సాక్షి, ద్రాక్షారామం: ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సప్తగోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని సోమవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. అనంతరం, మంగళవారం ఉదయం స్థానికులు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై భక్తులు మండిపడుతున్నారు.
ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ..‘ద్రాక్షారామాం ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడం దారుణం. ఎటువంటి సంప్రోక్షణ చెప్పకుండా హడావిడిగా మరో లింగాన్ని ఎందుకు ప్రతిష్టించారు. ధ్వంసమైన శివలింగానికి వేల ఏళ్ళ చరిత్ర ఉంది. హడావుడిగా కార్యక్రమం ఎందుకు చేశారు?. వ్యవస్థలను కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తోంది. మాట్లాడితే సనాతన ధర్మం అంటున్నారు. ఇదేనా సనాతన ధర్మం అంటే?. ఆలయ నిర్వహణ అధికారి ఆలయానికి రెగ్యులర్‌గా ఎందుకు రావటం లేదు అని ప్రశ్నించారు.
మరోవైపు.. దేవాలయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ మాట్లాడుతూ..‘ద్రాక్షారామంలో శివాలయంపై దాడి దుర్మార్గం. దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామంలో విధ్వంసం జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదు?. ఎలాంటి సంప్రోక్షణ జరగకుండానే విగ్రహాన్ని పునః ప్రతిష్టించటం అపచారం కాదా?. టీడీపీ కూటమి పాలనలో సనాతన ధర్మం ప్రమాదంలో పడింది. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికెళ్లారు?. ఆలయాలపై జరుగుతున్న దాడులపై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు. రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడికి ఐదు లక్షల రూపాయల సాయం ఎందుకు ఇచ్చారు?. చంద్రబాబు సర్కారుకు రాజకీయ లబ్ధి మినహా హిందువుల మనోభావాలు అక్కర్లేదా? అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హుటాహుటిన వచ్చి ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని రామచంద్రపురం మండలం తోటపేట గ్రామానికి చెందిన నీలం శ్రీనివాస్‌గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, నిందితుడి సోదరుడు అధికార టీడీపీ కార్యకర్త అని తెలిసింది. నిందితుడు కూడా టీడీపీ కార్యకర్త అని సమాచారం.


