వర్తమాన భారత సమాజాన్ని చాలామంది చాలా రకాలుగా వర్ణి స్తున్నారు. కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం (సీసీడీ) అనే భావన ఇప్పుడు క్రమంగా బలాన్ని పుంజుకుంటోంది. ఈ కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం తనకు అనుకూలమైన రాజకీయ విభాగానికి పార్లమెంటరీ ఆధిపత్యాన్ని కట్టబెట్టింది. అదే బీజేపీ నాయకత్వంలోని జాతీయ ప్రజా స్వామ్య కూటమి (ఎన్డీఏ).
ఈ వ్యవస్థ మారాలని అత్యధికులు ఆశిస్తుంటారు. వ్యవస్థను మార్చడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది – ఎన్డీఏను తప్పించడం. ఇది అన్నింటికన్నా ఆదర్శ పరి ష్కారం. అయితే, ఆచరణ అంత సులువు కాదు. చాలా కాలం పడుతుంది. సాధారణ ఉద్యమాలు, పోరాటాలు కూడ సరిపోకపోవచ్చు. తీవ్ర పోరాటాలు అవసరం కావచ్చు. తీవ్ర అనే మాటకు అర్థాన్ని ఎవరికి వారు ఎంత వరకైనా అన్వయించుకోవచ్చు.
లేత ఎరుపు నుండి ముదురు ఎరుపు వరకు, లేత నీలం నుండి ముదురు నీలం వరకు గడిచిన వందేళ్ళలో మన
దేశంలో సాగిన ఉద్యమాలన్నీ పౌర సమాజం మీద చాలా సానుకూల ప్రభావాన్ని వేశాయి. అయితే దాన్ని రాజకీయ ప్రయోజనంగా మార్చుకోవడంలో అవన్నీ ఘోరంగా విఫలం అయ్యాయి. అలనాడు గొప్పగా వెలిగిన పౌర సమాజాన్ని కూడ ఇప్పుడు సీసీడీ కలుషితం చేసేసింది. సమానత్వ, సహోదర, సామ్యవాద భావాల నుండి సమా జాన్ని తప్పించే పనిలో పడింది. దీనిని శుద్ధి కార్యక్రమం అని కూడ అంటున్నారు.
బహుళ పార్టీల పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మనకు ఇంకో పరిష్కారం ఉంది; ఐదేళ్ళకు ఒకసారి జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మనకు నచ్చని పార్టీనో, కూటమినో ఓడించడం. అది సాయుధ పోరాటాలు చేయాల్సినంత కష్టమైన పని కాదుగానీ, అంత ఈజీ కూడా కాదు. దాదాపు వందకోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉంటారు. వాళ్ళలో ఓ70 కోట్ల మంది పోలింగులో పాల్గొంటారు. వారిలో సగానికి పైగా, అంటే నలభై కోట్ల మందిని ప్రభావితం చేసేబృహత్తర పథకాన్ని రచించి కచ్చితంగా ఫలితాలనుసాధించే కార్యాచరణ ఒకటి ఉండాలి.
అయితే, ప్రజాస్వామ్యం పేదది కాదు; పేదోళ్ళదిఅంతకన్నా కాదు. రాజకీయ కళలో ప్రావీణ్యం సంపాదించిన కొద్దిమంది కలిసి నడిపే నియంతృత్వంగా ప్రజా స్వామ్యం కుంచించుకుపోయింది. ఇదో రాజకీయ పార డాక్సీ! ఈ వాస్తవాన్ని ముందు గుర్తించాలి. సమ్మతి ఉత్పత్తి అన్నమాట! ఉత్పత్తి అంటేనే పెట్టుబడి.
అయితే, సమాజం చాలామంది అనుకుంటున్నంతగా చెడిపోలేదు. సీసీడీ ప్రాయోజితంగా గెలిచినవాళ్ళు తమను తాము అప్రతిహత శక్తిగా చెప్పుకుంటున్నారుగానీ, ఓటర్లు వాళ్ళకు అంతగా మద్దతు పలకలేదు. 2014 నుండి 2024 వరకు జరిగిన మూడు లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పడిన ఓట్లు 31, 37.36, 36.56 శాతం మాత్రమే!
అంటే, 60 శాతానికి పైగా ఓటర్లు ఎన్డీఏ కూటమికి వ్యతి రేకంగా ఓటు వేస్తున్నారు. దీని అర్థం ఏమిటీ? ఎన్డీఏ కూటమి తన సొంత బలం మీద కాకుండా విపక్షాల అనైక్యత వల్ల మాత్రమే గెలుస్తున్నది.విపక్షాలు ఏకం అయితే ఎన్డీఏ కూటమిని ఓడించడం సులువు అని దీన్నిబట్టి అర్థమవుతుంది.
ఒక సీటు దగ్గర, ఒక పదం దగ్గర, అప్పుడప్పుడు ఒక అక్షరం దగ్గర కూడ తేడాలొస్తే భూమ్యాకాశాల్ని ఏకంచేస్తూ మన విపక్షాలు కొట్లాడుకుని విడిపోతుంటాయి. మరోవైపు, ఎన్డీఏ కూటమి ఏకశిలా సదృశంగా సమైక్యంగా ఉంటుంది. ఆ కూటమిలో, ఆరెస్సెస్ వంటి మెజారిటీ మతవాదులతోపాటు అథవాలే వంటి అంబేడ్కరిస్టులు, నితీశ్ కుమార్ వంటి సోషలిస్టులు కూడా ఉంటారు. అయినా, అందరూ ఒక్కటై ఉంటారు. అది వాళ్ళ విజయ రహస్యం.
విపక్షాలను ఏకం చేయాలనే ఆలోచన ఓ ఐదారేళ్ళుగా చక్కర్లు కొడుతోంది. కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘ఎద్దేలు కర్ణాటక’ (మేలుకో కర్ణాటక) అనే ఒక పౌరసంస్థ ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నడుం బిగించింది. ఆశించిన ఫలితాలను సాధించడానికి ఆధునిక టెక్నా లజీని కూడ వాడింది. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఓటింగ్ శాతం దాదాపు స్థిరంగా ఉన్నాసరే ఎన్నికల్లో ఓడి పోయింది. ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు ఓట్లు పెద్దగా పెరVýæకపోయినా (4–5 శాతం), సీట్లు మాత్రం భారీగా పెరిగి, అధికారాన్ని చేపట్టింది.
రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నచోటనే ‘ఎద్దేలు కర్ణాటక’ ప్రత్యేక దృష్టి పెట్టి సానుకూల ఫలితాలను సాధించింది. కానీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆ సంస్థ ప్రభావం కనిపించలేదు. మళ్ళీ బీజేపీ తన ఆధిక్యాన్ని చాటుకుంది. రాబోయే 2029 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ పౌరసంఘాలు కొన్ని ఈసారి కొంచెం ముందుగానే సన్నాహాలు మొదలెట్టాయి. ఇదొక సానుకూల సంకేతం. తొలి అడుగులో, వామపక్ష (మార్క్స్), సామాజిక న్యాయ (అంబేడ్కర్) ఆదర్శాలుగల రాజకీయ పార్టీల్ని ఏకం చేయాలనేది ఒక ప్రతిపాదన. ఇది సరిపోదు. సీసీడీ, ఎన్డీఏ కూటమి బాధిత సమూహాలు అనేకం ఉన్నాయి. ఒక్కొక్కరికీ ఒక్కో లక్ష్యం ఉంటుంది.
ఉదాహరణకు ముస్లింలు తదితర మైనారిటీలకు మత సామరస్యం ప్రధాన ఆదర్శం. అలాగే బీసీలు, ఆదివాసీలు, మహిళలు, కార్పొరేట్ ప్రాజెక్టుల నిర్వాసితులు. ఆధిపత్య కులాల్లోని పేదలు, ఉదారవాదులకు వారివైన ప్రత్యేక లక్ష్యాలు ఉంటాయి. ఇలా విభిన్న లక్ష్యాలున్న సమూహా లన్నింటినీ మినహాయింపు లేకుండా ఏకం చేయాలి. లోక్ సభ ఎన్నికల్లో ఎవర్ని ఓడించాలో మనకు స్పష్టంగానే తెలుసు. ఎవర్ని బలపరిస్తే ఈ లక్ష్యాన్ని సాధించగలమనే దాని మీదనే ఇప్పుడు మేధామథనం సాగాలి.
-వ్యాసకర్త సమాజ విశ్లేషకులు
-డానీ


