ఇది భారతీయ–అమెరికన్ల విజయం | Sakshi Guest Column On Indian Americans Victory | Sakshi
Sakshi News home page

ఇది భారతీయ–అమెరికన్ల విజయం

Nov 12 2025 1:24 AM | Updated on Nov 12 2025 1:24 AM

Sakshi Guest Column On Indian Americans Victory

కుటుంబంతో... న్యూయార్క్‌ నగర మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్‌ మమ్దానీ

అభిప్రాయం

‘భారతీయులు వెళ్లిపోవాలి’... ఇదే ‘మాగా’ (మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌) మూకలు ఏడాదిగా చేస్తున్న నినాదం. భారతి సంతతి అమెరికన్లు వారి నినాదం విన్నారు, వెళ్లిపోయారు; కానీ ఇండియాకు కాదు. తాము ఎప్పటినుంచో మద్దతిస్తూ వచ్చి మధ్యలో వదిలేసిన డెమాక్రటిక్‌ పార్టీలోకి తిరిగి వెళ్లారు! న్యూయార్క్‌ నగర పునాదులను వారు కదిలించారు.

సినీ దర్శకురాలు మీరా నాయర్‌ కుమారుడు, 34 ఏళ్ల జోహ్రాన్‌ మమ్దానీ తాజా మేయర్‌ ఎన్నికల్లో బ్రహ్మండమైన విజయం సాధించారు. మాజీ గవర్నర్‌ ఆండ్రూ కుమో చిత్తుగా ఓడిపోయారు. మమ్దానీ న్యూయార్క్‌ మొట్టమొదటి ముస్లిం మేయర్‌. భారత మూలాలున్న తొలి మేయర్‌. ఈ వందేళ్లలో ఈ పదవికి ఎన్నికైన అతి పిన్న వయస్కుడు కూడా! 

మారిన రాజకీయ మొగ్గు
‘అమెరికన్‌ డ్రీమ్‌’ను సాకారం చేసుకునేందుకు వచ్చిన భారతీయులు– విద్యావంతులు, కుటుంబ జీవులు సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఒక ఆదర్శప్రాయమైన సమాజంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సాంప్రదాయికంగా మేము డెమాక్రటిక్‌ పార్టీ సానుభూతిపరులం. ఇటీవలి కాలంలో మాలో చాలామంది రిపబ్లికన్‌ పార్టీ వైపు మొగ్గడం మొదలైంది. 

క్రమశిక్షణ, వ్యాపార వ్యవస్థాపక సామర్థ్యం, కుటుంబ విలువల పరంగా అది మా జీవి తానుభవానికి దగ్గరగా ఉండటం, మరోవంక డెమాక్రాట్లు రాను రానూ సాంస్కృతిక పోరాటాల్లో మునిగిపోవటం ఇందుకు కారణాలు. నేను కూడా ఈ ఆకర్షణలో పడ్డాను. 1980లో అమెరికా వచ్చి నప్పటి నుంచీ నేను డెమాక్రాట్స్‌కే ఓటు వేశాను. గత అధ్యక్ష ఎన్ని కలకు మాత్రం దూరంగా ఉన్నాను. జో బైడెన్‌కు వయసు మీరడం, స్పష్టమైన దిశ కొరవడటం వల్ల ఆయన అభ్యర్థిత్వం నాకు నచ్చ లేదు. మరోవంక, రిపబ్లికన్‌ పార్టీ చెబుతున్నదీ కొంతవరకు సబబు గానే అనిపించింది.    
 
కుటుంబం, మతవిశ్వాసం అంశాలపై డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రసంగాలు, సోషలిజం గురించి ఆయన చేసిన హెచ్చరికలు నన్ను ఆకట్టు కున్నాయి. మాలో ఇండియాలో పుట్టిపెరిగిన వారున్నారు. వారికి ‘సామ్యవాదం’ అనేది శుద్ధమైన సిద్ధాంతంగా అనిపించదు. రేషన్‌ క్యూలైన్లు, సరుకుల కొరతలు, ప్రజలు ఏది తినాలో ఎంత సంపా దించాలో నిర్ణయించే అవినీతిపరులైన అధికార గణం... ఇవన్నీ సామ్యవాదపు వాస్తవికతకు అద్దం పడతాయి. 

చెదిరిన ఆశలు
నాలాంటి వలసదారులకు, కింది స్థాయి నుంచి ఉన్నత స్థానా లకు ఎదిగిన నిక్కీ హేలీ, వివేక్‌ రామస్వామి, ఉషా వాన్స్‌ వంటి వారికి రిపబ్లికన్‌ పార్టీ  ద్వారాలు తెరుస్తుందని నేను అనుకున్నాను. కానీ గడచిన ఏడాది కాలంలో మా ఆశలు హరించుకుపోయాయి.  ఒకప్పుడు ఎవరితోనైతే స్నేహం చేసిందో ఇప్పుడు వారిమీదే ‘మాగా’ ఉద్యమం నిప్పులు చెరుగుతోంది. 

లారా లూమర్‌ వంటి ఇన్‌ఫ్లుయె న్సర్లు ఇండియన్‌ ప్రొఫెషనల్స్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. మార్జోరీ టేలర్‌ గ్రీన్‌ వంటి కాంగ్రెస్‌ సభ్యులు హెచ్‌–1బి వీసాలకు మంగళం పాడాలని పిలుపునిచ్చారు. భారతీయులు ‘అమెరికన్ల ఉద్యోగాలు దొంగిలిస్తున్నారు’ అని దుష్ప్రచారం చేశారు. సంకే తాలు స్పష్టంగా వెలువడుతున్నాయి: మేం అమెరికాకు ఎంత చేసినా, ఎప్పటికీ పూర్తి అమెరికన్లం కాబోము!

అమెరికా జనాభాలో ఇండియన్‌ అమెరికన్లు రెండు శాతం
కంటే తక్కువే ఉండొచ్చు. కానీ ప్రభుత్వ పన్నుల ఆదాయంలో వారి వాటా దాదాపు 6 శాతం. మా సగటు కుటుంబ ఆదాయం జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు. ‘ఫార్చ్యూన్‌ 500’ జాబితాలోని 16 కంపెనీలకు భారత సంతతి సీఈవోలే సారథ్యం వహిస్తున్నారు. వారి నాయకత్వంలోని ఈ కంపెనీల వార్షిక ఆదాయం లక్ష కోట్ల డాలర్లకు పైనే ఉంటుంది.  

స్థానిక ఆర్థిక వ్యవస్థలకు పట్టుగొమ్మలుగా ఉన్న చిన్న వ్యాపా రుల నుంచి యూనివర్సిటీలు, ఆసుపత్రులను నిర్వహించే సైంటి స్టులు, ఇంజినీర్లు, వైద్యుల వరకు పలు రంగాల్లో విస్తరించి ఉన్న భారత సంతతి ప్రజలు మరే ఇతర దేశాల వలసదారుల కంటే మిన్నగా అమెరికాను బలోపేతం చేస్తున్నారు. అమెరికా అభ్యున్నతికి దశాబ్దాలుగా శ్రమిస్తున్న మమ్మల్ని ‘గో హోమ్‌’ అనడం ద్రోహమే!

భారత సంతతి అమెరికన్లకు గుండెకాయ లాంటి న్యూజెర్సీ లోని ఎడిసన్  ఓటర్లు ఈ అవమానానికి తగిన జవాబు చెప్పారు. 2024లో అక్కడి ఒక  ప్రదేశం ట్రంప్‌కు 30 పాయింట్ల ఆధిక్యంఇచ్చింది. ఈ నెలలో, డెమాక్రాట్‌ మికీ షెర్రిల్‌ దాన్ని 76 పాయింట్ల తేడాతో గెలుచుకున్నాడు. 106 పాయింట్ల ఈ స్వింగ్‌కు విధానాలతో సంబంధం లేదు; ఆత్మగౌరవం తెచ్చిన మార్పు ఇది.

డెమాక్రాట్లా? రిపబ్లికన్లా? 
ఏమైనా, పార్టీ విధేయతకు సంబంధం లేని కారణాలతోనే భార తీయ అమెరికన్లు డెమాక్రాట్ల చెంతకు తిరిగి వస్తున్నారు. ఆత్మ గౌరవం, అస్తిత్వ రక్షణ అవసరమే ఈ మార్పు తెచ్చింది. అంతేగానీ ప్రగతిశీల రాజకీయాల పట్ల మూఢభక్తి ఇందుకు కారణం కాదు.

డెమాక్రటిక్‌ పార్టీ అన్ని వర్గాలనూ కలుపుకొనిపోవడం గురించి మాట్లాడుతుంది. అయితే, ఒకప్పడు తనకు కంచుకోటలా ఉన్న మధ్యతరగతితో ఇప్పుడు సంబంధం కోల్పోయింది. వలసదారులు పాటించే కుటుంబ విలువల నుంచి అది దూరం జరిగింది. శ్రామిక కుటుంబాల రోజువారీ బతుకు పోరాటాలను విస్మరించింది. అతి వాదుల చేతిలో ఆ పార్టీ బందీగా మారింది. 

సంస్కృతుల పోరా టాల్లో అది మునిగితేలుతోంది. ‘బాలికలు దుస్తులు మార్చుకునే గదుల్లో (లాకర్‌ రూమ్స్‌లో) బాలురు ఉండటం’ అనే అంశం మీద స్కూళ్లు చర్చలు నిర్వహించేదాకా పరిస్థితి వెళ్లింది. ఒకపక్క మౌలిక విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్న సమయంలో ఇలాంటి చర్చలు జరగడం పట్ల ‘నా’ లాంటి వలసదారులు సహా పలువురు అమెరి కన్‌ తల్లితండ్రులు దిగ్భ్రాంతి చెందారు.

మమ్దానీ గెలుపు ఈ నూతన వాస్తవికత రెండు పార్శ్వాలను ప్రతిబింబిస్తోంది. ఒక సమాజపు ఆత్మవిశ్వాసం, స్వరం ఆయన ఎన్నిక వెనుక ఉన్నాయి. అదే సమయంలో, వాస్తవిక దృక్పథం లోపించిన సిద్ధాంతంతో ముడిపడిన ప్రమాదాలనూ అది వెల్లడిస్తోంది. నిత్యావసర వస్తువుల దుకాణాలు నిర్వహిస్తామన్న ఆయన వాగ్దానం దయాపూరితంగా కనబడుతుంది. కానీ, పాత కాలపు ఇండియన్‌ సోషలిస్టు మోడల్‌ గురించి తెలిసిన నా లాంటి వారికి ఈ కథ ముగింపు ఎలా ఉండబోతోందో బాగా తెలుసు.   

అధికార గణస్వామ్యం, జనాకర్షక విధానం స్వల్పకాలంలో ప్రశంసలు కురిపించవచ్చు. అయితే అవి ప్రగతికి శత్రువులు.  నాణ్యతకు బదులు నాసిరకంలో సమానత్వం వస్తుంది.

రిపబ్లికన్లకు ఇప్పటికీ అవకాశం ఉంది. అయితే వారు తమ దౌర్జన్య వైఖరిని విడనాడాలి. ఒకప్పుడు తమకు వన్నె తెచ్చిన తెగువ, యోగ్యత, ఆశావాదం వంటి విలువలను తిరిగి ఒంటబట్టించుకోవాలి. అందాకా, వారికి దూరమైన ఓటర్లు దూరంగానే ఉంటారు.

వివేక్‌ వాధ్వా
వ్యాసకర్త విశ్లేషకుడు – ‘వయోనిక్స్‌ బయోసైన్సెస్‌’ సీఈఓ
(‘ద హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement