర్బలంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు స్వతంత్రమైనవి, సాంస్కృతిక పరిజ్ఞానం ఉన్నవి అయిన ఏఐదొంతరలను ఏర్పరచుకోవలసి ఉంటుంది. అటువంటి స్వయం ప్రతిపత్తి మాత్రమే స్థానిక చరిత్రలను, సంస్కృతులను, రాజకీయ పరమైన సూక్ష్మ భేదాలను ప్రతిబింబించగలుగుతుంది. అప్పుడే ఈ దేశాలు బాహ్యపరమైన మాయోపాయాలకు లోనుకాకుండా నిల బడగలుగుతాయి. సాంస్కృతిక వివరాలను పుష్కలంగా నిక్షిప్త పరచుకున్న ఏఐ, దుష్ప్రచారం నుంచి తమ దేశాన్ని కాపాడుకోవ డమే కాదు సిసలైన అంతర్జాతీయ చర్చలను పెంపొందించ గలుగు తుంది. సమతూకంతో కూడిన బహుళపక్ష ఏఐ ల్యాండ్‌స్కేప్ ఏర్ప డేందుకు తోడ్పడగలుగుతుంది.
ప్రపంచంలో ప్రాబల్యం వహిస్తున్న ఏఐ మోడళ్ళు ప్రాథమికంగా ఇంగ్లీషు, చైనా భాషల్లో రూపొందినవి. అవి 22 అధికార భాషలు, వందలాది మాండలికాలతో కూడిన, భాషాపరంగా,సాంస్కృతికంగా బహుళత్వంతో నిండిన భారత్ వంటి వైవిధ్యభరి తమైన దేశాలను ప్రమాదకరమైన స్థితిలోకి నెడుతున్నాయి. భాషా పరంగా సూక్ష్మమైన భేదాలను పట్టుకోలేని ఏఐ అవగాహనా లోపా లను సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది. అవి దౌత్యపరంగా తీవ్ర మైన పర్యవసానాలకు దారితీయవచ్చు.
దీన్ని నివారించడానికిసాంస్కృతిక చైతన్యం కలిగిన అధునాతన ఏఐ మోడళ్ళను అభివృద్ధి చేయడం ఆవశ్యకం. మరాఠీ–గుజరాతీ లేదా తమిళం–కన్నడంవంటి సంబంధిత భాషలలో ఉన్న సారూప్యాలను బహుభాషా ఏఐ సిస్టంలు వినియోగించుకుని తీరాలి. అప్పుడు ఆ యా భాషల్లోఉండే గాఢతను, సూక్ష్మతరమైన భేదాలను విస్మరించకుండా వేగంగా ఆంతర్యాన్ని అందిపుచ్చుకోవడం సాధ్యమవుతుంది.
నిర్ణయాధికారం మనిషిదే కావాలి!
సామాజిక మౌలిక సదుపాయాలలోకి, నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియలలోకి జెన్ ఏఐ మమేకం అయితే అది మానవ పాత్రలకు తప్పకుండా కొత్తరూపునిస్తుంది. సమర్థత విషయంలో ఆటోమేషన్ బ్రహ్మాండమైన ఆశలు రేపుతున్న మాట నిజమేకానీ, యుద్ధ తంత్రం వంటి జీవన్మరణ సందర్భాలలోనూ నిర్ణయం తీసుకునే బాధ్యతను ఏఐ సిస్టంలకు అప్పగించేయడం ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఈ సందర్భంగా నాకు, ప్రచ్ఛన్న యుద్ధ కాలానికి సంబంధించి 1983 నాటి ఉదంతం ఒకటి గుర్తుకువస్తోంది. ఆనాటి సోవియట్ లెఫ్టినెంట్ కల్నల్ స్టానిస్లావ్ పెట్రోవ్ సాంకేతిక తార్కిక ప్రమాద హెచ్చరి కల కన్నా మానవ అంతఃకరణనే ఎక్కువ లెక్కలోకి తీసుకున్నారు. ఫలితంగా, ఒక అణు వినాశనాన్ని నివారించగలిగారు.
మనుషులు ఒక నిర్ణయం తీసుకునే లేదా ఆలోచించే పనిని ఇష్ట పూర్వకంగానే బీజగణితాలకు అప్పగించేస్తారేమోనని నన్నొక పెద్ద భయం వెన్నాడుతోంది. ఆ రకమైన భవిష్యత్తును మనం అంగీకరించకూడదు. మానవ విజ్ఞతకు ఏఐ ఉపయోగపడాలే కానీ, విజ్ఞత స్థానాన్ని అది ఆక్రమించకూడదని డిమాండ్ చేసే కర్తవ్యం, అలా జరగకుండా చూసే బాధ్యత నవీకరణవేత్తలుగా, టెక్నాలజిస్టులుగా, ప్రపంచ పౌరులుగా మనందరి మీదా ఉంది. మానవాళి విజ్ఞతను పక్కకు తోసేసే టెక్నాలజీని ఎన్నటికీ అనుమతించేది లేదని ఈ రోజే మనం ప్రతిన బూనుదాం.
-వ్యాసకర్త ఏఐ కంపెనీ ‘ఆర్టికల్8’ వ్యవస్థాపక సీఈఓ(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
-అరుణ్ సుబ్రమణియన్