సూపర్ సిక్స్ హామీలకు మంగళం.. మూడు బడ్జెట్లలో ఇచ్చింది సున్నా
నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి లాంటి ప్రధాన హామీలకూ దిక్కులేదు.. అరకొరగా విదిలించిన పథకాలకు భారీగా కోతలతో సరి..
ఎన్నికల ప్రధాన హామీలను నెరవేర్చకుండా మూడేళ్లలో అన్ని వర్గాలకు రూ.2.22 లక్షల కోట్ల మేర ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కారు
ఓ రాజకీయ పార్టీ ఇంటింటికీ గ్యారంటీతో బాండ్లు పంచి మరీ మోసగించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి
క్లాసిక్ కేస్ స్టడీ అంటున్న రాజకీయ విశ్లేషకులు.. అడ్డగోలుగా హామీలు.. అధికారంలోకి వచ్చాక వంచించడంపై దేశవ్యాప్తంగా చర్చ
రాజకీయ పార్టీలిచ్చే హామీలకు చట్టబద్ధత కల్పించాలని సర్వత్రా డిమాండ్లు
మేనిఫెస్టోకు చట్టబద్ధత ఉంటేనే ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందంటున్న న్యాయ నిపుణులు, ప్రజాస్వామ్యవాదులు
దీనిపై సుప్రీం, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వినతి
సాక్షి, అమరావతి:
⇒ నిరుద్యోగ భృతి కింద యువతకు నెలకు రూ.3 వేలు..
⇒ 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా ఏడాదికి రూ.18 వేలు..
⇒ 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్..
⇒ సున్నా వడ్డీతో మహిళా పొదుపు సంఘానికి రూ.10 లక్షలు, ఒక్కో రైతుకు రూ.3 లక్షలు చొప్పున రుణాలు..
⇒ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఐఆర్.. మెరుగైన పీఆర్సీ..!!
⇒ టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన హామీలివీ!
చంద్రబాబు ఎన్నికల మోసాలు.. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి మరీ వంచించడం.. మూడు బడ్జెట్లలోనూ సూపర్ సిక్స్‌ల ఊసే లేకపోవడం.. ఓ రాజకీయ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీలకే దిక్కులేకుండా పోవడంపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల హామీలను అమలు చేస్తామని ప్రతి ఇంటికీ గ్యారంటీతో బాండ్లు పంచి మరీ మోసగించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. ఇదో క్లాసిక్ కేస్ స్టడీ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రధాన పాత్ర పోషించాయని కూటమి నేతలు కూడా పలు సందర్భాల్లో అంగీకరించారు. అలాంటిది.. కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి దారితీసిన ఆ హామీలను అమలు చేయకపోవడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, రాజకీయాల్లో నైతికతకు తిలోదకాలు ఇవ్వడమేనని స్పష్టం చేస్తున్నారు.
మోసపూరిత హామీలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం.. వాటిని అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారనేందుకు చంద్రబాబు సర్కార్ అత్యుత్తమ ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మేనిఫెస్టోను ‘మోసఫెస్టో’గా మార్చేసి ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్యాన్ని సీఎం చంద్రబాబు అపహాస్యం చేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. చంద్రబాబు నేతృత్వంలో 2024–25, 2025–26, తాజాగా ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌లోనూ సూపర్ సిక్స్ హామీల అమలుకు కేటాయింపులు చేయలేదు. దీన్ని బట్టి ఆ హామీలకు ఇక మంగళం పాడేశామని మూడో బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు సర్కార్ తేల్చి చెప్పినట్లైందని పేర్కొంటున్నారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు సీఎం చంద్రబాబు సామూహికంగా వెన్నుపోటు పొడిచారన్నది స్పష్టమవుతోందని విశ్లేషిస్తున్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇలా అడ్డగోలుగా హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక రాజకీయ పార్టీలు వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంపై ఇటీవల దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. మేనిఫెస్టోకు చట్టబద్ధత ఉంటేనే ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజాస్వామ్యవాదులు స్పష్టం చేస్తున్నారు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతోపాటు ఎన్నికల కమిషన్ సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రజాస్వామ్య పునాదులను పరిరక్షించాలని కోరుతున్నారు.
హామీలకు గ్యారంటీ ఇస్తూ ఇంటింటికీ బాబు బాండ్లు..
సార్వత్రిక ఎన్నికలకు 11 నెలల ముందే 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా సూపర్ సిక్స్ హామీలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. సూపర్ సిక్స్.. సెవెన్.. అంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంటింటా ప్రచారం చేసి.. వాటి ద్వారా ఆ కుటుంబానికి ఐదేళ్లలో చేకూరే ప్రయోజనంపై గ్యారంటీ ఇస్తూ బాండ్లు జారీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’గా నామకరణం కూడా చేశారు. మహానాడు ముగిసినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ నియోజకవర్గాల టీడీపీ సమన్వయకర్తలు, నాయకులు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల పేర్లు ఆరా తీసి టీడీపీ మేనిఫెస్టో డాట్‌కామ్ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు.
కుటుంబ యజమాని ఫోన్ నెంబర్ తీసుకుని టీడీపీ మేనిఫెస్టో డాట్‌కామ్ వెబ్‌సైట్ ద్వారా ఓటీపీ పంపించారు. ఆ ఓటీపీ నెంబరును వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని సూపర్ సిక్స్ సహా వివిధ పథకాల ద్వారా ఆ కుటుంబానికి ఏటా చేకూరే లబ్ధి.. ఐదేళ్లకు ఒనగూరే ప్రయోజనంపై ప్రచారం చేశారు. టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు వెబ్‌సైట్‌కు మిస్డ్ కాల్ ఇప్పించారు. వారి ఫోన్ నెంబర్‌కు బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు పంపారు. వాటిని కుటుంబ సభ్యుల ముందే డౌన్‌లోడ్ చేయించారు.
వివిధ పథకాల కింద ఆ కుటుంబానికి చేకూరే లబ్ధి, ఆ హామీలను అమలు చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి చెబుతున్నానని ఆ బాండ్లలో చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ సహా హామీలన్నీ 2024 జూన్ నుంచే అమలు ప్రారంభమవుతుందని ఆ బాండ్లలో తేల్చి చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు పూచీ తనదంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అప్పట్లో నమ్మబలికారు.
బాండ్లు ఇచ్చి మోసగించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి...
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చి 20 నెలలు పూర్తయింది. మూడు బడ్జెట్‌లను ఇప్పటికే ప్రవేశపెట్టారు. వాటిలో సూపర్ సిక్స్ ప్రధాన హామీల అమలు ప్రస్తావనే లేదు. అంటే.. ఆ హామీలను అమలు చేయబోమని చంద్రబాబు సర్కార్ తెగేసి చెప్పిందన్నమాట! హామీల అమలుకు ఇంటింటా గ్యారంటీ బాండ్లు ఇచ్చి.. వాటిని అమలు చేయకుండా మోసం చేయడం దేశంలో ఇదే తొలిసారి అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో రెండో మూడో అమలు చేయకపోవడం సాధారణం. కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో సింహభాగం తుంగలో తొక్కడం ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొంటున్నారు.

సామూహికంగా వెన్నుపోటు..
సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలు 2024 జూన్ నుంచే ప్రారంభమవుతుందంటూ ప్రతి ఇంటికీ బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ ద్వారా ఇచ్చిన బాండ్ల మేరకు లబ్ధి చేకూరకపోవడంతో సర్వత్రా మండిపడుతున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన బాండ్లను పరిశీలించి సూపర్ సిక్స్ సహా వివిధ పథకాల కింద చంద్రబాబు ప్రభుత్వం తమ కుటుంబానికి ఎంత ఎగ్గొట్టిందో లెక్కలు వేసుకుంటున్నారు. ఆ బాండు ప్రకారం తమ ఇంటికి ఏడాదిలో రావాల్సిన మొత్తాన్ని లెక్కించి.. వడ్డీతో సహా చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
భృతి ఇవ్వకుండా ఎగ్గొట్టింది రూ.21,600 కోట్లు
సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా నిరుద్యోగ భృతి మాటే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా హామీ ప్రకారం ఏడాదికి మొత్తం రూ.7,200 కోట్లు చెల్లించాలి. మూడు బడ్జెట్లలోనూ పైసా ఇవ్వకుండా నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు మొత్తం రూ.21,600 కోట్లు ఎగ్గొట్టారు.

ఆడబిడ్డలకు రూ.97,200 కోట్ల ఎగనామం!
సూపర్ సిక్స్ హామీల్లో మరో ప్రధాన హామీ ఆడబిడ్డ నిధి పథకం. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 1.80 కోట్ల మంది ఉంటారు. వీరికి ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేలు చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ పథకానికి ఏటా రూ.32,400 కోట్లు అవసరం. కానీ.. మూడు బడ్జెట్లలోనూ ఒక్క పైసా కేటాయించలేదు. 2026–27 బడ్జెట్‌లోనూ కనీసం ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు చంద్రబాబు ఇప్పటికే రూ.97,200 కోట్లు ఎగ్గొట్టారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.28,800 కోట్లు బురిడీ!
50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు, పురుషులకు పెన్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. కానీ.. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఈ పథకానికి ఒక్క పైసా ఇవ్వకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చంద్రబాబు రూ.28,800 కోట్ల మేర ఎగ్గొట్టారు.
సున్నా వడ్డీకి సున్నా..
సున్నా వడ్డీ పథకం కింద స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు ఒక్కో సంఘానికి రూ.పది లక్షలు.. ఒక్కో రైతుకైతే రూ.3 లక్షలు చొప్పున రుణాలు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కోటి మందికిపైగా పొదుపు మహిళలు గతంలో ఏటా సున్నా వడ్డీ కింద లబ్ధి పొందారు. పొదుపు మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని వర్తింప చేయాలంటే ఏడాదికి రూ.5 వేల కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లించాలి. మూడు బడ్జెట్లలో నిధులు కేటాయించకుండా మహిళలకు చంద్రబాబు రూ.15 వేల కోట్లు మేర ఎగ్గొట్టారు! ఇక సున్నా వడ్డీ కింద ఒక్కో రైతుకు రూ.3 లక్షల రుణాన్ని ఇవ్వాలంటే ఏడాదికి కనీసం రూ.వెయ్యి కోట్లు అవసరం. కానీ.. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా నిధులు కేటాయించకుండా రైతులకు రూ.3 వేల కోట్లు మేర ఎగ్గొట్టారు. మొత్తంగా సున్నా వడ్డీ పథకానికి సున్నా చుట్టి మహిళలు, రైతులకు రూ.18 వేల కోట్ల మేర చంద్రబాబు ఎగనామం పెట్టారు!
ఉద్యోగుల బకాయిలు రూ.40 వేల కోట్లు!
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్, మెరుగైన పీఆర్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంతవరకూ ఐఆర్ ప్రకటించకపోగా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్‌ను రద్దు చేశారు. కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించలేదు. ప్రస్తుతం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లకు చేరుకున్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
తల్లులకు బాబు వంచన..
తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. ఈ పథకానికి ఒక్కొక్కరికీ ఏటా రూ.15 వేల వంతున ఏడాదికి మొత్తం రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో కేవలం 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. రెండేళ్లలో ఇప్పటికే తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా సీఎం చంద్రబాబు బకాయిపడ్డారు. ఇక ఇప్పుడు బడ్జెట్‌లో రూ.8457.07 కోట్లు మాత్రమే ప్రతిపాదించి ఏకంగా రూ.4,655.75 కోట్ల మేర కోతలు పెట్టారు. తద్వారా మూడేళ్లలో పిల్లలకు రూ.24,504 కోట్లను ఎగ్గొట్టారు!
రైతులకు వెన్నుపోటు..
పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.పది వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చారు. 6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా ఒక్కో రైతుకు రూ.30 వేలు బకాయి పడ్డారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు సీఎం చంద్రబాబు రెండేళ్లలో రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు. తాజా బడ్జెట్‌లోనూ (2026–27) అరకొరగా కేటాయింపులు చేసి రైతులకు మొత్తంగా మూడేళ్లలో దాదాపు రూ.21 వేల కోట్ల మేర ఎగ్గొట్టారు.
బడ్జెట్ సాక్షిగా సూపర్ సిక్స్‌లు ఔట్..!
ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్, పొదుపు మహిళలు, రైతులకు సున్నా వడ్డీ పథకాలకు పైసా కూడా కేటాయింపులు చేయకుండా బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు పూర్తిగా ఎగరగొట్టారు. ఎన్నికల హామీ మేరకు ఈ పథకాలను అమలు చేయకుండా చంద్రబాబు రూ.1.62 లక్షల కోట్లకుపైగా మహిళలు, నిరుద్యోగులు, రైతులకు ఎగ్గొట్టారు. ఇక తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం, ఉచిత బస్సు పథకాలకు అరకొరగా విదిలించి, తగినన్ని నిధులు ఇవ్వకుండా దాదాపు మరో రూ.60 వేల కోట్ల మేర ఎగ్గొట్టారు. ఇలా ఎన్నికల ప్రధాన హామీలను నెరవేర్చకుండా మూడేళ్లలో సుమారు రూ.2.22 లక్షల కోట్ల మేర అన్ని వర్గాలకు చంద్రబాబు ఎగ్గొట్టారు.


