
సందర్భం
‘నా దృక్పథం రాజకీయాల నుంచి కాక మత సంస్కృతి నుంచి అలవడింది.’’
– డా‘‘ బీఆర్ అంబేడ్కర్
హేతువుకు ప్రాధాన్య మిచ్చి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను ముందుకు తీసుకొచ్చిన బౌద్ధం ప్రాచీన భారతదేశంలోనే కాకుండా ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రాసంగి కతను కలిగివుంది. గౌతమబుద్ధుడు భారతదేశపు మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు. ఆయన తన కాలం నాటికి అమలులో ఉన్న సాంఘిక దుర్నీతినీ; మతం పేరున జరుగుతున్న హింసాకాండ, అమాన వీయతనూ ప్రశ్నించాడు. హేతువు పునాదిగా ప్రజా స్వామిక సంస్కృతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేశాడు.
బుద్ధుడు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దికి చెందిన వాడైనప్పటికీ ఆయన బోధించిన సమానత్వ భావన, హేతువాద దృక్పథం, ప్రజాస్వామికతత్త్వం ఈనాటికీ ఎంతో ప్రాసంగికతను సంతరించుకున్నాయి. ఆయన ముందుకు తీసుకువచ్చిన ‘అనాత్మవాదం’, ‘అని త్యత’, ‘ప్రతీత్య సముత్పాద’ వంటి భావనలు బౌద్ధాన్ని ఇతర మతాల కంటే భిన్నంగా నిలబెట్టా యనవచ్చు. ఈ భావనలు బౌద్ధాన్ని ఒక మతం అనే స్థాయి నుంచి గొప్ప ప్రాపంచిక దృక్పథాన్నిచ్చే తాత్విక స్థాయికి తీసుకెళ్ళాయనవచ్చు.
బుద్ధుడి బోధనలలో ముఖ్యమైన ‘అష్టాంగ మార్గం’ మనుషుల వ్యక్తిత్వ వికాసానికి దోహదంజేసే అత్యున్నత మార్గం. సమత, కరుణ, ప్రజ్ఞ, మైత్రి, శీలం అనేవి బుద్ధుని తాత్వికత లోని ప్రధాన అంశాలు. అలాగే బుద్ధుడు వైదిక మతంలో భాగం అని వాదించడం బుద్ధుణ్ణి బ్రాహ్మణ వాదంలో జీర్ణం చేసుకోవాలనే ప్రయత్నం చెయ్య డమే! అటువంటి ఆకాంక్షల ఫలితమే పురాణాల కాలానికి బుద్ధుడిని విష్ణుమూర్తి దశావతారాలలో ఒక అవతారంగా మార్చడమని తెలుస్తోంది.
విద్య, విజ్ఞానం, ఆధునిక భావాల పరంగా ఎంతో ముందంజ వేశామని భావిస్తున్న ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా మతమౌఢ్యం పెచ్చరిల్లిపోతోంది. బౌద్ధం రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాల పరంగా విస్తృతమైన పరిధి కలిగిన తత్త్వం కాబట్టి సమకాలీన సామాజిక, సాంస్కృతిక వైరుద్ధ్యా లకు బౌద్ధంలో పరిష్కారమార్గాలు వెదకవచ్చు.
పండిత అయోతీదాస్, ప్రొఫెసర్ లక్ష్మీ నరసు, డా‘‘ అంబేడ్కర్ బౌద్ధాన్ని సామాజిక విముక్తి సిద్ధాంతంగా ప్రతిపాదించారు. అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించడాన్ని హిందూమతంలో అంటరానివారనే దళితుల సామా జిక స్థాయిని తిరస్కరించడంగా భావించాడు.
ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా లౌకికవాదులు, హేతువాదులు, శాస్త్రవేత్తలు అయిన మేధావులు తాము బౌద్ధాభిమానులమని చెప్పుకోవడానికి గర్వి స్తున్నారు. ఎడ్విన్ ఆర్నాల్డ్ అన్నట్లు బుద్ధుడు ‘ఆసియా జ్యోతి’ మాత్రమే కాదు ఆయన బోధనల ప్రాసంగికత పెరిగేకొద్దీ బుద్ధుడు ‘ప్రపంచ జ్యోతి’గా పరిణామం చెందుతున్నాడు.
అయితే బుద్ధుడిని సమాజం కేవలం అహింసా మూర్తిగా, చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకున్న సన్యాసిగా, లేకపోతే శాకాహారిగా మాత్రమే అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది. బుద్ధుడు అహింసావాది అన్నమాట నిజమే... కానీ శాంతిని, న్యాయాన్ని స్థాపించడం కోసం యుద్ధం చెయ్యడంలో తప్పు లేదంటాడు. ఆయన కేవలం ధ్యానం మాత్రమే చెయ్యక ప్రాపంచిక విషయాలపై వివిధ వ్యక్తులతో చర్చించి సత్యాన్ని నిర్ధారించుకున్నాడు. చాలామంది భావించి నట్లు బుద్ధుడు శాకాహారి కాడు.
అలాగే ఆయన శాకాహారాన్ని కీర్తించలేదు. క్రతువులలో జంతు వధను ఖండించి, పండితుల భాషగా ఉన్న సంస్కృతం స్థానంలో ప్రజల భాష అయిన ‘పాళీ’ని ప్రతిపాదించి వైదిక సంస్కృతికి ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రవేశ పెట్టాడు. నిజానికి బౌద్ధం సంధించిన విమర్శల ఫలితంగానే తర్వాత కాలంలో హిందూమతం తనను తాను సంస్కరించుకుని అహింసనూ, శాకాహారాన్నీ ఆదర్శాలుగా స్వీకరించింది. బౌద్ధ భిక్షువులు సామా జిక కార్యకర్తల వలే బహుజన హితం, బహుజన సుఖం కోసం పనిచెయ్యాలని బుద్ధుడు సూచించాడు.
బౌద్ధసంఘంలో రాజుల నుంచి, బానిసల వరకు అందరికీ సమాన హోదాను కల్పించాడు. బౌద్ధసంఘంలో ‘ఉపాలి’ అనే మంగలి కులస్థుడు, ‘జీవకుడు’ అనే వేశ్యాపుత్రుడు, ‘ఆమ్రపాలి’ అనే వేశ్య, రాజవంశీకులైన ‘ప్రసేనజిత్’, రాకుమార్తె ‘విశాఖ’; భర్త, బిడ్డల చేత, సమాజం చేత నిర్లక్ష్యానికి గురైన స్త్రీలు... సమానమైన గుర్తింపును పొందారు. భిన్న సామాజిక వర్గాల మధ్య బుద్ధుడు సామరస్యాన్ని కుదిర్చాడు. ‘విధికుడు’ అనే చర్మకారుడు అమరావతి క్షేత్రానికి కానుకగా ఇచ్చిన పూర్ణకుంభం బౌద్ధంలోని సమతకు చిహ్నంగా మిగిలింది.
బౌద్ధంలో దేవుడి స్థానాన్ని నైతికత ఆక్రమిస్తుంది. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త గెయిల్ ఆంవెత్ బౌద్ధం అధికారిక మతంగా ఉన్న ప్రాచీన భారత సంస్కృతిని ‘బుద్ధిస్ట్ సివిలైజేషన్’గా పేర్కొన్నారు. ‘భారతీయ ఆత్మను కలిగి ఉన్న బౌద్ధాన్ని దేశం నుంచి వెళ్లగొట్టి భారతదేశం ఆత్మహత్య చేసుకుంద’ని గురజాడ అనడంలో అతిశయోక్తి లేదు. బౌద్ధం అనే గొడుగు కింద ప్రజల్లో సమైక్య భావన ఏర్పడే అవకాశం ఉంది.
ప్రొ‘‘ చల్లపల్లి స్వరూపరాణి
వ్యాసకర్త ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బుద్ధిస్ట్ స్టడీస్ శాఖలో సీనియర్ ప్రొఫెసర్
(నేడు బుద్ధ పూర్ణిమ)