పరిహారం ‘అణు’వంతేనా? | Sakshi Guest Column On Nuclear energy | Sakshi
Sakshi News home page

పరిహారం ‘అణు’వంతేనా?

Dec 26 2025 12:41 AM | Updated on Dec 26 2025 12:41 AM

Sakshi Guest Column On Nuclear energy

విశ్లేషణ

భారత రూపాంతరీకరణకు ఉద్దేశించిన ‘అణు శక్తి స్థిర వినియోగ–పురోగతి బిల్లు (శాంతి) 2025’కు పార్లమెంట్‌ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇది అణు శక్తికి సంబంధించి మూడు కీలక అంశాలపై చిరకాలంగా ఉన్న చర్చను మళ్ళీ రేకెత్తించింది. అవి: అణుశక్తి అభివృద్ధి–నియంత్రణ; ప్రమాదాలు సంభవించినపుడు సివిల్‌ లయబిలిటీ; అణు శక్తి ఉత్పాదనలో ప్రైవేటు భాగస్వామ్యం. అటామిక్‌ ఎనర్జీ చట్టం (1962), సివిల్‌ లయబిలిటీ–న్యూక్లియర్‌ డ్యామేజ్‌ చట్టం (2010) స్థానంలో ఈ కొత్త చట్టాన్ని తెచ్చారు. అణుశక్తి అభివృద్ధి –వినియోగానికి 1962 నాటి చట్టం వీలు కల్పిస్తే, అణు ప్రమాదాలు సంభవించిన పక్షంలో బాధ్యత వహించడం, పరిహారం చెల్లించడా నికి సంబంధించి ఒక చట్రాన్ని 2010 నాటి చట్టం అందించింది. 

స్వతంత్ర నియంత్రణకు సుముఖం కాదా?
విద్యుదుత్పాదనకు చిన్న మాడ్యులర్‌ రియాక్టర్లు (ఎస్‌ఎంఆర్‌) అందుబాటులోకి రావడం, 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యు దుత్పాదన గడించాలనే ఆశావహ లక్ష్యసాధనకు ప్రైవేటు రంగ భాగస్వామ్యం అవసరమవడం అనే రెండు కారణాల రీత్యా కొత్త చట్టం అవసరమైందని ప్రభుత్వం వివరించింది. 

అణు విద్యుదుత్పాదనలో ప్రైవేటు రంగానికి ద్వారాలు తెర వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో... నియంత్రణ, లయబిలిటీ చట్రాలు రెండూ అత్యంత ముఖ్యమైనవిగా పరిణమించాయి. అవి రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి. నియంత్రణకు సంబంధించి కొత్త చట్టం యథాతథ స్థితినే కొనసాగించింది. అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్బీ) గతంలో మాదిరిగానే పని చేస్తుంది. అణుశక్తి అభివృద్ధి మొగ్గ తొడుగుతున్న 1960లలో, రేడియేషన్‌ సదుపాయాలలో రేడియేషన్‌ సురక్షణను అమలుపరచేందుకు, అటా మిక్‌ ఎనర్జీ శాఖ (డీఏఈ)కు వెలుపల డైరెక్టరేట్‌ ఆఫ్‌ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌ (డీఆర్పీ) ఏర్పాటు చేశారు. 

హోమీ భాభా తర్వాత అణుశక్తి శాఖ బాధ్యతలు చేపట్టిన విక్రమ్‌ సారాభాయ్, స్వతంత్ర అణుశక్తి నియంత్రణ సంస్థ (ఏఈఆర్‌ఏ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారుగానీ, ఆ భావన అమలుకు నోచుకోక ముందే, ఆయన కన్నుమూశారు. ఆయన వారసుడు హోమి ఎన్‌.సేత్నా ఏఈఆర్‌ఏ ఆలోచనను పక్కనపెట్టి, డీఆర్పీని కొనసాగించాలని నిర్ణయించారు. రాజా రామన్న 1983లో నియంత్రణ సంస్థ (ఏఈఆర్బీ)కు పచ్చ జెండా ఊపారు. కానీ, అది ఇతర రంగాలలోని అదే రకమైన సంస్థలలాగా పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగినది కాదు. ఈ 2025 చట్టం కూడా ప్రస్తుత ఏఈఆర్బీ చట్రాన్ని కొనసాగించేందుకే మొగ్గు చూపింది. 

స్వతంత్ర నియంత్రణ సంస్థ ఆలోచనకు అణుశక్తి వ్యవస్థ సానుకూలంగా లేదని స్పష్టమవుతోంది. అణుశక్తి శాఖ పరిధిలోనే ఏఈఆర్బీ పనిచేస్తున్నప్పటికీ, గతంలో అది నీళ్ళు నమలకుండా పనిచేసిన దాఖలాలు లేకపోలేదు. వివిధ సందర్భాలలో నియమాల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించినపుడు ఏఈఆర్బీ–ముఖ్యంగా ఎ. గోపాలకృష్ణన్‌ అధ్యక్షుడిగా ఉన్నపుడు– విద్యుదుత్పాదన కేంద్రాలు, ఇతర సంస్థలపై ఆంక్షల రూపంలో కొరడా ఝళిపించింది. 

పరిహారానికి పరిమితులా?
ఇపుడు ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరుస్తున్నారు కనుక, నిజాయతీగా పనిచేసే, సాంకేతికంగా బలోపేతమైన స్వతంత్ర వ్యవస్థ అవసరం ఉంది. దేశ పురోగతి ముసుగులోనే అయినప్పటికీ, ఏఈఆర్బీ యథాతథ స్థితిని కొనసాగించడం శుభ సూచకం కాదు. ప్రైవేటు రంగాన్ని అనుమతించిన అంతరిక్ష రంగంలో కూడా ప్రభుత్వం స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడానికి బదులుగా ఇన్‌–స్పేస్‌ పేరుతో, ఏ ఎండకా గొడుగు పట్టే సంస్థనే సృష్టించింది. ఒక విధానాన్ని ప్రోత్సహించే, నియంత్రించే రెండూ ఒకే చూరు కింద ఉండకూడదన్నది మూలసూత్రం కావాలి. 

అణు దుర్ఘటనలు సంభవిస్తే కలిగే నష్టానికి లయబిలిటీ విషయంలో నియంత్రణ సంస్థ ఎలా వ్యవహరిస్తుందన్నది ప్రశ్న. నియంత్రణ కఠినంగా లేకపోతే, ప్రమాదాలకు తావు ఇచ్చినట్లు అవుతుంది. లయబిలిటీకి సంబంధించి అంతర్జాతీయంగా పాటించే నియమాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. జాతీయ చట్టాలు కూడా వాటికి అనుగుణంగా రూపొందాలి. అణు ప్రమాదం సంభవించిన చోట మూడవ పక్షానికి పరిహారం చెల్లించే బాధ్యత న్యూక్లియర్‌ ఇన్‌స్టలేషన్‌ ఆపరేటర్‌ పైనే ఉంటుందని అంతర్జాతీయ కట్టుబాట్లు చాలా వరకు నిర్దేశిస్తున్నాయి. ఇక్కడ న్యూక్లియర్‌ ఇన్‌స్టలేషన్‌ అంటే న్యూక్లియర్‌ రియాక్టర్‌ కిందనే లెక్క. కానీ, ఇతర సదుపాయాలున్న న్యూక్లియర్‌ సైట్‌ వద్ద కూడా దుర్ఘటన సంభవించవచ్చు. 

లయబిలిటీని అనేక అంశాలు నిర్ణయిస్తాయి. ప్రస్తుత చట్టంలో పరిహారంపై రూ. 3,000 కోట్ల పరిమితి విధించడం, దాన్ని న్యూక్లియర్‌ ప్లాంట్‌ ప్రదేశంతో ముడిపెట్టడం అసంబద్ధం. చిన్న రియాక్టర్లకు (150 మెగావాట్ల నుంచి 750 మెగావాట్ల ఉత్పాదన సామర్థ్యం ఉన్నవి) లయబిలిటీని మరీ తక్కువగా రూ. 300 కోట్లుగా నిర్ణయించారు. ఇక 150 మెగావాట్ల కన్నా తక్కువ సామర్థ్యం ఉన్నవాటికి కేవలం రూ. 100 కోట్లనే నిర్ణయించారు. చిన్న మాడ్యులర్‌ రియాక్టర్లను ప్రోత్సహిస్తున్న సంస్థలను మచ్చిక చేసుకునేందుకే అలా నిర్ణయించారని తేటతెల్లమవుతోంది. 

హెచ్చు సామర్థ్యమున్న భారీ అణు విద్యుదుత్పాదన కేంద్రాలను నెలకొల్పేందుకు పెద్ద మొత్తాలలో పెట్టుబడులు అవసరమవుతాయి. అవి నిర్మాణం పూర్తి చేసుకుని, ఉత్పాదన ప్రారంభించేందుకు సమయం కూడా ఎక్కువ పడుతుంది. అణు విపత్తులలో లయబిలిటీ చట్రాన్ని సడలించడం ద్వారా, మాడ్యులర్‌ రియాక్టర్ల వల్ల పెద్ద నష్టం ఉండ బోదని ఆ పరిశ్రమ నమ్మించే ప్రయత్నం చేస్తోంది. లయబిలిటీలను వర్గీకరించడం ద్వారా కొత్త చట్టం ఆ పరిశ్రమను సంతృప్తి పరచింది. 

భోపాల్‌ దుర్ఘటన పాఠాలు నేర్చుకున్నామా?
అణు రియాక్టర్ల వద్ద (అణు ఇంధన వలయ సదుపాయాలతో కూడుకుని) తలెత్తే ప్రమాదాలను కొత్త చట్టం నిర్వచించి, లయబిలి టీలను కూడా నిర్ణయించింది. కానీ, ‘అణు సదుపాయాలు’గా నిర్వ  చించిన చోట్ల ప్రమాదాలు సంభవిస్తే, లేదా అణు ధార్మికత వెలు వడితే ఏమిటన్న దానిపై మౌనం వహించింది. అలాంటి పరిస  రాలలో ఏదైనా సంభవిస్తే ఆ నష్టాలకు పరిహారం చెల్లించే బాధ్యత ఎవరిది? ‘న్యూక్లియర్‌ డ్యామేజీ’ అనే దానికి మాత్రం చట్టంలో విçస్తృతార్థం ఇచ్చారు. ప్రాణ నష్టం, గాయపడటం, ఆస్తి నష్టం, ఆర్థిక నష్టం, అణు ప్రమాదం వల్ల దెబ్బతిన్న పర్యావరణాన్ని పునరుద్ధరించేందుకు అయ్యే వ్యయం అంటూ దానిలో చాలా వాటిని చేర్చారు. కానీ, లయబిలిటీ పరిమితిని మాత్రం రూ. 100 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లుగా పేర్కొన్నారు. 

2010లో సంభవించిన సముద్ర ప్రమాదానికి గానూ బ్రిటిష్‌ పెట్రోలియం సంస్థ 65 బిలియన్‌ డాలర్లు చెల్లించింది. అదే భోపాల్‌లో యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీలో మిథైల్‌ ఐసోసైనేట్‌ గ్యాస్‌ లీకవడాన్ని ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ఉపద్రవంగా చెబుతారు. కానీ దాని బాధితుల్లో పరిహారం కోసం ఎదురు చూస్తున్నవారు ఇంకా ఉన్నారు. పర్యావరణ నష్టానికి ఎవరూ చెల్లించింది ఏమీ లేదు. మళ్లీ మధ్యవర్తిత్వం నెరపే ప్రయత్నమూ లేదు. అణుశక్తి విషయంలో అడుగు ముందుకేసే ముందు గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. పెంపొందించే పని, నియంత్రణ ఒకే చూరు కింద సంసారం చేయకూడదు.

దినేశ్‌ సి. శర్మ 
వ్యాసకర్త సైన్స్‌ కామెంటేటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement