విశ్లేషణ
పత్తి రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను చూడగా, 1990ల కాలం అని వార్యంగా గుర్తుకు వస్తున్నది. అప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలలో పత్తి రైతులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ రాష్ట్రాలలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని విదర్భ అయితే లెక్కలేనన్ని ఆత్మహత్యలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి 30 సంవత్సరాలు గడిచిన తర్వాత అటువంటి విపత్కర పరిస్థితి ఇంకా ఏర్పడనైతే లేదు; కానీ, నెమ్మదిగా రూపు తీసుకుంటున్న పరిణామాలను చూడగా, ఆ దుఃస్థితి పునరావృతం కాగలదేమోననే అనుమానం కలుగుతున్నది.
1990లలో జరిగిందేమిటి?
పత్తికి, నూలు వస్త్రాలకు భారతదేశం క్రీస్తు పూర్వం నుంచే పేరెన్నిక గన్నది కాగా, బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగిందే మిటో తెలిసిందే. అక్కడి మిల్లుల కోసం ఇక్కడి రైతును కొల్లగొట్టి, స్థానిక చేనేత పరిశ్రమను ధ్వంసం చేసి, నేత కార్మికుడిని ఆకలి చావుల పాలు చేశారు.
స్వాతంత్య్రానంతరం 1990లు వచ్చేసరికి అధికాదాయం పేరిట పత్తి పంటను విపరీతంగా ప్రోత్సహించి, అమ్మకాలను మాత్రం అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేసి, ధరలతో ఆటలాడారు. రైతు మరో పంటకు మారలేక, అక్కడే నిలవలేక, అప్పుల బాధకు తాళలేక, చావును ఎంచుకున్నాడు. ఆ సరికే భారత దేశపు డబ్ల్యూటీవో సభ్యత్వం, పశ్చిమ దేశాలకు కలసి వచ్చిన స్వేచ్ఛా వాణిజ్యం రైతు ఆత్మహత్యకు ఉరితాళ్లను పేనాయి.
డబ్ల్యూటీవో సమయంలో వ్యవసాయం, పాడి, మత్స్య ఉత్పత్తుల విషయమై ఇండియా, చైనా, బ్రెజిల్ తదితర దేశాలు ఒక్కటై గట్టిగా నిలబడి కొన్ని రాయితీలు సాధించాయి. ఆయా రంగాలపై కోట్లాదిమంది ఆధారపడి జీవిస్తున్నందున వాటిని కాపాడుకునేందుకు పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతులపై తగినన్ని సుంకాలు విధించే హక్కు సంపాదించటం వాటిలో ఒకటి. ముఖ్యంగా అమెరికా తమ రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తుండగా, ఇతర దేశాలు ఆ పని చేయరాదని ఆంక్షలు విధించటాన్ని అంగీకరించబోమన్నది మరొకటి.
ఇంత జరిగినా పాశ్చాత్య దేశాలు పత్తి కొనుగోళ్లు, తమ పత్తి ఎగుమతులు, అందుకు కోటాలు, వస్త్రాల ఎగుమతిలో కోటాలు వగైరా ఎత్తుగడలతో సృష్టించిన సమస్యలు తక్కువ కాదు. అధిక దిగుబడి వంగడాలపై వారిదే ఆధిపత్యం అయ్యింది. దీనంతటి ప్రభావాలు బట్టల మిల్లులు, పత్తి వ్యాపారులపై కన్నా పత్తి రైతుపైనే పడింది. ఇపుడు, స్వేచ్ఛా వాణిజ్యం తమకు లాభసాటిగా లేనట్లు భావిస్తున్న ప్రస్తుత అమెరికా ప్రభుత్వం, డబ్ల్యూటీవో నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించజూస్తుండటంతో, పత్తి రైతుకు 1990ల కాలం వలె కారు మేఘాలు తిరిగి కమ్ముకొస్తున్నాయి.
అమెరికా ఒత్తిడి
తమ కొత్త వ్యూహంలో భాగంగా స్వేచ్ఛా వాణిజ్యాన్ని గాలికి వదలిన అమెరికా, వేర్వేరు దేశాలతో విడివిడిగా వాణిజ్య ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నది. అందుకోసం చర్చల పేరిట ఒత్తిడి, బ్లాక్‌మెయిలింగ్ పద్ధతిని అనుసరిస్తున్నది. ఇతరులను దారికి తెచ్చు కునేందుకు మొదటనే సుంకాలను భారీ ఎత్తున పెంచివేసి, అవతలి దేశాలు వాటి సుంకాలను తాము చెప్పినట్లు మార్చాలని, ఎత్తి వేయాలని షరతులు పెడుతున్నది. తమ పత్తి, మొక్కజొన్న, సోయా వంటి ఉత్పత్తులకు పూర్తిగా గేట్లు తెరవాలంటున్నది. లేనట్లయితే, సుంకాలూ, వాణిజ్యాలతో సంబంధం ఉన్న రంగాలలోనే గాక,లేని విషయాలలోనూ ఏకపక్షపు చర్యలు తీసుకోగలమని హెచ్చరిస్తున్నది.
ఈ పరిస్థితుల మధ్య జరిగిందే అమెరికన్ పత్తి దిగుమతులపై ఉండిన 11 శాతం సుంకాన్ని భారత ప్రభుత్వం అకస్మాత్తుగా ఎత్తివేయటం. ఆ ఎత్తివేత మొదట గత ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే జరుగగా, తిరిగి డిసెంబర్ వరకు పొడిగించారు. ఇది తాత్కాలిక చర్య అని పైకి చెప్తున్నారు గానీ, నమ్మదగినట్టు లేదు. ఎందుకంటే, ఇదే సమయంలో అమెరికాతో కొత్త వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి.
ఆ ఒప్పందం ఈ సంవత్సరం ఆఖరు నాటికి జరగవచ్చునని భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌తో పాటు అమెరికన్ అధికారులు కూడా చెప్తున్నారు. అందు వల్ల, ఇప్పుడు తాత్కాలికం అంటున్నది దీర్ఘకాలికం కాగల ప్రమాదం పొంచి ఉంది. లేదా కనీసం 11 శాతం సుంకం గణనీయంగా తగ్గవచ్చు. ఏది జరిగినా ఇక్కడి పత్తి రైతుకు తీవ్ర ప్రమాదమే!
సుంకం ఎత్తివేత ప్రత్యేకంగా అమెరికాకు మాత్రమే చేయలేరు గనుక మౌలికంగానే రద్దు కావటంతో అమెరికా సహా వేర్వేరు దేశాల నుంచి పత్తి నిల్వలు వచ్చిపడటం మొదలైంది. భారత ప్రభుత్వం తన నష్టాలు తాను చేయటం మొదలు పెట్టింది. గతంలో రైతులు ఎంత పత్తి తెచ్చినా కొనుగోలు చేస్తుండిన కాటన్ కార్పొరేషన్, ఎకరానికి 12 క్వింటాళ్లు మాత్రమేనని ఈసారి సీజన్‌కు ముందు షరతు విధించింది.
పంట మార్కెట్‌కు రావటం మొదలైన తర్వాత తన ప్రకటనను తానే ఉల్లంఘిస్తూ 7 క్వింటాళ్లు మాత్రమే అంటు న్నది. తక్కిన పంటను వ్యాపారులు మద్దతు ధర కన్న తక్కువకు కొంటున్నా అధికారులు మాట్లాడటం లేదు. ఇదిగాక, ‘కపాస్ కిసాన్’ అనే కొత్త నిబంధన ఒకటి తీసుకువచ్చి, అందుకు అవస రమైన స్మార్ట్ ఫోన్లు లేని, ఆ సాంకేతికత తెలియని సామాన్య రైతులను యాతనలకు గురి చేయటం మొదలు పెట్టింది. ఇక, పత్తిలో తేమ నిబంధనలు ఎప్పుడూ ఉన్నవే.
ఒప్పందం ఇంకెలా ఉండగలదో!
అధికారికంగా సుంకాల ఎత్తివేత నుంచి మొదలుకొని, క్షేత్ర స్థాయిలో ఈ విధమైన ఎత్తుగడలు గానీ, కొత్త కాదు. అదే కథ తిరిగి నడుస్తున్నది. అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోతున్న తీరును చూసినప్పుడు, పత్తి రైతుకు 1990ల నాటి పరిస్థితి పునరావృతం కాగలదేమోననే భయం కలుగుతుండటం అందువల్లనే! మనం మరొకటి గమనిస్తున్నట్లు లేము.
పత్తితో పాటు మొక్కజొన్నను, సోయాను కూడా అమెరికా బలవంతంగా ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నది. అందుకు సహకరిస్తున్నారా అనే అనుమానం కలిగేట్లు, మొక్కజొన్న పంటను రైతుల నుంచి కొనుగోలు చేయటంలోనూ పత్తి పంట తరహా షరతులు విధిస్తున్నారు. ఎకరానికి 18 క్వింటాళ్లు మాత్రమే కొనగలమన్నది ఆ నిబంధన. దీనిని బట్టి, అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఎట్లుండవచ్చునో ఎవరి ఊహ వారు చేయవచ్చు.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


