ఫసిఫిక్ మహా సముద్రంలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తైవాన్‌ను రక్షించేందుకు తాము ఎటిపరిస్థితుల్లోనూ వెనుకాడబోమంటూ జపాన్ ప్రధాని సనే తకైచి చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి. ఈ వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా.. తైవాన్ చుట్టూ ‘జస్టిస్ మిషన్ 2025’ సైనిక విన్యాసాలను ప్రారంభించింది. దీంతో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.
మూడు ప్రధాన సముద్రాలు (తూర్పు చైనా, దక్షిణ చైనా, ఫిలిప్పీన్)తో కూడిన తైవాన్ జలసంధి మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో జరిగిన స్వోర్డ్ A, జాయింట్ స్వోర్డ్ B, స్ట్రైట్ థండర్ వంటి విన్యాసాల కంటే భారీ స్థాయిలో చైనా తాజా సైనిక విన్యాసాలు నిర్వహించడమే ఇందుకు కారణం. తైవాన్ కోస్ట్ గార్డ్ అడ్మినిస్ట్రేషన్ సమీప జలాల్లో చైనా కోస్ట్ గార్డ్ కార్యకలాపాలు పెరిగాయి. అదేవిధంగా.. తైవాన్ సమీపంలో చైనా కోస్ట్ గార్డ్ నౌక 1303 దృశ్యాన్ని విడుదల చేసింది. అయితే, చైనా కోస్ట్ గార్డ్ ఈ విన్యాసాల్లో తమ పాల్గొనడం గురించి అధికారికంగా ప్రకటించలేదు.
తైవాన్‌పై చైనా దాడులు చేస్తే జపాన్ సైన్యం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని.. జపాన్ ప్రధాని సనే తకైచి ఇటీవల పార్లమెంటులో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిచర్యగా చైనా తన సైనిక బలగాలను తైవాన్ చుట్టూ భారీగా మోహరించి యుద్ధ విన్యాసాలు చేస్తోందనేది స్పష్టమవుతోంది. తైవాన్ చుట్టూ ఉన్న ప్రధాన ఓడరేవులను దిగ్బంధించడం, బయటి దేశాల నుంచి సాయం అందకుండా అడ్డుకోవడం, క్షిపణి వ్యవస్థల పనితీరును పరీక్షించడం ప్రధాన టార్గెట్‌గా తెలుస్తోంది.
మరోవైపు తకైచి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజింగ్ వర్గాలు.. తమ అంతర్గత విషయాల్లో జపాన్ జోక్యం చేసుకుంటే బాగోదని హెచ్చరించింది. తక్షణమే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అల్టిమేటం జారీ చేసింది. అదే సమయంలో.. కౌంటర్‌గానే తైవాన్‌ను దిగ్బంధించేలా తన ఎయిర్‌ఫోర్స్, నేవీ బలగాలతో ‘జస్టిస్ మిషన్ 2025’లో చేపట్టినట్లు పరోక్ష ప్రకటన చేయడం గమనార్హం.


